బాల్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బాల్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, నవంబర్ 2011, మంగళవారం

తెల్ల బూట్లు

సాఫీగా సాగుతున్న నా స్కూల్ ప్రయాణంలో ఆ గంబీరమైన రోజు రానే వచ్చింది.
"పిల్లలు ప్రతి శుక్రవారం వైట్ డ్రెస్, వైట్ షూస్ వేసుకొని రావాలి. మీ పేరెంట్స్ కి చెప్పి వెంటనే కుట్టించుకోండి. సరేనా.. "
"సరే.. టీచర్" అని నేను కూడా వంత పాడాను అందరు పిలగాండ్లతో...

ఇదే విషయం అమ్మకు చెప్పాను. "తెల్ల బట్టలా.." అని వెలితిగా చూసింది.
ఆ.. అవును తెల్ల బట్టలే.. వేసుకెల్లకపోతే పనిశుమెంటట..
చెప్పిన ఐదారు వారాలకు గాని కుట్టించలేదు. నాకు మా అక్కకి.
అప్పటి దాక శుక్రవారం వొస్తుందంటేనే ఎదోల అనిపించేది.
తెల్ల బట్టలైతే వేసుకొన్నాను. కాని తెల్ల బూట్లు మాత్రం రాలేదు.

ఒక సారి మాములుగా నిల్చోబెడితే మరో సారి గోడ కుర్చీ వేయించేవొళ్ళు. అప్పటి వరకు ఎప్పుడు పనిష్మెంటు అంటే ఎరుగని నాకు నా పరిధిలో లేని బూట్ల విషయం కోసం వేయల్సోచ్చింది.

అమ్మ కి అంతకు ముందే చెప్పాను, తెల్ల బూట్లు కావాలని. ఒక సారి చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్పడమెందుకని చెప్పలేదు.
గోడ కుర్చీ విషయం అమ్మ కి తెలిస్తే తను తట్టుకోలేదు అందుకే ఇది కూడా చెప్పలేదు.
తెల్ల బూట్ల కోసం అందరు చూస్తుండగా దుఖ్ఖం దిగమింగుకొని తప్పు చేసినోడిలా తల కిందికేసుకొని గోడ కుర్చీ వేసేవోన్ని.
అప్పట్లో నాకు అర్ధం కాని విషయం నా పక్కన కూసునే వోల్లందరికీ వచ్చినట్టు నాకెందుకు రాలేదా ఈ తెల్ల బూట్లు అని.

సాధారణంగా శుక్రవారమంటే నాకు ఇష్టం. మా పాత స్కూల్ (ఏడో తరగతిలో స్కూల్ని మచిలిబజార్ నుండి ఉజిలిబెస్ కి మార్చినారు. ఇది ఐదో తరగతి నాటి మాట) ఎదురుగా కూలిపోయిన గోడలు ముళ్ళ చెట్లు దాని వెనకాల కాలి స్థలం అది మాబోటి పిలగాండ్లకి ఆటస్థలం. మట్టి గోడల పక్కనే మసీదు ఉండేది. ప్రతి శుక్రవారం మధ్యానం పూట నమాజు కోసమనే గల్లిలల్ల ఉన్న ముస్లీములంత లాల్చి పైజాములు వేసుకొని వొచ్చేటోల్లు. మొదటి అంతస్తులో మా క్లాసు. ప్రతి శుక్రవారం నమాజు, మైకు గొట్టం నుండి పెద్దగ వినపడేది. కిటికీ లోనుండి తొంగి చూస్తూ నమాజుకోచ్చిన జనాలని, దూరంగా ఉన్న గుట్టలని, కొంచెం వంగి చూస్తే రెండు చెట్ల గుట్ట (పెద్దవిగ ఉండడంతో ఆ పేరొచ్చింది. ఆ చెట్ల గురించి చాల కథలు కథలుగా చెప్పుకునే వారు), దానికి అనుకోని ఉన్న ఓ పెద్ద రాయి, వినాయకుడిని పెట్టె చోటు, అన్ని చూస్తూ ప్రశాంతంగ  వీస్తున్న గాలి సవ్వళ్ళను ఆస్వాదిస్తున్న నాకు.  రఘు వైట్ షూస్ వేసుకురాలేద అనడంతో చటుక్కున మెలకువ వచ్చి మల్లి దడ మొదలయింది. ఈ బూట్ల గొడవ తగిలిన కాడి నుంచి మనసు మనసులోనే లేదు. అనుకుంటూ, లేదు టీచర్ వేసుకురాలేదు. అని చెప్పాను, ఇంకేవరెవరు వేసుకు రాలేదు. అందరు వచ్చి గుంజీలు తీయండి. అని చెప్పడం తో నాకు తోడుగా మూడు డబ్బాల కాడి హరి, శంకర్ వచ్చాడు.
తల ఇరవై గుంజీలు తీసి, నాలో నేను కుంచించుకు పోతు గబుక్కున వచ్చి నా జాగా లో కూర్చున్న.

బెల్లు మోగడంతో పరుగుపరుగున అందరితో బాటు పుస్తకాల మూటని బుజాలకేసుకొని నిక్కరు సరి చేసుకుంటూ గబా గబా మెట్లు దిగి కింది కొచ్చి అక్కయ కోసం చూస్తూ నిల్చున్న..
కళ్ళలో నీళ్ళు తెచ్చుకుందేమో ఎదోల ఉంది. ఏమి మాట్లాడలేదు. ఇద్దరం కలిసి ఇంటి ముఖం పట్టాం. ఇంట్లో అడుగు పెట్టాకా గాని నోరుతేరవలేదు అక్కయ.  ఉన్నపలానా ఏడుపందుకుంది. వైట్ షూస్ వేసుకురలేదని టీచర్ కొట్టిందని.

ఈ ఆదివారం చౌరస్తాకి బోయి కొందాం ఊరుకో అని చెప్పడం తో ఊరుకుంది. అక్కయతో పాటు నాక్కూడా కొనిస్తుంధిగా మళ్లీ నేనేడవడం ఎందుకు అనుకున్నాను.

తెల్లారితే శనివారం. ఆదివారం గురించి, చౌరస్తా గురించి, ఆలోచిస్తూ ఒక్క పూట గడిచిపోయింది. ఎందుకో నాకు ఊహ తెలిసినప్పటి నుండి హన్మకొండ  చౌరస్తా అంటే ఎక్కడలేని అభిమానం నాకు, కొత్త బట్టలకి, కొత్త పుస్తకాలకు, మా చిన్నమ్మని బస్సు ఎక్కించేందుకు, స్టౌ బర్నాల్ రిపేరుకు, పళ్ళు కొనుక్కోవడానికి, గాజులు, వంట గిన్నెలు, ఇలా రకా రకాల కోసం చౌరస్తాకి మా అమ్మ నన్ను తోలుకుబోయేది.

ఎప్పుడైనా చౌరస్తాకు బోతున్నాం అని చెప్తే చాలు, మొఖం కడుక్కోచ్చుకొని చిన్నగా గుండ్రటి డబ్బాలో ఉన్న పౌడర్ని దూది పువ్వుతో మొఖానికి  రాసుకొని తయారయ్యేటోన్ని.

అనుకున్నట్టుగానే ఆదివారం వచ్చింది. మొన్న మొదలయిన నా సంబరం, ఈ రోజుకి పెరుగుతూ పెరుగుతూ నాలుగింతలు ఎక్కువైంది. ఈ రోజు కొనే బూట్లని వేసుకెల్లడానికి  శుక్రవారం ఎప్పుడేప్పుడువొస్తుంద అనేకాడికి చేరుకుంది నా సంబరం.

ఎప్పటి లాగే రోడ్డుకిరువైపు జరుగుతున్న, కనిపిస్తున్న దృశ్యాలను చూస్తూ, ఏవేవో ఆలోచిస్తూ, అమ్మ వేలుని గట్టిగ పట్టుకొని నిక్కరు సర్దుకుంటూ మూతి ముక్కు తుడుచుకుంటూ, నడుచుకుంటూ, ఇరవై నిమిషాలకు గాని చేరుకోలేదు చౌరస్తాకి.

ఎప్పుడు వెళ్ళే గడ్డం మూసలయన ఉండే చెప్పుల షాపుకి వెళ్ళాం. నా ముప్పై రూపాయల పారగన్ చెప్పులు, నా నల్ల బూట్లు వాటికి కట్టుకొనే దారాలు సాక్సులు  గీడనే కొనుక్కున్నాం.

ముందు అక్కయ్య కోసమని చుపెడుతున్నాడు. చూస్తున్న కొద్ది ఎప్పుడెప్పుడు నాకు చూపిస్తాడ అని, నా చెప్పులు పక్కన విప్పి కాలి కాళ్ళతో నిల్చుని చూస్తున్న. అన్ని చూసిన  కాసేపటికి ఒకటి సెలెక్టు చేసుకుంది అక్కయ.

ఇక నావంతుగ వెళ్లి పొట్టి బల్లపై కూర్చున్న అన్ని చూపిస్తున్నాడు. ఒకటి వేసుకున్నాను. ఆ మంచిగున్నాయ్ చాలు. అని చెప్పి, డబ్బల బెట్టి కవర్లో పెట్టి ఇవ్వు అని చెప్పి లేచాను.

ఎత్తు పట్టీల చెప్పుల వైపు చూస్తూ అక్క, నా సంబరం లో నేను,  బెరమాడడంలో అమ్మ.

నాకు ఏమి వినిపించలేదు ఆ బేరాలు, కాని చివరకి ఒకటి మాత్రం చక్కగా వినపడింది. "ఆ చిన్న బూట్లు తీసేయ్ ఇప్పుడు డబ్బులు లెవ్వు" అని అమ్మ అనడం.

అప్పటి వరకు ఉన్న సంతోషమంత చప్పున ఆగిపోయింది. ఎం జరిగిందో తెలియదు. ఎలా జరిగిందో తెలియదు. కాని నన్ను మురిపిస్తూ ఊరించిన తెల్ల బూట్లు నాకు సొంతం కాలేదని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఒక్క సారిగా అన్ని గుర్తొస్తున్నాయి. వెక్కిరిస్తూ గుంజీలు తీయమంటున్న టీచర్, ఒరిగి కూర్చున్న గోడ కుర్చీ, అదే బయంతో దడ పుట్టించే శుక్రవారం. ఎప్పుడొస్తుంద అనే ఎదురుచూపులు, క్షణంలోనే అయ్యో మళ్లీ వస్తుందా అనేస్తాయికి నేట్టుకున్నాయి నా ఆలోచనలు.

వేలాడదీసిన  తెల్ల బూట్లు నన్ను చూసి వెకిలిగా నవ్వుతున్నాయి.
ఏంటో చిన్నప్పటినుండి "సరోజనమ్మ పిల్లలు చూడు తల్లి చెప్పినట్టుఇంటరు" అని వాడ వాడ మొత్తం కలిసి ఇచ్చిన బిరుదుని మోసుకుంటూ ఉన్న నాకు అది గుర్తుకురావడంతో ఎక్కడ ఆ బిరుదుని పొడగోట్టుకుంటానో  అని, అమ్మ మా టీచర్ కొడుతది నాక్కూడా కావలి తెల్ల బూట్లు అని నోరు తెరిచి అడగలేక పోయా..
ఆయినా తనకి తెలియదా నాక్కూడా కొనాలని, డబ్బులు సరిపోలేదు అని నాకు నేను  సర్దిపుచ్చుకుంటున్న కూడా,
లోలోపల దుఖ్ఖం తన్నుకుంటూ వస్తుంది.
వస్తున్న దుఖ్ఖంని దిగ మింగుకుంటూ బారంగా పడుతున్నాయి నా అడుగులు.
అమ్మ బుధరకిస్తూ ఏమోమో చెప్తుంది కాని ఒక్కటి కూడా వినపడట్లేదు.

అన్ని గల్లిలూ మూల మలుపులు తిరుగుతూ లక్కాకుల పద్మారావు దుకాణంకు ఆనుకొని ఉన్న ముసలవ్వ డబ్బా కిరాణంలో బెల్లంతో చేసిన ప్యాలాల ముద్దలు ఓ ఆరు కొని ఒకటి నాచేతి కిచ్చి మిగతావి దస్తి (కచ్చిఫు) లో మూట కట్టి, నడుచుకుంటూ వెళ్తుంటే, అరచేతిలో నిండిన ప్యాలాల ముద్ద కొరికాను, ఎందుకో రుచించలేదు, క్షణనికొకసారైన వోద్దన్న బయటికోస్తున్నాయి కన్నీళ్ళు.గబా గబా తుడుచుకుంటూ వెళ్ళాను. దుప్పటి ముసుగులో కన్నీళ్ళతో యుద్ధం చేస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్ననో తెలియలేదు.

మళ్ళీ శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజు అర చేతిని తిప్పి మట్టెల మీద రూలు కర్రతో రెండు దెబ్బలు వేసింది టీచర్. ఉన్నపలానా బయటపడ్డాయి దిగామింగుకున్న కన్నీల్లన్ని. ఎవరికి ఎలా చెప్పాలో తెలియని పరిస్థితికి సమాధానంగ కన్నేల్లె మిగిలాయి. ఇదే అవకాశంగ బావించి ఉన్న దుక్కన్నంత బయటికి కక్కాను. కక్కిన తర్వాత కాని మనసు కుదుట పడలేదు. ఈ సంగటన తర్వాత దుక్కన్ని దిగామింగుకోవాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురవుతుందేమోనని  ఇప్పటి వరకు దేని పైన ఆశ పెట్టుకోలేదు.
అదే రోజు సాయంత్రం మా పిలగాండ్లంధరిని ఆటలాడించడానికి కాలి అట స్థలానికి తీసుకెళ్ళారు, తెల్ల బూట్లు లేని మమ్మల్ని వొదిలేసి.
సాధారణంగానే నేను ఆటలకి దూరం, ఆరోజుతో నాకు ఆటలంటేనే విరక్తి కలిగింది.

ఇంటికొచ్చాను దేని గురించి కూడా అమ్మకు చెప్పలేదు. అనాసక్తిగానే అన్ని పూర్తి చేసుకున్నాను. అక్కయ అన్నయతో పాటే బైరిశెట్టి సమ్మయ్య వాళ్ళింటికి టీవీ లో వచ్చే చిత్రలహరి చూడడానికి వెళ్ళాను. అది కూడా నచ్చక పోవడంతో ఇంటికొచ్చాను. త్వరగా ఇంటికి తాగొచ్చిన బాపుతో భయంతో గడపలేక గ్లాసుడు మంచినీళ్ళు తాగి మళ్లీ టీవీ కాడికెళ్ళ. చిత్రలహరి అయిపోయినాక ఇంటికెళ్ళేసరికి బాపు పడుకున్నాడు.
పుస్తకాల సంచిని ముందేసుకొని చూచి రాతలు పూర్తి చేసుకుంటుండగా గుర్తొచ్చింది. వారం క్రితం స్కూల్లో అడిగిన ప్రశ్న "పిల్లలు ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. మీరు మీ మీ లక్ష్యలేంటి" అని అడిగిన ప్రశ్నకు ఎవరికి తోచ్చినట్టు వారు డాక్టర్, లాయర్, పోలీసు అని చెప్తుంటే నేను మాత్రం ఇంకా ఏమి అనుకోలేదని చెప్పా. అది గుర్తొచ్చి అప్పుడు నిర్ణయించుకున్నాను "నా జీవిత లక్ష్యం తెల్ల బూట్లు కొనుక్కోవడమని". ఎక్కడ మరిచిపోతనోనని చూచి రాత నోట్ బుక్ లో రాసుకొని భద్రపరుచుకున్న ఆ లక్ష్యాన్ని ఆ బుక్కుని.

మా అమ్మ స్కూలుకొచ్చి ఫీసు కట్టినప్పుడు ప్రిన్సుపాల్ మాడంతో  ఎం మాట్లదిందో ఏమో అప్పటినుండి ఏ టీచర్ కూడా తెల్ల బూట్ల గురించి అడగలేదు. స్కూల్ చదువు పూర్తయేంతవరకు కూడా తెల్ల బూట్లు కొనుక్కున్న దాకలాలు లేవు.

**

మొన్నీ మధ్య ఆ  చిన్న నాటి చూచి రాత బుక్ తీసి చూసా.
బుక్ చివర్లో "తెల్ల బూట్లు కొనుక్కోవడమే నా జీవిత లక్ష్యం" అని రాసుకున్న మాటలు, ఇప్పుడు నవ్వు తెప్పించాయి.

ఆ తెల్ల బూట్లతో జీవితంలో చాల నేర్చుకున్నాను.
-దేని పై ఆశలు పెంచుకోకపోవడం,
-ఒకరిస్తారు అని ఎదురుచూడకుండా కష్టపడి సంపాదించుకోవడం.
-ఏదైనా ఉచితంగా దొరికితే, అంతే విలువైనదేదో నా నుండి దూరమైంధనో లేక  దూరం కబోతున్నధానో అని నిర్ణయించుకోవడం.
-కోరుకున్న ప్రతీది తప్పక తీరుతుందనే ధైర్యం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే నేర్చుకున్న..

సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత గడిచిన ఇన్నేళ్ళలో ఎన్నో తెల్ల బూట్లను నా కాళ్ళతో కసితో తోక్కేసిన, మొదటి సారి తొడిగినా ఆ తెల్ల బూట్లు కాసేపు మదిలో వేలాడి వెక్కిరించాయి..

Thursday, September 15, 2011 at 6:54pm

పంద్రా ఆగస్టు - జెండా పండగ

ఇగో పంద్రా ఆగస్టు వస్తోంది.
ఈ క్లాసు మొత్తం చమ్కీలతో చమ్కాయించాలి.
మస్తుగా ఎంజాయ్ చేయాలి అని లియాకత్ అలీ చెప్పడంతో.
ఏడు, ఎనమిది, తొమ్మిది తరగతోల్లమంత తల ఐదు రుపాయలేసుకుంటే చౌరస్తా బుక్ స్టాల్ లో రంగు రంగు కయీతాలు మేరుపు చమ్కీల కవర్లు మస్తు వస్తాయి అని మా క్లాస్ రవి గాడు చెప్పడంతో అందరం ఊ కొట్టాం. మా స్కూల్ లో మా క్లాసు లో కొంచెం నాకు మంచి పేరే ఉంది. డెకరేషన్ పనులు ఇంకా ఆ రోజు ప్రోగ్రాములు గట్రా నాకు అప్పచేప్పటోల్లు. ఇక మా రవిగాడికి పెద్ద సైకిల్ ఉండేది.
స్కూల్ మొత్తం లో మా పిలగాడ్లంత ఆడి బుజలకాడికి ఉండేటోల్లం అందుకే పొడుగు రవిగాడు అని పిలిచేటోల్లం. అప్పటికి నాకు సైకిల్ తొక్కటం రాదూ అది వాడికొచ్చు అందుకే నాకు తోడుగా డెకరేషన్ సామాను తేవడానికి మా ప్రిన్సిపాల్ మాడం పంపించేది.
ఇగ మా క్లాసు లో కూడేసుకున్న పైసల్తో మేము చౌరస్తాలో రవి బుక్ స్టాల్ అనే షాపులో అన్ని పట్టుకోచ్చేటోల్లం.
మా స్కూల్ టీచర్ లు చెప్తూ ఉంటె  మా క్లాస్సులల్ల ఉండే ఆడోల్లంత పింకు రంగు కయీతలని చిన్న చిన్న గ కత్తిరించుకోని మల్లె పూల దండలాగ కాయితాల దండల్ని అల్లే వాళ్ళు అదంతా రెండు రోజులు కూచుంటే గాని అన్ని క్లాసు రూముల్లోకి సరి పడ దండలు తయారయేవి.
ఇక మేము పిలగండ్లమంత పెళ్ళిలకు అతికించే రంగు రంగు కాగితాలను కత్తిరించి క్లాస్లో అతికించే పనుల్లో ఉండేవోల్లం. ఇగ పోటిలుపడి ఎవలి క్లాస్సు వాళ్ళే అందంగా తీర్చి దిద్దే వాళ్ళం.

సంత్సరానికి రెండు సార్ల పనికొచ్చే కర్ర బొంగు వెనక క్లాసు పై రేకుల మీద ఉండేది. దాన్ని రవి గాడు అమ్జాద్ తీసేవోల్లు. నేను ఆరిఫ్ మూడు రంగుల కయీతలని బొంగు చుట్టూ అతికించడానికి కత్తర్లతో అందంగా కత్తి రించటోల్లం.  మా ఆయ గిన్నెలో వేడి వేడి లయ్యి పిండి పట్టుకొచ్చేది. చిన్న బకిట్లో నీళ్ళు తీసుకొచ్చి కర్ర బొంగుని శుబ్రంగా కడిగి లయ్యి పిండిని పూస్తుంటే వెంటనే కత్తిరించుకోని పెట్టుకొన్న కాషాయం, తెలుపు పచ్చ, రంగు కయీతలని, అందంగా అతికించేవోల్లం.
వారం ముందునుండే అబ్బో ఎంత హడావిడి చిన్న తరగతులలో ఉండే ఇంగ్లీష్ మీడియం పిల్లలంతా దేశ భక్తి పాటలు, డాన్సులు ప్రకటిస్ చేసేవోల్లు.

హిందీ టీచర్ నాతోని పట్టుబట్టి హిందీలో ఉపన్యాసం ప్రాక్టిసు చేపించేది. బహుషా క్లాసు లో ఫస్టనో లేక హిందీ బాగా మాట్లాడడం అనో తెలియదు కాని మాట్లాడాలని పట్టుబట్టేది.
ఏందో రెంద్రోజులసంది మస్తు ప్రాక్టీసు చేసుకునేవొన్ని ఇగ రేపనంగా ప్రిన్సిపాల్ గారు పిలిచి రేపు నీ ఉపన్యాసం తెలుగులో ఇమ్మనేది. హిందీ టీచర్ కి అదే విషయం చెప్పటంతో సరే అని తెలుగులో ప్రాక్టిస్ చేయమనేది.

ఎవలవలివో పెద్ద పెద్ద పేర్లు త్యాగాలు, స్వాతంత్ర్యం, బ్రిటిషు, భారతదేశం, యుద్ధం, డేట్ లు, అర్ధరాత్రి స్వాతంత్ర్యం, నేటి బాలలే రేపటి పౌరులు, ఇంకేందేందో ఉండేది ఆ ఉపన్యాసం లో. తెల్లారితే జెండా పండగ.

రాత్రంతా చదువుకొనే వొన్ని.
అవే ఆలోచనలు ఉపన్యాసం లో ఉన్న కథలో ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా తమ వంతుగా తాము దేశ స్వాతంత్ర్యం కోసం పాటు పడడం.
ఎవరెలా కష్టపడిన చివరికి దేశ స్వాతంత్రమే ప్రధాన సూత్రంగ పాటుపడడం నాకు చాల ఆశ్చర్యానికి గురిచేసింది.

ఒకరు మౌనంగా సత్యాగ్రహం చేస్తే,
ఇంకొకరు ఎదురు తిరిగి నినాదం చేసారు,
మరొకరు సైన్యాన్ని కూడగట్టుకొని సమ ఉజ్జిలుగా ఎదురుతిరగడం,
ఏవిధంగా మనల్ని కొల్లగోడుతున్నారో అదేవిధంగా మనం వాళ్ళని కొల్లగోడుధమని ఇంకొకరు.
ఎవరు ఏ రకంగ పోరాడిన చివరికి దేశం కోసమే కదా అని నన్ను నేను సర్దిపుచ్చుకునే వొన్ని.
ఇదంతా గతం నాకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి పంద్రా ఆగస్టులో విన్న మాటలే విన్న చరిత్రలే కావచ్చు కాని ఇప్పుడెం చేయాలి.

ఒక్క రోజు నిల్చున్న జెండా కర్ర మళ్ళి ఐదునెల్ల దాక రేకుల మీదే నడుం వాల్చుతుంది.
సూర్యకిరణలకు  చమక్కుమని మెరిసే రంగులతో రెప రెప లాడిన త్రివర్ణ పతాకం ఇస్త్రి చేసుకొని మడత పెట్టుకొని బీరువా అర లో సేద తీరుతుంది.
అప్పుడప్పుడు  టీవీ లో క్రికెట్ ఆటలో ఇండియా గెలిచినప్పుడు, మా గల్లి పెద్ద పెద్దోళ్ళంత పట్టుకొని తిరగే టప్పుడు కనిపించేది ఆ జెండా.
నా చిన్ననాడు చాల కాలం వరకు స్వతంత్రం అనే పేరుకు అర్ధం మూడు రంగుల జెండా అని మాత్రమే నాకు తెలుసు.
ఆ జెండా ఎగరడానికి "స్వతంత్రం, గణతంత్రం" అనే రెండు పండుగాలోచ్చాయ్ అని మాత్రమే తెలుసు.

పరి పరి విధాలతో బుర్ర వేడిక్కి ఎన్నో ప్రశ్నలకు సమాధాన పరుచోకోలేక దుప్పటి కప్పుకొని పడుకోంటుంటే అమ్మ నా స్కూల్ డ్రెస్సు నీలం తెలుపు చిన్న చిన్న అడ్డం నిలువు గీతలు గల బుషోటు, నీలం రంగు పైంటు,  పైన కింద నీలం మధ్యలో తెలుపు తో అడ్డగీతలున్న నడుం బెల్టు, బ్లాకు సాక్సులతో బూట్లు, అన్ని ఓ పక్కన సర్ది పెట్టేది.

పొద్దున్న ఆరు గంటల ప్రాంతాన, నను నిద్ర లేపేది అమ్మ.
పల్లుతోముకొని వొచ్చి ఉపన్యాసం పేపర్ను ముందేసుకొని అక్షరం పోల్లుబోగుండా తెగ బట్టి పట్టేవొన్ని.
ఏమో నేను యధ్రుచికంగా నా మనసుకి అర్ధంకాని చాల విషయాలు బట్టి పట్టక తప్పకపోయేది.
చుట్టూ కరతాళ ధ్వనులు మోగిన ఉపన్యాసం ఇవ్వడంలో ఆనందం ఏ రోజు నాకు కలగలేదు. ఎందుకో మరి నా మనసుకు నా ఆలోచనలను బయటపెట్టే స్వాతంత్ర్యం అప్పటికి నాకు రాకపోవడం వాళ్ళ ఏమో. ఈ సారైనా సాధ్యమవుతుందో అనుకుంటే ఈ సారి కూడా బట్టి పట్టక తప్పలేదు.

కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగినాయి లే స్నానం చేయిపో. అని అమ్మ చెప్పడం తో  కాగుతున్న నా ఆలోచనను ఆర్పేసి, ఉపన్యాసం కాగితాన్ని నా ప్రశ్నలని సంచిలో చరిత్ర పుస్తకంలోకి నెట్టి, ఇంటెనక బాయి కాడ బకిట్లో వేడి వేడి నీళ్ళ గిన్నలో వేపాకులు బకిట్లో పడనీకుండా పోసి గోరువెచ్చగా మారే వారకు కొన్ని చల్లనిల్లను జత చేసి, పెద్ద లైఫ్బాయ్ సబ్బు సిద్ధం చేసేది. పెద్ద చెంబుతో గబా గబా పోసుకుంటూ ఒళ్ళంతా వేప వాసన, ఈ ఆకులూ ఎందుకేస్తావ్ అని అడిగితే ఒంటికి మంచిది అని అమ్మ చెప్తుండేది. చేదువసనకు విరుధంగా సబ్బు వాసనా మత్తుగా తోచేది. స్నానం పూర్తవగానే సూర్యునికి దన్నం పెట్టుకొని, వేప చెట్టుకి దన్నం పెట్టుకొని ఒళ్ళు తుడుచుకొని.
బనీను నిక్కరు వేసుకొని ఆరున్నర ప్రాంతాన,  పైంటును అంగిని ఒక చేతిలో పట్టుకొని అమ్మ ఇచ్చిన రెండు రూపాయలని నిక్కరు జేబులో పెట్టుకొని రెండ్రుపాయలు బయటికి రాకుండా జేబులో చెయ్యి పెట్టుకొని కుండి కాడినుండి వీరేశం దుకాణం దాటుకుంటూ  గుండం వాడ రాజన్న దుకాణం పక్క గల్లిలో చాకలోల్లింటికి ఇస్త్రి చేపించుకోనేందుకు పోయేటోన్ని. అందరకి గీయల్నే గుర్తొస్తది, కాసేపుండు సేసిస్త అని కసురుకుంటోడు. జెల్దిజెయ్ స్కూల్ కు పోవాలి అని అదిరించే వొన్ని. అందరకి జేల్దే, చేస్తున్న గదా జరా సైసు అనేవాడు. కాస్త బయటికొచ్చి అన్ని గల్లిలని చూసేవాన్ని ఇక ఈ రోజు తప్ప ఇంకో రోజు ఇవి కనపడోద్దు అని కరెంటు స్థంబాలను, ఇండ్లను ఆసరాగా తీసుకొంటూ మొత్తం  జెండాలను అతికించిన తోరణాలు దట్టంగా నింపేవాళ్ళు.

మెల్లిగా ఇస్త్రి బట్టలను తీసుకొని ఇంటికేల్తుంటే జెండా తోరణాలు నాకు ఆహ్వానం పలుకుతున్నట్టు అనిపించేవి. కుండి కాడ ఆశమ్మ వాళ్ళ ఇంటిదగ్గర మూడు బాటలకాడ జెండా ఎత్తేవోల్లు, ఆడికి పెద్ద పెద్ద వొళ్ళు వచ్చేవోల్లు కొద్ది రోజుల తర్వాత ఓ పార్టీ కి సంబంధించిన జెండా మన జెండా ఎగిరేసే తుప్పు పట్టిన ఇనుప బొంగు  పక్కనే దానికన్నా  మూడు మూరల మరింత పొడుగుతో అమర్చిన కొత్త బొంగులో వారి జండాని అమర్చి చాల కాలం వరకు ఎగేరేసారు. అది చూసిన ప్రతి సారి. నా త్రివర్ణ పథకానికి రెండు రోజులే స్వతంత్రం మరి ఈ జెండా కి ప్రతి రోజు స్వతంత్రమా అనే నా ప్రశ్నకు నవ్వును సమాధానంగా ఇచ్చారు. ఆ ఏర్పాట్లను చూస్తూ ఇంటికేల్లెవాన్ని. త్వరగా బట్టలు వేసుకొని అంగిని పైంటు లోకి తోస్తూ బెల్టు పెట్టుకొని అమ్మ ధగ్గరకేల్లగానే, పారాచూట్ కొబ్బరినునే తలకు రాసి ఎడం పక్కన పాపిడ తీసి నున్నగా దువ్వి కొంచెం పౌడర్ ని మెత్తని బూరు పువ్వుతో మోకానికి అద్ది, చిన్న కుంకుమ బొట్టుని పెడుతూ ఈ రోజు జెండా పండగ, బొట్టు తుడుచుకోకు, బట్టలు మాపుకోకు, జెండా వందనం ఐపోగానే ఓ పక్కనుండి జాగ్రత్తగ రా సరేనా! ఊ.. అని అంటూ సాక్సులు తొడుక్కొని బూట్లని పాలిష్ కి బదులు కొంచెం కొబ్బరి నునేను మసిగుడ్డ కు అద్ది మొత్తం రాసేవాన్ని నల్లగా నిగనిగలాడుతున్న బూట్లను చూస్తూ ఆనందపడుతూ దారాలను కట్టుకుంటోన్ని. తెల్ల కడ్చిపుని చేతిలోకి తీసుకొంటూ స్వాతంత్ర్యం వచ్చిన నా బుజాలను నిటారుగా చేసుకొని నా పుస్తకాల సంచి వంక వెర్రిగా చూస్తుంటే ఆ సంచి నా వంక కోపంగా చూచేది.  స్వేచ్చగా గుండెలనిండా గాలులను పీల్చుకుంటూ స్కూల్ వైపుకు నా అడుగులు వేసేవి. కుండి కాడ మూలమలుపు తిర్గుతుంటే గుండు పిన్ను సహాయంతో చిన్న కగేతపు జెండాని నా అంగి జేబుకి పెట్టె వారు, అన్న అన్న అబ్బ ఇంకో జెండా ఇవ్వవా. ఎందుకు చిన్న? నా బుక్కులో పెట్టుకుంట ప్లీజ్ ప్లీజ్ అనగానే నవ్వుతూ రెండు జెండాలను చేతిలో పెట్టేవోడు, జాగ్రతగా అంగి జేబులో పెట్టుకోనేవాన్ని. గుండెను అదుముకున్న నా స్వాతంత్రపు జెండాని పదే పదే చూస్తూ మురుసిపోతు స్కూల్ కి చేరుకుంటోన్ని.

పెద్ద పెద్ద పాటకలున్న గేటుకు కుడి బాగాన ఒక్కరు పట్టే విధంగా చిన్న గేటు ఉండేది. లోపలి అడుగు పెట్టగానే నిజమైన ఆనందపు వాకిలి చేరుకున్నాన అని తలపించేది అందంగా ముస్తాబైన మా స్కుల్ని చూస్తుంటే.

అందరం పిల్లలం ఒకరి వెనక ఒకరం కొన్ని వరుసలుగా నిల్చోనేవాళ్ళం నేను రవి గాడు ఇంకా ఆరిఫ్ గాడు ముగ్గురం ప్రిన్సిపాల్ మాడంకు చేరువలో నిల్చోనేవాళ్ళం మాకు ఏమైనా పనులు పురమయిస్తారో అని. అన్నట్టుగానే మాకు పనులు తగిలేవి గాంధీ, నెహ్రు, భగత్ సింగ్, సుబాష్ చంద్ర బోస్ పటాలను శుబ్రం చేసి జెండా కర్ర కింద ఎత్తు తక్కువగా ఉండే వెడల్పు బల్లపై జాగ్రత్త గ అమర్చేవాళ్ళం. టేచర్లు మాకు సహాయం చేద్దాం అని వచ్చేవారు కాని మేము వారిని రాకని చెప్పి పూర్తి చేసేవాళ్ళం. మా ప్రిన్సిపాల్ గారు, పటాల్లో ఉన్న వారికి కుంకుమ దిద్ది కళ్ళు మూసుకొని దండం పెడుతుండగా పిల్లలమంతా అలాగే చేసేవాళ్ళము. రెండు కొబ్బరికాయలను కొట్టి పక్కన పెట్టి మెల్లిగా తాడు సహాయంతో కొన్ని పూలు రంగు రంగు కాగితాలను మూటగా కట్టి ఉంచిన జెండాను కర్ర చివరివరకు చేర్చి, మరో తాడుతో ముడి విప్పడం తో ఒక్కసారిగా రంగు రంగు కాగితాలు జెండా నుండి స్వేచ్చగా బయటకు రాగానే పిల్లలమంతా చేతులలో ఉన్న చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నరంగు రంగు కాగితాలను బలంగా జెండా వైపుకు విసిరేవాళ్ళు, అమ్జాద్ వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చిన ఐదారు పావురాలను కూడా జెండా వైపుకి వోదిలేవారు, ఆగని కరతాళ ధ్వనులతో జరుతున్న సన్నివేశమంతా కన్నులపండగల తోచేది. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించేది. తలలన్ని తలెత్తుకొని జెండా వైపుకు చూస్తూ సెల్యూట్ చేస్తూ జనగణమన గీతాన్ని అలపించేవాళ్ళం.

ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారి ప్రసంగంతో మొదలయి టీచర్ల వరకు రాగానే కొద్ది కొద్ది గ వణుకు మొదలయ్యేది నాకు, ఇది ఇప్పటిది కాదు ప్రతి సారి జరిగేదే, గుండె వేగం పెరిగేది. ఆ సమయంలో పిలిచేవారు రఘు అని. గుండెలనిండా శ్వాస తీసుకుంటూ ఎదురుగా ఉన్న పిల్లల వైపు చూస్తూ జెండా కర్రకి కొంచెం పక్కగా ప్రిన్సిపాల్, టీచర్ల ముందు నిల్చొని నా ప్రసంగాన్ని మొదలు పెట్టి పూర్తి చేసే సమయానికి నా కళ్ళు మూతలు పడి ఎవరో నన్ను బలంగా కిందికి అనగాతోక్కుతున్నట్టు భయంతో వణుకుతూ తల కిందికి జారుకునేది. నాకు తెలియకుండానే ప్రసంగం పూర్తయిందని తెలిసేది చప్పట్లు మోగుతుంటే. హమ్మయ్య పెద్ద గండం గడిచింది. అనుకుంటూ తల పైకెత్తి నవ్వుతూ మళ్ళి నా స్థానం లోకి వచ్చేవాన్ని. అందరి ప్రసంగాలు పూర్తయ్యాక, అప్పుడు పట్టుకోచ్చేది ఆయ, ప్యాకింగ్ చేసిన పొట్లాలు. ఇక అందరు కళ్ళు ఆ పోట్లలపైనే.

మేడం ఒక్కొక్కరిగా ఇస్తుంటే ముందు చిన్నతరగతి పిల్లలంతా రెండు చేతులతో తీసుకొని నెమ్మది లోపలి వెళ్ళేవాళ్ళు. అల అందరం పొట్లల్ని తీసుకొని మా క్లాస్లోకి వెళ్ళేవాళ్ళం నా కడ్చిపులో ఆ పొట్లాన్ని దాచుకొని జేబులో పెట్టుకొని. ఇక అందరం వెనక క్లాస్ ముందు వెడల్పుగా ఉన్న అరుగు మీద పిల్లలంతా వేషాలు వేసుకొని నాటకాలు, పాటలు, డాన్సు లు వేస్తుంటే. నా ఆలోచనలు మాత్రం రెపరెపలాడే జెండా వెనక దాగిన మరో ప్రపంచం వైపుకు పరుగులు తీసేవి. సమాధాన పరుచుకోలేని ఎన్నో ప్రశ్నలను మదిని తొలుస్తూ, స్వతంత్రం అంటే ఏమిటో అర్ధం కోసం వెతుకుతూ, నేను పుట్టిన గడ్డ పై మమకారం పెంచుకోవడమేనా దేశ భక్తి, ఆటలో గెలిస్తే జెండా పట్టుకొని వీధిల  మీద తిరగాడమేనా దేశభక్తి.

భానిస నుండి విముక్తి, ఇప్పుడు ఏవరికీ భానిసలుగా ఉన్నాము.
గాంధీ మహాత్ములు, ఎందరో మహానుభావులు నాకు తెచ్చిపెట్టిన స్వతంత్రం ఇదేనా,
దేశాన్ని వొదిలి పారిపోయి దేశం కోసం ఏదైనా సాధిస్తున్నమా అంటూ ఇక్కడి తెలివినంత పొరుగు దేశాల్లో ధారపోస్తున్నరన్న ఆవేదనని గొత్తు చించుకొని అరుస్తున్న పెద్దవాళ్ళకి, ఇక్కడే ఉన్న వాళ్ళు దాసోహం అంటూ ఎంత మంది పొరుగు దేశపు కంపెనీల్లో పనిచేస్తున్నారో కనిపించడం లేదేమో.

ఇప్పటికి నేను భానిసనే, నా ఆలోచనలన్నిటిని పణంగా పెట్టి ఓ మల్టీ నేషనల్ కంపెనీ (పొరుగు దేశపు) లో పని చేస్తున్నాను కేవలం నాకోసం.
నా కోసం మాత్రమే పనిచేసుకుంటున్నాను.
మరోసారి మనం బావుపడితే దేశం బావుపడుతుందంటున్నారు.
ఏమో దేశం కోసం పాటుపడని "నా" అభివృద్ధి తో దేశం ఏరకంగా వెలిగిపోయిందో నాకు తెలియదు కాని.
ఒక రకంగా వెలిగిపోతుంది  అక్రమ సంపాదనతో, బిధరికంతో, ఎన్నో రకాల లేమితో ఎప్పుడు కుంటుతున్న నా భారతం వెలిగిపోతుంది.

గాంధీ సత్యాగ్రహం పాపం స్కూల్ పుస్తకాలకి అంకితమైనది.
యువత ఆలోచనలు పొంతన లేని సొంత అబివృద్దికి, విందుల వినోదాలకి, ఉరుకుల పరుగుల జీవితానికి, గమ్యం లేని లక్ష్యాలకి, ఎటు తోచని ఆలోచనలకి, ఒత్తిడికి, స్వాతంత్రం పేరుతో పబ్బుల్లో విచ్చలవిడితనానికి అంకితమైనది.
బాగా చదువుకున్నోల్లు  రెండు పదులు దాటగానే పొరుగు కంపెనీల పుణ్యమా అని ఎక్కడిలేని సంపాదనతో స్వాతంత్రం అనే ఆయుధంతో ఉల్లాసంగా విలాసవంతమైన జీవితం గడుపుతుంటే,
నెహ్రు విసిరినా పావురాయి రెక్కని ఈ జాగా నాది ఆ జాగా వాళ్ళది అని తెగ నరుకుతుంటే రక్తం మడుగులో కొట్టుకుంటోంది.
సుబాషు తాయారు చేసిన సైన్యం తాను ఎన్నడు ఊహించలేదేమో తన దేశపు రేపటి పౌరులని ఎదిరించాడానికే మిగిలిందని.
మీసం మేలేసిన భగత్ సింగ్ రౌశ్యం నా వీధి బాలుని ఆకలి తీర్చలేకపోయిందానే నిజం తనకు ఎవరు చెప్తారు.

ఎవరేక్కడికి పోతే నాకేంటి అనుకోని ఎవరికి నచ్చినట్టు వారు జీవించడమే స్వాతంత్ర్యం అనుకుంటున్నాన నేను. నిజమే కావచ్చు
అందుకేనేమో పాపం కరుణకి అర్ధం చెప్పిన మథర్ తెరిసా ఎంత వేదనకి గురైతే తప్ప కరుణలేని మనసుల లోకంలోకి మళ్ళి నను పుట్టించకు ప్రభువా అని తన డైరీలో ఎందుకు రాసుకుంటుంది.

ప్రక్టికాల్ గ ఉంటూ, ఎం జరిగిన పట్టనట్టు చూసి కూడా మనకెందుకులే అనుకోని అన్ని చంపుకొని చేతులు కట్టేసుకొని,
నా నా నా నా అనే సొంత అభివృద్ధికోసం బానిసనై  నా మనసు చేసే అగచాట్లలో,
నా దేశం కోసమే నేను అనే భావన ఎప్పుడు నాకు గుర్తోస్తుందో.
ఎప్పుడు నిజమైన స్వాతంత్ర్యం నా బానిస మనసుకి  వస్తుందో.
ఎప్పుడూ ఎగరుతుందో కిందకి దిగని జెండా  నా మనసులో  ఏమో...

నిజాలు తెలియని, తెలుకున్న, తెలుసుకోనట్టు, నన్ను నేను మబ్యాపెట్టుకుంటూ కల్లోలపు మధనం, నా మనసులో అప్పటి నుండి ఇప్పటికి కొనసాగుతూనే ఉంది

ఒరేయ్ ఎం చేస్తున్నావ్ రా ఐపోయింది. ఇగ పోదాం పద అనడంతో  ఒక్కసారిగా పెద్ద ఆలోచనల సంద్రానికి అడ్డుకట్ట వేసి అతి చిన్న నా అనే భావనలోకి వొచ్చి. ఆ అయిపోయిందా అనుకుంటూ మెల్లిగా లేచి ఒకరివేనకల ఒకరం నెమ్మదిగా బయటికొస్తూ ఒక్క సారి వెనక్కి చూసుకున్న రెపరెపలాడే నా జెండాని, ఎందుకంటే మరో ఐదునెల్ల దాక మళ్ళి కనపడదుగా ఆ దృశ్యం.

ఇంటికి రాగానే ప్లేటులో పొట్లం విప్పి లడ్డు బూంది, నాలుగు బిస్కట్లు, రెండు చాక్లెట్లు, దారిలో వస్తుంటే కుండికాడ పంచి పెట్టిన రెండు అరటి పళ్ళ ముక్కలు, అర్వన్నం, కొబ్బరి ముక్కలు కూడా అదే పళ్ళెం లో పెట్టి ఇంట్లో అందరికి ఇచ్చేవాన్ని నా లాగే మా అక్కయ అన్నయ కూడా..

మెల్లిగా అంగి విప్పుతుంటే జాగ్రత్త గ గుండు పిన్ను తీసి జేబుకు పెట్టిన, జేబులో ఉన్న జెండాలని రాజన్న దుకాణంలో మొన్ననే  కొన్న కొత్త రూల్ నోట్ బుక్కుని బయటికి తీసి మధ్యలో కాగితపు జెండాలని బద్రపరచి ముక్కుకి దగ్గరగా పెట్టి కొత్త బూక్కు సువాసనని గట్టిగ పీల్చి. వచ్చే గణతంత్ర దినోత్సపు ఆలోచనలను బూక్కుతో జత చేసి సంచిలో పెట్టుకునే వాణ్ని.

Tuesday, August 16, 2011 at 3:50am

ఒరేయ్ ఆరిఫ్ రంజాన్ ముబారక్ రా..

భయటికేల్లి ఉమ్ము మింగకుండా తుపుక్కున ఊంచి వచ్చి.
ఒరేయ్ ఇస్కూలు అయినాక మనం మసీదుకు పోదాం. ఇయాల సాయంత్రం "రోజా పొద్దు ఇడిచినక"  మాకు తెలిసినోల్లు ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. అని నా దోస్తు ఆరిఫ్ చెప్పడంతో.
విందా.. అరేయ్ నేను గూడ వస్తా.

సాధారణంగా అరటి పళ్ళు, ఇంట్లో ఎవలికైన జ్వరం వస్తే తప్ప కనిపించని దానిమ్మ కాయ, అప్పుడప్పుడు దొడ్డు సేమియా(అదే బంబినో) పాయసం.
మా వాడలో, గుండం గల్లిల్లో, అంత ముస్లిములే, మా గల్లిలో ఉన్న ముసలోల్లంత తుర్క వాడ అనేటోలు. మా ఇస్కులు దోస్తులంత ముస్లిం అని పిలువాలి అని మారం సేయడంతో నేను మాత్రం ముస్లిమోళ్ళ గల్లి అని పిలిచేవోన్ని. రంజాన్ పండగోస్తున్దంటే సాలు రకరకాల పళ్ళు, పళ్ళ రసాలు, కజ్జురాలు, మిటాయిలు, ఖీర్ పాయసం, హాలాల్ చేసిన మాంసం, దం బిర్యాని, పుల్క, రుమాల్, తందూరి, నాన్సు రొట్టెలు. ఎక్కడ లేని తిడంత గాన్నే గా ఇఫ్తార్ విందులల్ల ఉండేది. ఎందుకో మాంసం తినకపోయేటోన్ని. కాని నా శక్తి మేర పళ్ళు, రసాలు, కజ్జురాలు, పాయసం ఫుల్లుగా తీసుకొని పొట్టి నేక్కర్లేసుకున్న మేము  పెద్దోల్లలాగా ముందు నా పొట్టను పంపిస్తూ వెనకాల నేను నడిచేవొన్ని.

రంజాన్ పండగ రోజైతే చెప్పనక్కర్లేదు, మా గల్లి మొత్తం అత్తర్ గుభాలింపే. నన్ను కలుసుకోవడానికి మా దోస్తులంత దగ్గరున్న వాళ్ళు అబ్జల్, ఇర్షాద్, నయీం, నౌషాద్, లియాకత్ అలీ నడుచుకుంటూ, చాన్దూరం ఉన్నవాళ్ళు  సైకల్లెసుకొని, టిఫిను డబ్బాల్లో ఖీర్ పాయసం పట్టుకోచ్చేవోల్లు, ఇంటెదురుగా ఉన్న బేబీ వాళ్ళు, మసూదు వాళ్ళు ఇంకా మా అన్న దోస్తులు అంత పాయసం ఇచ్చేటోల్లు.  అందరికన్నా ఆరిఫ్ వొళ్ళ అమ్మ చేసే కద్దు ఖీర్ పాయసం, పోనీ ఖీర్ పాయసం, ఇంకా నెయ్యితో చేసిన స్వీట్లు అంటే మస్తు ఇష్టం అందుకేనేమో పెద్ద పెద్ద గిన్నెలో పట్టుకొచ్చేవాడు మా ఇంట్లోలందరి కోసం.

నేను ఆరిఫ్ ఎంత మంచి దోస్తులమంటే నా చిన్ననాటి సగం దినాలు వాడి ఇంట్లోనే గడిచినాయి. వాళ్ళింట్లో నేను మా ఇంట్లో వాడు కుటుంబ సబ్యులమైనాము. వాళ్ళ నాన్న సాబిర్ పాషా వ్యవసాయశాకలో గోవర్నమెంటు జాబు. ఇద్దరక్కలు వీడొక్కడు. ఏందో మాకు ఊహోచ్చేసరికే ఆ ఇద్దరక్కలకి పెళ్లిలయినాయి.

జుబ్బాలు, కుర్తాలు, లాల్చి పైజాములు, తెల్లని టోపీలు, కొందరు చమ్కీల తో రంగు రంగు అల్లికలున్న బుషోట్లు. కర్రు కర్రు మని శబ్దం చేసే తోలు చెప్పులతో యెడ సూశిన ఒక్కల్నోకలు గలేల్ను కలుపుకుంటూ కౌగిలించుకోనేవోల్లు. నాకడికోచ్చిన మా దోస్తులనంధరిని గలే మిల్ అనుకోని కౌగిలించోకొని రంజాన్ ముబారాక్ అనుకుంటోల్లము.

ఇక మా క్లాస్ లో ఉన్న అడవోల్లు  కూడా వాళ్ళ ఇంటికి పిలిచేటోల్లు. మచిలిబాజార్ లో ఉండే రానా, గుండం వాడలో ఉండే సాజియ, రాజియ, ఫాతిమా ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం రంజాన్ ముబారక్ చెప్పడానికి. వాళ్ళు పెట్టె ఖీర్ పాయసం స్వీట్లు ఆరగించడానికి. ఎందుకో ఎప్పుడు బుర్కాల్లో దిగేసున్న ముఖాలకి ఆ రోజు స్వాతంత్రం వచ్చేది, రంగు రంగు హైదరాబాద్ పరికినిలు, మెరుపు తీగల చున్నిలతో ముంబాయ్ నుండి తెచ్చుకున్న మొహలాయి చీరలు, దుబాయి అత్తర్లు, అబ్బో ఎన్నడు లేని సంబరమంత ఆరోజు వాళ్ళల్లో కనిపించేది. ఫాతిమా తాను వేసుకున్న రంగు రంగు మెరుపు అద్దపు గాజులని కిటికీ నుండి వచ్చే వెలుతురు దగ్గర పెట్టి గాజుల అద్దాలలో పడుతున్న కిరణాలకి తళుక్కుమని గోడపై మెరుస్తున్న రంగుల నీడలను చూస్తూ మురిసిపోతూ మా పెద్దన్న చార్మినార్ కాడినుండి తెచ్చిండు అని గర్వంగా చెప్తుండేది. అప్పట్లో చార్మినార్ ని చూడాలనేది మా దోస్తులందరి అతి పెద్ద కోరిక. అందుకేనేమో మొదటిసారి హైదరాబాద్ కొచ్చినప్పుడు పొద్దటినుండి సాయంత్రం వరకు చార్మినార్ వాకిల్లోనే తెగ తిరిగాం నేను ఆరిఫ్.

ఫాతిమా వాళ్ళ ఇంట్లో మొత్తం ఎనమిది మంది అన్నలు, ఆరుగురు అక్క చెల్లెళ్ళు. చాలా పెద్ద కుటుంబం ఇమేధీ పదోకొండో నెంబర్ చిత్రం మా స్కూల్లో కూడా అమెది రోల్ నెంబర్ పదోకొండే తను పుట్టిన తేది కూడా నవంబర్ పదోకొండు ఇలా చాలా విషయాల్లో తనతో పదోకొండో  నెంబర్ ముడి పడింది. ఆ తర్వాత కాలం లో నఫీజ్ సుల్తాన నాకు మంచి దోస్తు వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళతో కలిసి మాకు రంజాన్ ముబారక్ చెప్పేది.

కాలం తో పాటు నేను కూడా హైదరాబాద్ వాలిన ఇక్కడ కూడా నాతో పెనవేసుకున్న స్నేహాలు ఎన్నో సుల్తాన్ బాజార్ అలీ, చార్మినార్ అక్బర్, ఫయాజ్ హాష్మి, రఫిక్ దిల్సుఖ్ నగర్ జాహిద్, అబిడ్స్ మొహమ్మద్ ముజాహిద్, జుబ్బ సురయ బేగం, దూరదర్శన్ ఫాతిమా, హకీం పెట్ నాజియ టైమ్స్ అఫ్ ఇండియా హుస్సేన్ ఇలా చెప్పుకుంటే పోతే పర్వాలేదు ఈ రంజాన్ కూడా నన్ను ఆనంద పరచాడానికే వచ్చిందా అని అనిపిస్తుంది.

ఒరేయ్ నమాజు టైం ఆయ్యింధిర అనడంతో  సైకిల్ బొంగు మీద నేను కుర్చొంటే చిన్న పైడిల్ని భలంగా తొక్కడం తో ఒక్క పరుగున ఉజిలిబేసు మసీదును అందుకునేవాళ్ళం నేను ఆరిఫ్. ఏంటో నాతో పాటు వాడు గుడికొచ్చిన, వాడితో పాటు నేను మసీదుకేల్లిన యధ్రుచికంగానే పిలుస్తున్నది భగవంతున్నే అని అపుడు మా మనసులకి తెలియక పోయిన మా ఇరువురి మతాలు వేరనే భావన ఎవరు మాకు నూరిపోయనందుకు చాల సంతోషంగ ఉంది ఇప్పటికిను.

అల్లాహు అక్బర్ - అల్లాహు అక్బర్ అష్ హదు - అల్లా ఇలాహ్ అంటూ మొదలై అల్లాహు అఖ్బార్ లా ఇలాహ్ - ఇల్లల్లాహ్ అంటూ పూర్తయేది.
మెల్లిగా బయటికొచ్చి సైకిల్ లేసుకొని హన్మకొండ చౌరస్తా, నయీంనగర్ వెనకనుండి గల్లిలన్ని తిరుగుతూ తిరుగుతూ మళ్లీ కాకతీయ కాలనికి అటు నుండి అలంకార్ టాకీస్ దాటుతూ భద్ర కాలి చెరువు దగ్గర కాసేపు కూచొని, మెల్లిగా కదులుతూ దుదేకులోల్ల రఫీ, అనిల్ ని కలిసి, మూలా మలుపు తిరుగుతూ అమ్జాద్ వాళ్ళింటికి వెళ్లి ఆ తర్వాత ఆరిఫ్ వాళ్ళ ఇంటికి తీసుకేల్లెవోడు. విందు ను పూర్తి చేసుకొని, ముచ్చట్లు పెట్టుకొనే సరికి రాత్రి అయ్యేది.  మెల్లిగా ఇంటికొచ్చి రాత్రి బోజనాలయ్యాక చిమ్ని దీపం వెలుతురిని తగ్గించి ఓ మూలాన పెట్టి నేను పడుకుంటూ ఏమేమి చేసామో ఏమేం తిన్నానో ఆత్రంగా చెప్తుంటే గుడ్డి వెలుతురులో అమ్మ తువ్వాలతో నాకు గాలి విసురుతూ ఆశ్చర్యంగా  వింటూ ఉండేది.

దాదాపుగా ఇన్నేళ్ళలో యే రంజాన్ కి మేమిద్దరం కలవుకుండా ఉండేవాళ్ళం కాదు. మొదటి సారి కలవలేక పోతున్నందుకు మనసుకు ఇప్పడు తెలుస్తుంది గలేల్ను కలుపుకొంటూ కౌగిలించుకోవడాల విలువా..
"అరేయ్ దిల్ తుజ్సే గలే మిలనేకే లీయే తరస్ రహ రే అని తడారిన గొంతుతో చెప్పి ఫోన్ పెట్టేసాడు దుబాయి నుండి ఆరిఫ్"
మొదటి సారి చిత్రంగ ఉంది మా ఇరువురి మనసుల కోరిక ఒకటే అవడం.

ఇప్పుడు మా ఇద్దరిని కాస్త దూరం చేసిందని గర్వపడుతున్న పిచ్చి కాలానికి తెలియదు పాపం, మేమిద్దరం అనుక్షణం ఇరువురి మనస్సులో కలిసే ఉన్నాం  అని.

చిన్ననాటి జ్ఞాపకాల్లో కత్తిరించుకోని పెట్టుకొన్న కవితొకటి గుర్తొచ్చింది.

దోస్తీ హొతి నహి భూల్ జానే కే లియే,
దోస్త్ మిల్తే నహి బిఖర్ జానే కే లియే,
దోస్తీ కార్కే ఖుష్ రహోగే ఇత్నా,
కి వక్త్ మిలేగా ని ఆన్సు బహానే కే లియే.

ఎలాగు నా మనసు మాట వాడికి వినిపిస్తుందని నాకు తెలుసు అందుకే
"ఒరేయ్ ఆరిఫ్ రంజాన్ ముబారక్ రా.."

Sunday, August 14, 2011 at 3:56am

పుట్నాలమ్మ

ఈ రోజెందుకో 1 నెంబర్ మెట్రో బస్సు చాల సేపు రెతిఫైల్ స్టేషన్ లోనే గడిపింది.
కిటికీని నెమ్మదిగా తీసి బాగ్ ని ఒల్లో పెట్టుకొని కూర్చున్న.
"పల్లి బటాణి, పల్లి బటాణి" అనుకుంటూ ఓ ముసలావిడ. దాదాపు 80 కి పైన ఉంటుంది. ఇప్పటికి ఆ వయసులో పని చేసుకు బ్రతకాలనే తపన మెరుస్తున్న తన కళ్ళల్లో కనబడింది. 50 దాటితే చాలు మమ్మల్ని మా ఆలోచనల్ని ఎవరు కానట్లేధయ్య అంటూ వారి గోడు వెళ్ళబోసుకుంటూ కాలం గడుపుతున్న మా వీధి పెద్దలకు మరియు నాకు ఈ ముసలావిడ మంచి ఆదర్శం అనిపించింది.

ఎంతమ్మ..
రెండు రూపాయలకు చిన్న సీసడు (టానిక్ మూత), మూడు రూపాయలకు పెద్ద సీసడు (పిల్లలు ఆడుకునే చిన్న టీ కప్) బిడ్డ.
చెప్పు ఏ సీసడు కావలి.
చిన్న సీసడు బటానీలు ఇవ్వమ్మా అంటూ పది రూపయలిచ్చాను.
అయ్యో బోని నీదే బిడ్డ, చిల్లెర ఉంటె సూడు.
పర్లేధమ్మ ఉండనివ్వు.
అయ్యో వద్దు బిడ్డ నీ సొమ్ము నాకెందుకు.
ఇంకా మూడు సీసాలు ఇవ్వనా..
సరే ఇవ్వు.
పేపర్లో పోసి పొట్లం గట్టి చేతిలో బెట్టి, చిన్నగా ఊగుతూ, నెమ్మదిగా బొడ్డు సంచిలో పది రూపాయలను బెట్టుకొని, ఆకుపచ్చ రంగు చీర చెంగును సరిచేసుకుంటూ, పయిలం బిడ్డ అనుకుంటూ వెళ్ళింది.
కాసేపటికి ముందుకు కదిలిన బస్సుకి విరుద్ధంగా నా ఆలోచనలు వెనక్కి కదిలాయి.
**
తన పేరు నాకు ఇప్పటికి తెలియదు. కానీ మేము(పిల్లలమంతా) ఓ పుట్నాలమ్మ ఇటు రా మా అమ్మ పిలుస్తుంది. అంటూ పిలిచుకోచ్చేవాన్ని. రోజు కాకపోయినా వారానికోసారైన మా పుట్నలమ్మ మా గల్లికి వస్తుండేది. నాకు బాగా గుర్తు అప్పటికే తన వయసు అరవై ధాటి ఉంటుంది. ఎవరో తాను తెలియదు కాని తనకి మా ఇంటికి మంచి అనుబంధం. మా అమ్మంటే తనకి చాల ఇష్టం. ఎండన బడి వస్తున్న తనని నేను పిలువగానే ఎట్లున్నావ్ సరోజనవ్వ అనుకుంటూ ఇంట్లోకోచ్చేది. మా అమ్మ చేతి సహాయంతో బుట్ట కిందబెట్టేది. నన్ను పెద్ద చెంబులో నీళ్ళు తేమ్మనగానే. గబుక్కున వెళ్లి బింధలో ముంచి తీసుకొచ్చి ఇచ్చేవాన్ని.

"అవ్వో నా బిడ్డే సల్లంగుండు నాయన" అంటూ చెంబును చేతికి తీసుకొని. గడ గడ తాగేది.
"బడి లేదా నాయన". "ఉంది ఒక్క పుటే. పోయ్యోచ్చిన".

నా చూపు మాత్రం మా అమ్మ, పుట్నలమ్మ ముచ్చట్లలో కాకా, పుట్నాలు బటానీల బుట్ట మీదే ఉండేది. పెద్ద బుట్టలో ఒక సంచిలో పుట్నాలు, మరో సంచిలో బటానీలు, ఇంకో సంచిలో కర్రెంటు వైరునీ కాల్చిన తర్వాత బయటపడే రాగి, ఇత్తడి తీగలు, బొమ్మలు ఉండేవి. ఒక పక్కన సద్ది టిఫును, ఒక చిన్న తరాజు, సుతిలి తాడు తో వేలాడదీసిన చిన్న అయస్కాంతం. సాధారణంగ డబ్బుకు కాకుండా, రాగి ఇత్తడి తీగలను తీసుకొని, దోసెడుతో ఇచ్చేది.

నేను ఒక చిన్న గిన్నలో కొంచెం బెల్లం వేసుకొని పుట్నాలు పోసుకొని. ఇంటెనక వేప చెట్టుకింద నా గోనే సంచిని పరుచుకొని. పీటను తల కింద బెట్టుకొని. నిక్కరు సదురుకోని పడుకొని నా తల పక్కన పుట్నాల గిన్న పెట్టుకొని కొంచెం బెల్లం కొన్ని పుట్నాలను నోట్లో వేసుకొని, నెమ్మదిగా చప్పరిస్తూ, ఊరించుకుంటూ తింటూ, వేప కొమ్మలను, రాలుతున్న వేప పళ్ళను, దానికి ఆవల ఉన్న నీలాకాశం చూస్తూ, ఒక మంచి రాజభోగాన్ని అనుభావిన్చేవాన్ని.

మా బాపు ముందు గది లోకి రెండు వేల రూపాయలు గిరి గిరి కింద అప్పు తీసుకొచ్చి బండలేపించాడు. కొద్ది రోజులకి గిరి గిరి చిట్టి తీరగానే మల్లి అప్పుతీసుకొని కరెంటు పెట్టించాడు. నెమ్మిదిగా రాత్రిళ్ళు మా పడక ఇంటెనక చెట్టుకింద నుండి పంక(ఫ్యాన్) కిందికొచ్చింది. లైట్ వెలుతురున్నా కూడా, ఆ గదిలో వెన్నెల కనిపించేది కాదు.

ఒక్కో సారి పుట్నాలమ్మకి మా అమ్మ భోజనం పెడుతుండేది. అప్పుడప్పుడు జ్వరంగా ఉంటె తను మా ముందు గది పంక కింద నడుం వాల్చేది.

మా అమ్మ వాళ్ళ అమ్మ తన చిన్నప్పుడే కాలం చెల్లిందని. మా బాపమ్మనే తన తల్లిలా బావిస్తూ సేవలు చేసేది. మా బాపుని మా బాపు వాళ్ళ చెల్లేని(నాకు అత్తయ్య). పిల్లలు లేని మా బాపమ్మ,తాతయ్య వాళ్ళ తమ్ముడి దగ్గరనుండి దత్తత తీసుకున్నారు. ఆ రకంగా నాకు మా బాపు వాళ్ళ సొంత తల్లిదండ్రులు, పెంచుకున్న తల్లి దండ్రులు, ఇద్దరు బాపమ్మలు, ఇద్దరు తాతయ్యలు అంతే కాకుండా అమ్మ వాళ్ళ నాన్న ఆ తాతయ్య.

మా అమ్మ చదువుకోలేదు కాబట్టి తనకి ఓల్డ్ ఏజ్ హోమ్ ల గురించి తెలియదు. కేవలం ఆప్యాయత, అనురాగం తప్ప.
అందుకేనేమో తాతయ్యలు, బాపమ్మలు, మంచన పడితే విసుక్కోకుండా సేవలు చేసేది. చిత్రం ఏమిటంటే. అందరింట్లో అత్త కోడళ్ళ గొడవల గురించి వినపడేది కానీ, మా ఇంట్లో మా అమ్మతో ఎప్పుడు కృతజ్ఞత బావంగా ఉండేవారు. నా చిన్నప్పటినుండి. ఒకరి ఒకరి తర్వాత ఒకరు కల గర్బంలో కలుస్తుండడం, అప్పు తీసుకొచ్చి మరి కర్మ కాండలు చేపిస్తూ బాపు, వచ్చిన వాళ్ళందరిని అరుసుకుంటూ మా అమ్మ (అబ్బో మా చుట్టాల లిస్టు చెప్తే తరిగేది కాదు). నేను ఎందుకో వచ్చిన వాళ్ళతో పెద్దగ కలవలేక పోయేవాణ్ణి. నాకు మా ఇంట్లో ఎప్పుడు చావు డప్పు తప్ప వేరే శబ్దాలు వినపడలేదు. అందరు తాతయల్లు బాపమ్మలు దూరమయిన పది పన్నెండెండ్లకు గాని శుబకార్యం జరగలేదు మా ఇంట్లో.

అందుకే అనిపిస్తుంది ఆడవారికి, ఎంతో ఓర్పు, సహనం కావాలని, అవన్నీ మా అమ్మకి పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఇన్ని సేవలు చేసిన, తగోచ్చిన మా బాపు దెబ్బల తిప్పలు తనకి తప్పలేదు అన్ని బరించేది. నాకన్నా కొంచెం పొడుగున్న మా అన్న, ఏడుస్తూ మా అక్క, ఆపడానికి ఎంత ప్రయత్నించే వారో. ప్రతి రోజు రాత్రి బాపు వస్తున్నాడంటే గుండెలో దడ మొదలయ్యేది. ముసలోళ్ళు వాళ్ళు చెప్పిన పలితం లేకుండా పోయేది. తన అరుపులు మా గల్లీలో ఉన్న నా యిడు పిలగండ్లమందరికి వణుకే.
ఎంత గొడవ చేసిన కూడా ఒక్కసారికూడా బాపు మమ్మల్ని(నన్ను, అక్కయని, అన్నయ్యని) ఏమనలేదు. అదే మహా బాగ్యం అనుకునేది మా అమ్మ. ఈ రకంగా మా అమ్మ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని అందరికి సేవ చేసేది.

అప్పుడుప్పడు పుట్నాలమ్మకి మా అమ్మ పాత చీర ఇస్తే, చీరను ప్రేమగా తాకుతూ. కంట నీరు పెట్టుకునేది. నువ్వు సల్లగుండాలి అవ్వ అంటూ దండం పెడుతుంటే. ఇదంతా అమ్మ కొంగు చాటున నుండి తొంగి చూస్తుండే వాణ్ని. అప్పుడనిపించేది, మనసులకి కావాల్సింది, డబ్బు కాదు ఒక మంచి మాట, చిన్న ఆప్యాయత, ప్రేమగా ఇచ్చే కాసిన్ని మంచినీళ్ళు. ఈ రకంగా మా అమ్మ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని అందరికి సేవ చేసేది. ఆవును పట్టుకొని  ఇంటి ముందుకొచ్చే జంగాయన నుండి మొదలు పెడితే, కూరగాయలు అమ్ముకునే పెద్దమ్మ, చీరాల భద్రయ్య, వయసు పైపడి వంక కర్ర ఉతంతో పొద్దున్నే బన్ను రొట్టె తెచ్చే ఫతిమమ్మ, మెడలు పట్టుకుంటే సరి చేసే డబ్బా కదా అంటి, పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు, మా విధి చివర్లో ఉన్న బాపనామే, పిరికెడు బియ్యం కోసం రోజు వచ్చే ఓ ముసలి తాత వరకు అందరు మా అమ్మ సేవకు ప్రతిఫలంగా మమ్మల్ని దీవించే వాళ్ళు. మా అమ్మ మాకు తెలియకుండానే మా మనస్సులో ఎన్నో విషయాలు నింపింది. అందుకేనేమో నాలో చదువుని, మనుషుల్ని నమ్మక. కేవలం మనసుల్ని నమ్మాలనే భావన నాటుకుంది. ఆ భావనే ఇప్పటికి నను ముందుకు నడిపిస్తుంటుంది.

ఆ రోజు పుట్నాలమ్మ తన ప్రేమను బటానీలు, పుట్నాలతో పెద్ద గిన్న నిండా నింపి ఇచ్చింది. గిన్న నిండా ఉన్న పుట్నాలు బాటనీలను చూడగానే నా మనసు ఎంత సంతోషించిందో మాటల్లో చెప్పలేను. అందుకేనేమో మా పుట్నాలమ్మ ఇప్పటికి నా మనసులో మేదులుతుంటుంది.

తెల్లారి ఆదివారం. దోసెడు నిండా ఒక పేపరులో పుట్నాలు, ఇంకో పేపర్లో బటానిలు కొంచెం బెల్లం జత చేసిపొట్లం కట్టుకొని, సంచిలో పెట్టుకొని, నేను సాబిర్ కొడుకు ఆరిఫ్, పాష భాయి కొడుకు అమ్జాద్, గుండం వాడ అబ్జల్, ఇర్షాద్, ఆరిఫ్ వాళ్ళ చిన్నమ్మ కొడుకు యాకుబ్ పాషా, కాకతీయ కలని రవి గాడు, మచిలిబాజార్ హరి, రాగాపురం అనిల్. అందరం కలిసి ముళ్ళ చెట్లతో నిండిన బాధ్రకాలి చెరువు గట్టు ని ధాటి, గుడిని ధాటి విశాలంగా ఉన్న ప్రదేశంలో అందరు క్రికెట్ ఆడుతుంటే, నేను మాత్రం దూరంగా ఉన్న చెరువును ఆస్వాదిస్తూ ఒంటరిగా నా మనసుకు నేనే ప్రశ్నలు వేస్తూ సమాధానం చెప్పుకుంటుండగా, అలసి పోయి ఒక్కొక్కరిగా వచ్చి నా పక్కన చేరే వాళ్ళు . అప్పుడు పొట్లాలు బయటికి తీసి అందరికి ఒక చేతిలో పుట్నాలు ఒక చేతిలో బటానీలు కొంచం బెల్లం పెట్టి. నేను కూడా ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ మాటలు లేకుండా ఆస్వాదిస్తూ. దూరంగా పరుచుకొని ఉన్న చెరువుని గుట్టను, చల్లని గాలిని ఆస్వాదిస్తూ గంటల కొద్ది గడిపేవాళ్ళం.

కొందఱు మన జీవితాల్లో చెరగని ముద్రలు వేస్తారు.
నిజమే కొన్ని అనుబంధాలు తర్కానికి అందవు కేవలం మానవత్వం అనే సన్నని తీగతో మా పుట్నాలమ్మ నా మనసుని అల్లుకుంది.

**

"నారాయణగూడ" "నారాయణగూడ" కండక్టర్ పిలుపుతో మెలకువ వచ్చి జ్ఞాపకాల తీగను తెంపి దబుక్కున కిందికి దూకి టైం చూసుకొని, అరరే టైంతో పాటే నేను కూడా యంత్రికున్నని, ఓ మరమనిషినని గుర్తు తెచ్చుకొని ఆఫీసు కి పయనమయ్యాను.

Saturday, August 6, 2011 at 3:08pm

ఆరుద్ర

మళ్ళీ చాల కాలం తర్వాత జయతి అక్కయ  గారి ఫోటో ఆల్బం లో చూసాను ఆరుద్రని. అచ్చమైన ఎరుపువర్ణం లో ఉన్న ఆరుద్రని చూసి చాల కాలమైంది. దాదాపు పదేండ్లు కావస్తుంది.
వేసవి సెలవులు అనే పధం వినపడితే చాలు చిన్నమ్మ వాళ్ళ ఇళ్లు గుర్తొచ్చేది. కొత్తకొండ, ధర్మారం కరీంనగర్ జిల్లాలో ఉండేది వారి ఇళ్లు.  ఎండాకాలమే కాదు వర్షాకాలం శీతకాలల్లో కూడా నాలుగైదు రోజులు వెళ్లి గడిపెవాల్లము.

అప్పట్లో ఇప్పటి లాగ ఆటోలు లేవు హన్మకొండ బస్సు స్టాండ్ లో బాపు, అమ్మ, అన్నయ, అక్కయ, నేను అందరం కలిసి ములకనూరు బస్సు ఎక్కేవాళ్ళం.
అక్కడ మొదలైన బస్సు మెల్లిగా కదులుతూ పెట్రోల్ పంప్, నయీం నగర్, కాకతీయ విశ్వవిద్యాలయం దాటిన తర్వాతే వేగం పుంజుకునేది. ఆ కాలంలో బస్సు కిటికే నాకో పెద్ద ఇంటర్నెట్ ఎండకాలమైతే Windows XP వానకలమైతే Windows  Vista ఇక ఆ బస్సు కిటికిలోంచి  ప్రపంచాన్ని చూడడమే తరువాయి దూరంగ కనిపించే కొండలు, వేగంగ వెనక్కి పరిగెత్తే చెట్లు, ఒక గ్రాఫ్ లో గీతల్లాగా పైకి కిందికి ఊగిసలడుతున్నట్టు తోచే కరెంటు స్థంబాల వైర్లు, మధ్యలో కనిపిస్తున్న ప్రతి వారికి చెయ్యి ఊపుతూ టాటా చెపుతూ సాగే ప్రయాణంతో ఒక గంటలో ములుకనూరు చేరేవాళ్ళం. చుట్టూ పక్కన ఉన్న గ్రామాలన్నిటికీ అదే టౌను.

అక్కడినుండి కొత్తకొండ బస్సు ఎక్కి చుట్టూ ఉన్న సుందర లావణ్యాన్ని చూస్తుండగా చల్లని ఈదురు గాలులకు దీటుగా బస్సు దూసుకుపోతుంటే వెచ్చటి అమ్మ ఒళ్ళో కూర్చొని కిటికీ నుండి చూడగా దూరంగా మంచుతో కప్పబడిన కొండలు ఏదో గ్రామంలో ప్రయనిస్తున్నట్టు కాకా ఊటీ కొడైకెనాల్ కు వెళ్తున్న అనుభూతి కలిగేది(ఇప్పటికిను), మెల్లిగా చినుకులు పడుతుండగా పడిశం పడుతుందని అమ్మ కిటికీ మూసేది. నీటి తుంపర్లతో మసగ్గా మారిన కిటికీ  నుండి చూడగా కనిపించే కొండలు వాటిని కప్పుకొని ఉన్న మంచు పొగలు, జోరుగు కురుస్తున్న వర్షం, ఈదురు గాలులకు వంగి పోతున్న చెట్లు, ముద్దైన పంటపొలాలు, అన్ని కూడా, ఓ చిత్రకారుడు గీసిన వర్ణ చిత్రం లాగ తోచేది. అప్పుడప్పుడు తలుక్కున మెరిసే ఆవులు, పొలం చివర్లో గట్టుపైన కట్టుకున్న గుడిసెలు, తడుస్తూ పరుగులు పెడుతూ పొలం బాయిల కాడ నా ఈడు పిల్లలు, మరి వెలుతురుగా కాకా మరి చీకటిగా కాకా మసక వెలుతురులో, అధ్బుతమైన ప్రకృతి అందాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వంద మంది చిత్రకారుల వర్ణ చిత్రాలతో ఏర్పాటు చేసిన అతి పెద్ద సహజ గేలరీ ని చూస్తున్న అనుబూతి ఓ బస్సు కిటికీ ద్వారా కలిగేది.

మెల్లిగ వర్షం తగ్గే సమయానికి కొత్తకొండ కి చేరుకునే వాళ్ళం. ఇక అక్కడినుండి ధర్మారం గ్రామంలోకి వెళ్ళాలంటే ఎర్ర మట్టి రోడ్డు పై నాలుగు కిలోమీటర్లు నడవాల్సిందే. ఇక తడిచి ముద్దైన నేల బాటపై బురద చిల్లకుండ స్లిప్పర్లను బొటన వేలుతో గట్టిగ పట్టుకొని, అన్నయ చూపుడు వేలును ఆసరాగా తీసుకొని  నెమ్మదిగ అడుగులు వేస్తూ వెళ్ళేవాళ్ళం.  ఇక నేను మాత్రం కుడి వైపుకు ఉన్న పెద్ద పెద్ద కొండలని, గుట్టల చివరని, తల పైకెత్తి చూస్తుంటే, అక్కడికి చేరుకుంటే ఆకాశాన్ని అందుకోవడమే అని అన్నయ చెప్తూ ఉంటె వింటూ నడిచేవాన్ని, ఎడమ వైపు నేల కనపడకుండా పచ్చని పొలాలు, చిన్న చెరువు, చెరువు మొత్తం ఓ frame  లాగ ఆకాశం మేఘాలు ఆ frame  లో బంది అయి కనులకు ఇంపుగా తోచేది.

ధోతి పైకెత్తుకొని, తలకు రుమాలు చుట్టుకొని, చలి బెట్టకుండా గొంగడి కప్పుకొని, చేతి కర్ర పట్టుకొని, ఆహే ఆహే అంటూ పాతిక గొర్రెలను తోలుకుంటూ ఎదురొచ్చే తాత, పెద్ద సైకిల్ పై గోనే సంచుల మూటలతో లుంగీలు కట్టుకొని ఎదురొచ్చే మధ్యవయసు యువకులు, కూలి పనులకి పోతున్న ఆడవాళ్ళు, ఒక్కొక్కటి ఎదురు పడుతుండగా చూస్తూ వెళ్ళేవాళ్ళం. ఆ నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో కొండలపైనుండి పరుగులు పెడుతున్న కొండెంగా కోతులు, ఎలుగుబంట్లు, పరుగులు పెట్టె కుందేళ్ళు (చిత్రం అవ్వన్నీ ఇప్పుడు డబ్బులు పెట్టి "జూ" కి వెళ్తే తప్ప చూడని పరిస్థితి), బతుకమ్మ పండగలో ఉపోయోగించే, తంగేడ పూలు, సీత  జడ పూలు, ఇంకా నాకు పేర్లు తెలియని అందమైన పూలు, నిలువెత్తు జమవాయిలు చెట్లు, మామిడి, జామ, కంకి, వరి, పత్తి, ప్రొద్దు తిరుగుడు పూల తోటలు. అన్ని కూడా నన్ను సాధారముగా ఆహ్వానం పలికేవి, నా మనసు ఎన్నో అవతారలేత్తేది నాలో బిన్న భావాలూ ఒక కవిగా, శాస్త్రవేత్తగా, చిత్రకారునిగా, విశ్లేషకుడిగా, దర్శకుడిగా, ఫోటోగ్రాఫర్ గ, సృష్టి రహస్యాన్ని చేధించాలనే ఓ యోగి ల , జీవిత పరమార్ధం ఈ ప్రకృతిలోనే దాగుందని నమ్మే ఓ సాధువుల ఇలా  చెప్పుకుంటూ పోతే ఎన్నో అవతారాలెత్తిధి.
మనసుని చూపుని నాకు సాధ్యమయెంత  వరకు ఓ వల లాగ విసిరి ఆ ప్రకృతి దృశ్యాన్ని మొత్తం గుండెల్లో పదిలంగా దాచుకొని మనస్పూర్తిగా ఆనందించే వాణ్ని.

నాలుగు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ధర్మారం లోకి చేరుకునేవాళ్ళం. ఆ గ్రామం లో మొదటి ఇల్లు మా చిన్నమ్మ వాళ్ళదే. మూడు గదులు గల చిన్న పెంకుటిల్లు ముందు కూర్చోవడానికి గద్దె(అరుగు), నీడకోసం వేసిన పందిరి దానికి అల్లుకొని పెరుగుతున్న బటాణి పూల చెట్టు, మూడు గదులు కూడా ఎర్రమన్నుతో అలికి ముగ్గులు పెట్టి ఎప్పుడు శుబ్రంగ ఉంచుతుంది చిన్నమ్మ(శుబ్రత విషయంలో మా చిన్నమ్మ తీసుకొనే జాగ్రత్తలు అంత ఇంత కాదు). ఇంటి వెనకాల విశాలమైన ప్రదేశం మధ్యలో అతి పెద్ద చింత చెట్టు ఆ ఇంటి మొత్తాన్ని ఓ గొడుగుల తన కౌగిల్లోకి తీసుకొని కాపాడుతున్నట్టు ఉంటుంది. ఓ మూలన దాదాపు ఏడెనిమిది బొప్పాయీ చెట్లు, రెండు జామ చెట్లు, నిమ్మ చెట్టు, కాయగూరల మొక్కలు, కనకాంబరం, సీత జడ పూల మొక్కలు, ఇంకా కంద మొక్కలు, పాలకూర, బచ్చలి, చిక్కుడు మొక్కలు ఉండేవి. ఎప్పుడు ఇంట్లో కుటుంబ సబ్యుల్లా మెదిలే చిట్టి పిల్లి కూనలు(రెండు ముద్దల పెరుగన్నం పెడితే తినేసి ఇంట్లో ఓ మూలాన సేద తీరేవి), కోడి పుంజులు, పదికి పైన కోళ్ళు.

అప్పట్లో సైకిల్ అద్దెకిచ్చే షాపు నడిపించేవాడు బాబాయ్, గ్రామం లో అందరికిను మాట సాయం, చేత సాయం చేస్తూ ఏదైనా గొడవలు సమస్యలు గ్రామం ప్రజల్లో కలిగితే న్యాయ నిర్ణేత (పెద్దమనిషి) గ వ్యవహరించేవాడు.

ఇంట్లోకి చేరుకోగానే చిక్కటి మజ్జిగ తాగి చింత చెట్టు కింద ఎవరికీ నచ్చిన చోట వారు చాపలు పరుచుకొని సేద తీరుతుంటే, చింత చెట్టు కాడా మట్టి పోయ్యిలోనే వంటలన్నీ కూడా దానికి అనుకోని పక్కనే రోలు రోకలి(రోకలి తో ఉన్న అనుబంధం అంత ఇంత కాదు), ఇక నేను బయటికొచ్చి, ఎదురుగా ఉన్న రెండెకరాల పొలంలోకి వెళ్ళే వాణ్ని వెళ్లిన ప్రతిసారి రకరక ల పంటలు పత్తి, మొక్క జొన్న, కంది, ప్రొదు తిరుగుడు, బాబ్బెర్లు పండించేవారు నాకు మాత్రం ప్రొద్దు తిరుగుడు, కంది, బాబ్బెర్ల పంటలంటే  మరి ఇష్టం. ఆ పొలం లో ఎంత సేపు గడిపిన తక్కువే అనిపిస్తుంటుంది. ఆ పొలం ధాటి మట్టి దారిని ధాటి వేరే పొలం గట్ట్లపైనుండి నడుస్తూ వెళితే కనిపిస్తుంది పెద్ద ఊడల మర్రి చెట్టు, అక్కడ ఊడలు చేత పట్టి ఊయల ఊగే ప్రయత్నం చేసే వాణ్ని, ఆ మర్రి చెట్టు మొదల్లో కనిపించేవి ప్రదేశమంత మహారాజుల్ల మహారానిల్ల  పాలిస్తున్నట్టుగ ఆరుద్ర పురుగుల గుంపు, చాల సార్లు చేతిలోకి తీసుకొనే ప్రయత్నం చేశాను కాని ధైర్యం చాలలేదు. ఎత్తు వంపులను ఎక్కుతూ థిగుతూ, ఒక దాని వెంబడి ఒక్కొక్కటి రైలు బోగిల్ల వెళ్తుండడం భలే ముచ్చటేసేది. ఆ గ్రామం లో గడిపిన రోజుల్లో ప్రతి రోజు ఆరుద్ర పురుగుల రాజ్యానికి వెళ్లి వచ్చేవాడిని. ఆరుద్ర రాజ్యాన్ని అనుకొనే పెద్ద నల్ల చీమల రాజ్యం, దానికి కొంచెం దూరం లో ఉన్న పిచ్చి మొక్కలను ఆసరాగా తీసుకొని జీవనం సాగిస్తున్న బంగారు పురుగులు, అలా కొంచెం తల పైకెత్తి చూస్తే కనిపించే తేనె తెట్ట ల మహేలు, ఒక వందకు పైగా సంగీతాలు వాయించే పిచుకలు వాటి గూళ్ళు, అప్పుడప్పుడు వినిపించే కోయిల స్వరం, ఊడల మధ్యలనుండి సింధూరం పూసుకొని సిగ్గుతో తలదించుకొని అస్తమిస్తున్న సూర్య బింబం, గాలి విచినప్పుడల్లా పసుపువర్నంలోకి మారి రాలుతున్న ఆకులు, ఇలా ఓ అధ్బుత సుందర లోకం లోకి అతిధిగా వచ్చిన  నా మనసుకు ప్రతిరోజు సేవ చేసేది ఆ ప్రాంతం అంత. ఇదే తంతు ప్రతి రోజు ఒక్కోరోజు ఉదయాన్నే వేల్లెవాన్ని ఒక జేబులో వేయించిన పల్లీలు, మరో జేబులో, వేయించిన శనగలు, చేతిలో మొక్కజొన్న పాలేలు, అలా తినుకుంటూ అక్కడికి చేరుకొనే వాణ్ని, అపుడే ఉదయిస్తున్న సూర్యుని కిరణాలూ, పంట పొలాలపై ప్రతి చిన్న ఆకును కూడా వదలకుండా పడేది. జివ్వుమని తగిలిన సూర్యకిరణం ప్రతి ఆకును మేలుకోల్పేది. ఆకూపై సేదతీరుతున్న చిన్న చిన్న నీటి బిందువులు పై పడుతున్న సూర్యకిరణం తో ఉత్తేజితమై వజ్రపు రంగులోకి రూపాంతరం చెందేది. అదంతా గమనిస్తున్న నేను నా మనసు కెమరాలో బంధించుకునే వాణ్ని. హమ్మయ్య లేగండ్రా  అనుకుంటూ ఆరుద్ర పురుగులు బయటికోచ్చేవి తమ రాజ్యంలో  ఉన్న మిగతా పురుగులతో ఆ సమయంలో వాటి రంగు మరింత తేజోమయమై ఉండేధి.

కొంత కాలం తర్వాత నా జేబులోకి డిజిటల్ కెమరా వచ్చి చేరాక ఆ ఆరుద్ర కోసం నాలుగు రోజులు వెతికాను. ఈ అతిధి మీద కోపం పెంచుకున్నాయేమో లేక మరే కారణమో కాని కాలంతో పాటు జరిగిన మార్పులతో మర్రి చెట్టు, ఆ ఆరుద్రలు, పక్షుల గూళ్ళు, కాలంలోనే మాయమయ్యాయి. ఏమో ఏదో తెలియని అనుబంధం ప్రక్రుతితోనో లేక బావాలతోనో, లేక నాలోనే దాగిన నాతోనో ఏమో ఎవరికీ చెప్పుకోలేని ఓ వింత వేదనకి గురయ్యాను అవి కనపడక పోవడంతో. చెప్పాలంటే ఆ గ్రామం లో నేను చుసిన ప్రతి అంగుళం కూడా నా మనసు వాటికి మాత్రమే తెలిసే బంధం ఏర్పరుచుకున్నది. ఒక్కో చోటు ఒక్కో పుస్తకమై మనసు లైబ్రేరి లో దుమ్ముపట్టకుండా పదిలంగా దాచుకున్న.

పదిహేను సంవత్సరాల్లోనే అభివృద్ధి పేరుతో మనుషుల మధ్యన జరుగుతున్న మార్పులు ఆ గ్రామాన్ని కూడా చుట్టుముట్టాయి. ఇది కొత్తేం కాదు నేను ఊహించిందే అయిన జంతు సంరక్షణ పేరుతో కనిపించిన ప్రతి మూగ జీవిని లాక్కెళ్ళి పోయారు, కొన్ని వందల నెమల్లు, కొండెంగ కోతులు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు, ఒకటి రెండు చిరుతలు, వందల్లో వింత వింత పాములు. ఇలా చెప్పుకుంటూ పోతే తమ తమ రాజ్యాలని కొల్లోగోట్టిన మహానుభావులము మన మానవులమే అని చెప్పుకోవడంలో ఏమాత్రం సిగ్గుగా లేదు.

ఆ గ్రామా ప్రజలందరికీ రాజకీయ గుర్తింపు లబించింది. ఇక రాజీకయ అనుబవగ్నులకి ప్రజలంతా ఉపయోగ పడడం మొదలయింది. పంటలను తగ్గించి, కొల్ల ఫారాలు( పెద్ద  మొత్తం లో వచ్చిన నష్టం ఏ ప్రబుత్వం బరించలేక పోవడం తో వారి నెత్తినే భారం వేసుకొని రైతన్నల మేడలు వంగి పోవడం జరిగింది), పొగాకు బిడిలా సెగ ప్రతి పాలిచ్చే మహిళను కూడా పనిలోకి దింపింది. చైతన్యం పేరుతో గ్రామా దేవతల పండుగలు, ఎడ్లబండ్లపై కొత్తకొండ జాతరను దర్శించుకోవడాలు, ఇంట్లో కుల దేవత పూజలు, అన్ని మాయమవుతున్నాయి, ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు నడిచే ఓపిక, సమయం ఎవరికీ లేదు ప్రతివారు చేతిలో వాచీ చూసుకొని టైం లేదు మరీ చాల బిజీ, ఆటో లు మొదలయ్యాయి బస్సులు కరువయ్యాయి, నా కిటికీ గేలరీ మూతపడింది.

పిల్లల చేసే అల్లరికి ప్రకృతి మాత మౌనంగ కొంగు అడ్డుపెట్టుకొని బాధ పడడం కళ్లారా కనిపించింది. అయిన ఏదో ఆశ, ఏదో అలజడి, ఒక కొత్త అనుబవం, ఒక కొత్త కోరిక ఎప్పుడు నా మనసును ఆ గ్రామా ప్రకృతి దేవత తన వైపుకు లాగుతుంటుంది. ఇప్పటికేమి మించిపోయింది ఏమి లేదని గ్రామా బ్యాంకు సహాయంతో వ్యవసాయశాక   అధికారులు, వేప మందు పరిచయం చేసారు. మంచి పనులు చేయడానికి గ్రామా పెద్దలు ముందుకు రావడం కూడా ఆరోగ్యకరమైన విషయమే.

గ్రామానికేల్లి చాల రోజులయ్యింది. కొత్తగ  తీసుకొన్న ప్రొఫెషనల్ కేమరకి ఇంకా ఆ గ్రామాన్ని పరిచయం చేయలేదు. మరో నాలుగు రోజులు వెళ్లి గడపాల్సిందే.
మెల్లిగ నెమరువేసుకున్న పుస్తకాన్ని మనసు లైబ్రేరి లో బద్రంగా పెట్టుకొని. అందమైన ఆలోచనల నుండి బయటపడి మల్లి రణగొణ ధ్వనులతో యుద్ధం సాగిస్తూ సికింద్రాబాద్ రేతిఫైల్ బస్సు స్టాప్ లోనుండి ఒకటో నెంబర్ బస్సెక్కి ఆఫీసు కి పయనం..


 
జయతి అక్కయ గారి ఆల్బం లో చుసిన ఆరుద్ర
ఆకట్టుకునే ఇలాంటి సుందర దృశ్యాలు మరెన్నో

కొంత కాలం క్రితం నేను తీసిన ఫోటోల లింక్ : https://picasaweb.google.com/raghurare1/KothakondaDharmaram

వనబోజనం

భద్రకాళి చెరువు కట్ట చిన్నప్పుడు అది చాల దట్టమైన ముళ్ళ పొదళ్లతో భద్రకాళి దేవాలయానికి ఆనుకొని చెరువు ని కాపాడుతూ ఉన్న కట్ట. ఆ కట్టకు మా ఇల్లు ఐదు నిమిషాల నడక దూరం లో ఉంటుంది.  విశాలమైన చెరువు కాపాడుతున్న కట్ట చివరన అవాలి వైపు ఉన్న గుట్టల కింద ఓ హనుమంతుని గుడి. దాని కింది బాగాన కుడి వైపుకు ఓ మంచి నీటి బావి దాన్నే రాచ్చాల (రావిచెర్ల) బావి అని పిలుచుకునే వాళ్ళం. బావి కి ఆనుకొని  ఉన్న మరో గుట్ట పైకి ఎక్కడానికి వీలుగా చెక్కిన మెట్ల ను ఎక్కుతూ పైకేల్తే పూర్వకాలం లో రాళ్ళతో పేర్చిన ఒక చిన్న కళ్యాణ మండపం దాని వెనకాల ఓ పెద్ద వేప చెట్టు విశాలమైన లక్ష్మి నరసింహస్వామి ఆలయం. ఆలయం గర్బగుడి లో ఓ ములన ఎప్పుడు నీరు ధారల పడుతుంటే ఆ నీటిని నిలువ ఉంచే అతి చిన్న(ఇంట్లల్లో ఉండే వాటర్ ట్యాంక్ సైజు) కోనేరు. ఆ ఆలయాన్ని చూడగానే తెలుస్తుంది అది పెద్ద పెద్ద రాళ్ళను  పేర్చి కట్టారని. ఆ ఆలయం నుండి చూస్తే భద్రకాళి దేవాలయం, కట్ట, బావి, చెరువు (ఈ చివరి నుండి ఆ చివరి వరకు) అంత కంటిగి ఇంపుగా (ఓ landscape దృశ్యం)  కనిపిస్తుంది.

శీతాకాలం  పొద్దున నాలుగు ఐదు గంటల ప్రాంతాన దట్టమైన మంచు పొగలతో చూడ్డానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

నా గతంతో ముడి పడి ఉన్న ఎన్నో ఆనంద క్షణాలు ఇక్కడ ఉన్నాయి. చిన్నప్పుడు మా బాపు మా అన్నయ్యకు ఈత నేర్పించాలని ఈ చెరువు కి తీసుకెళ్ళేవాడు. నన్ను తీసుకెళ్ళు అని అడగడం తో పట్టుకెల్లేవాడు  కానీ ఎప్పుడు నీళ్ళ లోకి అడుగు పెట్టనిచ్చేవాడు కాదు. అప్పటి నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈత నేర్చుకోవడం అనేది ఓ కలగా తీరని కోరిగ్గా మిగిలిపోయింది. మా అన్నయ వాళ్ళ దోస్తుల్తో నేను లేవక ముందే వెళ్ళేవాడు. నన్ను మాత్రం అస్సలు తీసుకెళ్ళేవాడు కాదు.

నాకు ఊహ తెలిసినప్పటి నుండి వంటలకి (వన భోజనం) ఆ గుట్ట మీదికే వెళ్ళేవాళ్ళం. పొద్దునే వెళ్లి ఆ రోజు మొత్తం వంట వార్పూ చేసుకొని గడిపేందుకు ఓ చోటును వెతికి మేము వెళ్ళే వరకు అక్కడే ఉండేవాడు మా అన్నయ (ఎందుకంటే వంటలకి మేమే కాదు వాడలో వేరే వాళ్ళు కూడా వెళ్ళేవారు ఆలస్యం చేస్తే సరైన చోటు దొరకదేమోనని).

ఇక ఆ రోజు స్కూల్ కి డుమ్మా కొట్టడం తప్పనిసరి. అంతకు ముందురోజు నుండే అమ్మ ఆ రోజు కు కావలిసిన వస్తువులు (బోళ్ళు, పల్లాలు, చిన్న గిన్నెలు, వంటనూనె ఇతరత్రా సరుకులు) అన్ని ఓ గోనే సంచి లో మూట కట్టి పెట్టేది. రాత్రి పన్నెండు గంటలవరకు అక్క అమ్మ కూర్చొని కిరసనాయిలు పొయ్యి మీద మూకుడ్లో పూరీలు చేసే వాళ్ళు.
ఇక నా పనిలో నేనుండే వాణ్ణి. పొద్దున్నే లైబ్రరీ నుండి మామయ్య పట్టుకొచ్చిన కొత్త పుస్తకం, ఒక వార పత్రిక, బొమ్మలు గీయడానికి తెల్ల పేపర్లు, ఒత్తుడుకు అట్ట (stiff pad), స్కేచ్చు పెన్నులు, కాంపాక్స్ బాక్సు పెద్ద సేల్లులతో పనిచేసే రేడియో తో నా సంచిని సిద్ధం చేసుకొనే వాణ్ణి.

బాపు పెద్ద సైకిల్ వెనక క్యారేల్కు రాత్రి మూట కట్టి పెట్టిన సంచిని పోట్టేల్ (వైరు లాంటి తాడు) తో కట్టే వాడు. అమ్మ చేతిలో బింద, తాళం వేసి తాళంచెవి ని చేతులో పట్టుకొని అక్కయ సిద్ధం చేసుకున్న సంచిని బుజాన వేసుకొని  టప్పు టప్పు మని పారగన్ స్లిప్పర్లని శబ్దం చేస్తూ నడిపించుకు పోతున్న బాపు పెద్ద సైకిల్ వెనకాల నేను. ఐదు గంటల ప్రాంతాన మంచు పోగలను చీల్చుకుంటూ ఎదురు వచ్చే గాలుల్ని నా చెంపలతో డీ కొడుతూ అప్పుడే బయటికొచ్చి రోడ్లపై నీళ్ళు చల్లుతున్న వాడ పాలోల్ల( relatives )ను చూస్తూ డబ్బా కాడ మూల మలుపులో పెద్ద కోడిపుంజు కూత కూస్తుండగా ఐదు ఆరు నిమిషాల్లో గుట్ట కాడికి చేరుకొనే వాళ్ళం. గుట్ట మెట్లు ఎక్కుతూ పైకి చేరుకునే సరికి ఆయాసం తన్నుకోచ్చేది. మా కోసం ఎదురు చూస్తున్న అన్నయ ఉన్న చోటుని గడపడానికి అనువుగా సిద్ధం చేయడం లో అమ్మ బిజీ అయిపోయేది.

నేను విశాలమైన ఒక పెద్ద బండపై నిల్చొని పచ్చిగా వచ్చే మట్టి సువాసనని గట్టిగా పీలుస్తూ, దూరంగా కనిపించే బాద్రకాళి గుడిని, పక్కనే నిద్రిస్తున్న ఒక యోధుడి తలల కనిపించే పెద్ద గుట్ట ని, కట్టని, చెరువుని, వీటిని కమ్ముకొని ఉన్న దట్టమైన మంచుని, గుంపులు గుంపులుగా మెల్లగా పయనమవుతున్న పక్షుల్ని,  నన్ను కౌగిలించుకునేందుకు వీచే ఈదురుగాలులను ఎదిరిస్తూ, చిన్నగా చలి కి వణుకుతూ, క్షణ క్షణానికి రంగు మారుతున్న ఆకాశాన్ని చూస్తూ, కమ్ముకున్న పొగ మంచుల్ని చీల్చుకుంటూ ప్రశాంతంగా పుట్టుకొస్తున్న సూర్య తేజాన్ని కళ్ళు పెద్దవిగ చేసుకొని, ఆ సమ్మోహన దృశ్యాన్ని, మౌనంగా, మనసులో పదిలంగా దాచుకునే వాణ్ని..

అలా తెలవరాక, గుట్ట కింద రాచ్చాల బావినుండి అన్నయ, బాపు బిందెల్లో నీళ్ళు తెచ్చే వారు, చూస్తుండగానే మా ఇంటి కాడ ఉండేవోల్లు, గుండం వాడ, మచిలిబజార్, మూడు డబ్బాలకడ ఉండేవోల్లు అందరు చేరుకునేవాళ్ళు. ఇప్పుడు విశాలమైన గుట్ట ప్రాంతం జనాలతో, నా ఈడు పిల్లలతో వాళ్ళ వాళ్ళ చుట్టాలతో నిండిపోయేది. మేము ఎంచుకున్న చోటు రెండు అతి పెద్ద రాళ్ల సందులో ఓ గుహలా తలపించేది. అమ్మ మేము ఉన్న జాగా (చోటు) ని చీపురుతో ఊడిచి నీళ్ళు చల్లి, పెద్ద సంచులతో కుట్టి తాయారు చేసిన దాదాపు పది మంది కుర్చేనే వీలు గల ఒక పెద్ద పరదా ఒకటి కింద పరిచి తెచ్చిన మూటలోని సామాన్లని ఒక వైపుకు పేర్చి మమ్మల్ని పిలిచేది, నేను అక్కయ బాపు అన్నయ కూర్చుంటే, రాత్రి చేసిన పూరీలు, చిన్న చిన్న రికాబు (steel  plates) లో పెట్టి నిన్న పొద్దున రోట్లో ఉడికించిన టమాటో, పచ్చి మిరపకయాలని కలిపి నూరిన  పచ్చడి చెంచ తో వేసి ఒక్కొక్కరికి ఇచ్చి తను కూడా ఓక రికాబు లో పెట్టుకొని అందరం కలిసి తినే వాళ్ళం. అబ్బో అమ్మ చేత్తో రోట్లో దంచి చేసిన పచ్చడి గురించి ఎంత చెప్పిన తక్కువే ఎప్పుడు తలచుకున్న నోట్లో నీళ్ళురుతాయి. పూరీలు లాగించడం పూర్తయ్యాక బాపు, ఇంకా బాపుకు తెలిసిన వాడలోని కొందరు కలిసి పెద్ద సైకిల్ల మీద కోళ్ళు కొనుక్కురావడానికి   అలంకార్ దగ్గర ఉన్న చికెన్ షాపు కు బయలుదేరేవారు.

అమ్మ నన్ను మా అన్నాయని కొబ్బరికాయ, ఊది బస్తీలు, థమ్స్ అప్ బాటిలు, రెండు పెద్ద పాల పాకిట్లు, బంబినో సేమియా పాకిటు, చిన్న డాల్డా పాకిటు, సేమియలో వేసుకొనే పప్పులు, బెల్లం, చికెను మసాల పొడి, మిల్ మేకరు, కొత్తి మీరా, పుదిన, పచ్చిమెరపకాయలు తెమ్మని పంపేది, ఇవ్వన్ని తీసుకురావడానికి, రెండు కర్రల సహాయంతో పట్టుకునే వీలు గల సంచిని మా చేతికి ఇచ్చేది. అది నేను పట్టుకుంటే కింద నేలకు రాసుకుంటూ పోయేవాణ్ణి ఎందుకంటే ఆ సంచి నాకు సగానికి ఉండేది. అది చూసి అన్నయ లాకున్ని తను పట్టుకునే వాడు. మెల్లిగ  మేము గుట్ట దిగి అల నడుచుకుంటూ డబ్బా కాడి నుండి మూల తీరుగుతూ గుండం వాడలో నుండి కుడి వైపుకి తీరుగుతూ జెండా కాడికి చేరుకొనే వాళ్ళం అక్కడే ఉంది ఇద్దరు అన్నదమ్ములు నడిపిస్తున్న రాజన్న దుకాణం. గబా గబా తీసుకొని అన్నయ పాయింటు జేబులోనుండి డబ్బులు తీసిచ్చి మళ్లీ గుట్టకాడికి చేరుకునే వాళ్ళం.

బాపు తో వెళ్ళిన వారంతా కోళ్ళతో తిరిగోచ్చేవారు. బాపు వచ్చేలోపు అమ్మ కిరసనాయిలు బర్నాల్ పొయ్యిమీద గిన్నె పెట్టి  పాలు వేడి చేసి కొన్ని పాలతో చాయ్ చేసి మరి కొన్ని పాలతో సేమియా చేసేది. బాపు రాగానే మా అందరికి చాయ్ ఇచ్చి తను చాయ్ తాగేది (నాకు ఊహ తెలిసాక గత పన్నెండు సంవత్సరాల నుండి టీ కాఫీ మాంసం తీనడం మానేసాను నా ప్రవర్తనకి ఇంట్లో పెద్ద రాద్ధాంతమే జరిగింది కానీ నన్ను మార్చలేక పోయారు ఇప్పటికిను) తర్వాత పొయ్యి మీద పెద్ద గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి, అమ్మ బాపు మేము ఉంటున్న చోటుకి కాస్త దూరంగ వెళ్లి కోడిని ఊరి దేవతకు బలి ఇచ్చేవారు. ఆ రకంగా ఆ రోజు వంటలకోచ్చిన వారంతా కోళ్ళను బలిచ్చేవారు. వేడి చేసిన నీళ్ళతో కోడిని  శుబ్రం చేసి వండడానికి వీలుగా సిద్ధం చేయడం లో బాపు. మరో పక్క అమ్మ పోయి మీద బియ్యం కడిగి అన్నం పెట్టి అది ఉడుకుతుంటే పొంగ కుండ చూడామణి అక్కయను కూర్చో బెట్టేది.

ఇక నేను అక్కడినుండి బయటికొచ్చి మా ఇంటికాడ రాజు, మహేశు, శీను, మేమంతా, ఇంకా మిగతా పిల్లలమంతా నరసింహస్వామి గుడి వెనకనుండి సందు లో ఎత్తు రాళ్ళని పట్టుకుంటూ గుడి పైకి ఎక్కి కూర్చునే వాళ్ళం. అన్నయ ఇంకా వాళ్ళ దోస్తులు చెరువులో ఈత కొట్టడానికి ఎల్లెవాల్లు. ఇక గుడి పైన రేడియో పెట్టి వచ్చే ప్రోగ్రాములు వింటూ నేను ఓ పక్కన కూర్చుంటే, కొంచెం ఎగిరితే అందే ఎత్తులో ఉన్న వేప కొమ్మలని పట్టుకొని ఊగే ప్రయత్నం చేస్తూ మిగాతవాల్లంత, ఆ గుట్ట కాడికి వంటకోచ్చిన వాళ్ళలో దాదాపు పాతిక మందికి పైగా పిల్లలం అందరం కలిసి ఒకటే అల్లరి. రక రకాల ఆటలతో సందడి సందడి చేసే వాళ్ళం. పదకొండున్నార ప్రాంతాన ఆడింది చాలు అంటూ మమ్మల్నంధర్ని పిలిచేవారు. నేను వెళ్లేసరికి అమ్మ బాపు మేమున్న చోటుకి కొంచెం దూరంగా వెళ్లి ఒక విస్తారాకు చుట్టూ నీళ్ళు జల్లి, అన్నం, కోడి కూర, సేమియా, ఉడికించిన గుడ్డు, పసుపు కుంకుమ, ఇంకేవేవో మా కుల దేవతకి నైవేద్యంగ పెట్టి కళ్ళు మూసుకొని దండం పెట్టి వచ్చేవారు. ఇదంతా మామ్మల్ని (పిల్లల్ని) చూడనిచ్చేవారు కాదు.

కాసేపటి తర్వాత పన్నెండు గంటల ప్రాంతాన, పెద్ద పళ్ళాలని ( plate )  కడిగి అందరిని కూర్చోమని, ముందు బాపు కి వడ్డించి తను తినడం మొదలు పెట్టాక, అన్నయకు, అక్కయకు, నాకు వడ్డించేది నా చిన్న పళ్ళెం లో (నాకు ఒక చిన్న పళ్ళెం ఉండేది అది మా అన్నయ్య పుట్టాక మా అన్నయకోసం కొన్న పళ్ళెం తను పెద్దవాడయ్యాక, అది అక్కయ సొంతమయ్యింది, అదే వరుసలో నా దగ్గరికొచ్చింది, ఆ తర్వాత మా చిన్నమ్మ కొడుకులు ఇద్దరు వాడారు. ఆ పళ్ళెం అంటే అందరికి ఇష్టమే ముఖ్యంగా అమ్మకి చిన్నమ్మకి ఇప్పుడది చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది.) ముందు పూరీలు, పచ్చడి, ఒక చిన్న గ్లాస్ లో థమ్స్ అప్ తర్వాత నిన్న సాయంత్రం చేసిన పప్పుచారు తో కలిపినా అన్నం ఆ తర్వాత మాంసం తో పూర్తి చేసేవాళ్ళం. చేతులు కడుక్కోన్నాక మూతిని తుడుచుకుంటూ వస్తుంటే మా ముగ్గిరికి చిన్న చిన్న గిన్నెల్లో సేమియా పోసి ఇచ్చేది. అల రెండు సార్లు వేసుకొని తినే వరకు త్రుప్తి కలగక పోయేది.

బాపు కొంచెం ఎత్తు తక్కువున్న బండపై చెట్టుకొమ్మ నీడ పడుతుండగా సంచి చేద్దరు తల కింద పెట్టుకోవడానికి ఓ దిండుని అమ్మ సిద్ధం చేస్తే మెల్లిగా కునుకి తీసేవోడు. అక్కయ అమ్మకి భోజనం వడ్డిస్తూ ముచ్చట్లు పెడుతుంటే, అన్నయ వాళ్ళ దోస్తులతో కలిసి ముళ్ళ ఫొదల్లతో నిండిన భద్రకాళి కట్ట (ఇప్పుడది అందమైన గార్డెన్ లాగ, పర్యాటకులు సేదే తీరేవిధంగా, పిల్లలకు ఆడుకునే ఆటస్థలం లాగ, ప్రేమ జంటలకు మనసువిప్పి మాట్లాడుకునే ఓ చక్కటి ప్రదేశంగా రూపాంతరం చెందింది) మీదికి వెళ్ళేవారు. నేను నా సంచిని బుజాన  వేసుకొని లక్ష్మి నరసింహస్వామి గుడి పైకి ఎక్కి చెట్టు కొమ్మ నీడలో కూర్చొని, వారపత్రికని, పుస్తకాన్ని, తిరగేసి, కాసేపటి తర్వాత సంచిలో నుండి రేడియో ని బయటికి తీసి చిన్న శబ్దం తో హిందీ వివిద్ భారతి ప్రోగ్రాము వింటూ, అట్టను బయటికి తీసి దాని పై తెల్ల పేపరు పెట్టి, కంపాస్  బాక్స్ లో నుండి పెన్సిల్ తీసి, చుట్టూ ఓ సారి చూసి, కళ్ళు మూసుకొని పొద్దున చూసిన సుందర దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకొని, రేడియో లో వస్తున్న జో బాత్ తుజ్ మే హే తేరి తస్వీర్ మే నహి అంటూ వినిపిస్తున్న మొహమ్మద్ రఫీ గారి గీతాన్ని వింటూ పెన్సిల్ తో గీయడం మొదలు పెట్టి స్కేచ్చులతో రంగులు అద్దటం తో పూర్తయ్యేది. ఒక్కొక్కరితో మొదలై మా వాడ దోస్తులంత నా చుట్టూ చేరి చూస్తుండేవారు. ఆ తర్వాత ఒక్కో కాగితం మీద ఒక్కొక్కరికి వారి పేర్లను గీసివ్వడంతో బిజీగా గడిస్తున్న సమయంలో దూరంగా ఎక్కడో పుట్టిన చిన్న మేఘం మెల్లి మెల్లిగ పెరుగుతూ చూస్తుండగానే సూర్యున్ని మింగేస్తూ మా మిదికొచ్చి మమ్మల్ని తొంగి చూసేది. మేమంతా తలల్ని ఆకాశం వైపుకు ఎత్తి చూస్తుండగా, వీస్తున్న ఈదురు గాలులకు చిన్న చిన్న నీటి తుంపర్లు నా నుదురు, కన్నులు, బుగ్గలను, తగులుతుంటే, ఒక్కసారిగా జీవ్వుమంటూ ఉలిక్కి పడేవాణ్ణి, పులకరింతల ఆ హాయికి గుర్తుగ నా చేతిపై రోమాలు నిక్కపోడుచుకునేవి. కొద్ది కొద్దిగా పెరుగుతూ ఒక జల్లు లాగా పడుతున్న వర్షానికి అందరం గూళ్ళల్లో పిచ్చుకల్లాగా కొండ చీరుకల్లో పెద్ద రాళ్ల సందుల్లో తడవకుండా తల దాచుకునే వాళ్ళం. బోరున కురుస్తున్న వర్షానికి ఎదురుగా ఎవరో కుంచేతో తెల్ల రంగులని చిలుకుతూ గీసిన వర్ణచిత్రం లాగ ఆకాశం మరియు  పచ్చని తుమ్మ పోధల్లని ఎకంచేస్తున్నట్టుగా కురుస్తున్న వర్షంకు పాలిపోయి ఉన్న గుట్ట రాల్లన్ని నల్లగా మారి, పచ్చని చెట్ల ఆకులు మరింత నిగ నిగ లాడుతూ, గుట్టపై ఉండే మేకల గుంపు ఒల్లుని జలదరిస్తూ తల దాచుకోవడానికి పరుగులు పెట్టె ఆ తీరు, పిల్లల కేరింతలు, వర్షంలో మమ్మల్ని తడవనీయకుండా పెద్ధవాల్లంత అడ్డుకోవడాలు, అయినా తప్పించుకొని పరుగు పెట్టె ఆకతాయిలతో వేగ లేక చీర కొంగును తల మీదేసుకొని వారి వెంట పరుగులు పెట్టె అమ్మ వాళ్ళతో ఆ వాతవరనమంత వర్ణించడానికి వీలు లేని ఓ మధుర దృశ్యంలాగ  అక్కడ ఏర్పడేది.

మెల్లిగా వాన తగ్గడంతో గూళ్ళల్లో నుండి బయటికొచ్చే పక్షుల్లాగా మేము బయటికొచ్చి, గుట్టలపై నుండి ధారలాగా పడుతున్న నీటి మత్తడని చూస్తూ నీళ్ళు ఆగి ఉన్న చోట రాళ్ళ మూలల్లో నుండి జారుకు వచ్చిన చిన్న చిన్న రంగు రంగు రాళ్ళను సేకరించడం లో నిమగ్నమయ్యేవాళ్ళం. అటు నుండి కిందికి దిగి రావిచెర్ల బావి లో తాబేలును చూస్తూ ఆ పక్కనే ఉన్న హనుమంతుడి గుడిని, దానికి ఆనుకొని ఉన్న చెరువు గట్టు లో తడిచి ముద్దై ఉన్న తామరాకుల మధ్యనుంది చీల్చుకొని పైకి తలెత్తుకొని గల గల నవ్వుతున్న పూవుల్లో దాగిన నీటి చుక్కలని చూస్తూ, విరబూయడానికి సిద్ధంగా ఉన్న మొగ్గలని కర్రలతో మా వైపుకు లాగే ప్రయత్నం చేసేవాళ్ళం.

మచిలిబాజార్ వాడోల్లు మొత్తం బెస్తోల్లె ఆ వాడోల్లందరికీ  ఈ చెరువే ఆధారం. పిల్ల చేపల్ని ఈ చెరువులో పోసి అవి పెద్దయ్యాక తెప్పల ( థర్మకోలును పెద్ద పెద్ద ప్లాస్టికు సంచుల్లో పెట్టి కుట్టి తయారుచేసుకున్న పడవ) తో వెళ్లి వలని పేర్చి తెప్పలపై కూర్చొని వలలో పడే చేపల కోసం ఎదురు చూస్తుండేవోళ్ళు. ఇక మేము చిన్న చిన్న సాపుగ ఉండే బిచ్చలను సేకరించి ఓ కుప్పగా పోసి. బొటన వేలు చూపుడు వేలుకు మధ్య రాయి ని పట్టుకొని మోచేతిని వంచి వెనక్కి జరుపుతూ గురిచుస్తూ బలంగ నీళ్ళలోకి విసరగ ఆ బిచ్చ నీటి పై పల్టీలు కొడుతూ పరుగు పెట్టి వేగం తగ్గాక నీటిలో మునిగేది ఆ రకంగా ఎవరు ఎక్కువ పల్టీలు కొట్టిస్తే వాళ్ళు హీరోలు. మేమంతా అరపులు కేరింతలతో ఒకరిని మించి ఒకరం వేగంగా విసిరే వాళ్ళం. కాసేపటికి నేను ఓ పక్కన కూర్చొని పల్టీలు కొడుతున్న రాళ్ళను చూస్తుండగా. వలలు పెట్టి తెప్పలపై కూర్చున్న బెస్తాయన ఓయ్ ఓయ్ ఎవర్ర రాళ్ళు ఇసురుతున్నది అంటూ అరవగానే. నేను మెల్లిగా లేస్తూ నా రెండు అరచేతులని వెనక్కి పెట్టి నిక్కరుకు అంటిన పచ్చి మట్టిని దులుపుకుంటూ అందరితో పాటు ఉరుకేవాన్ని.

అల పరుగెడుతూ మేమున్న చోటుకి వెళ్ళగానే అమ్మ చేతులుకడుక్కోమని నీల్లిచ్చేది. చేతులు కడుక్కోగానే మల్లి పూరీలు, కూర, పచ్చడి, పెట్టి ఇచ్చి, అన్నం పెట్టన అని అడిగితే వద్దని చెప్పి పూరీలు తినే వాణ్ని, ఇక అక్కడ వండిన వంటలు ఏవి ఇంటికి తిరిగి తీసుకేల్లకూడదని ఇక్కడే తినల్సిందేనని  పట్టు బట్టి మరి అందరికి వడ్డించేది అమ్మ. తినడం పూర్తయ్యాక కొబ్బరిపీచు బూడిదతో అన్ని బోళ్ళు అమ్మ తోముతుంటే అక్కయ కడుతుండేది. మల్లి అమ్మ నేను అక్కయ అన్ని సదిరి మూట కట్టి ఇంతకు ముందు మిగిలిన అన్నం కూర పూరీలు ఒక పెద్ద విస్తర్లో వేసి కుక్కలకోసమని అక్కడే వొదిలి వెలుతురు పలుచబడుతుండగా మెల్లిగా గుట్ట కిందికి దిగుతుంటే మాతో పాటే మిగితవాళ్ళు కూడా ఇక పయనమయ్యే వారు.

ఇక ఇంట్లో కొచ్చి కాళ్ళు  చేతులు కడుక్కొని కూచునే సరికి ఆరున్నర అయ్యేది. దీపం వెలుతుర్లో ఓ పోస్ట్ కార్డు తీసుకొని ఆ రోజు జరిగిన సంగటనలన్ని అందులో రాసి నా సంచిలో పెట్టుకొని అమ్మ సిద్ధం చేసిన పక్క (పరుపు) లో నిద్ర పోయెవాన్ని..

మళ్లీ అలంటి వనబోజనాలకి వెళ్లక దాదాపు పదేల్లయ్యింది ఇదంతా తలచుకుంటే ఒక సారి ఆఫీసు కు డుమ్మా కొట్టి, ఈ రణగొణ ధ్వనులకు, కంప్యూటర్, ఫెసుబూక్, ఫ్లిక్కర్, వర్డ్ ప్రెస్, ఆర్కుట్, బ్లాగ్స్, గ్రూప్స్, ఐ పాడ్, చివరాకరికి మొబైల్ వీటన్నిటిని వొదిలి. కెమరాని మేడలో వేసుకొని ఒక్కరోజంత గడపాలనుంది.

ఎప్పుడు వీలవుతుందో....

జీవితం - ఒక రైలు ప్రయాణం

హలో ఎలా ఉన్నారు అన్నయ అని పలకరించింది శ్రావ్య.
చాల రోజుల తర్వాత విన్న గొంతు తో మనసులో సంతోషం ఒక్కసారిగా పొంగుకొచ్చింది.
కులాసా కబుర్ల తర్వాత ఫోన్ అరుణ్ అందుకున్నాడు.
ఏరా మామ ఎలా ఉన్నావు రా అంటూ మొదలు పెట్టిన మాటలు ౩౦నిమషాలకి గాని పూర్తవలేదు.

ఫోన్ పెట్టేసి పక్కకు తల వాల్చి...
అరుణ్ శ్రావ్య లే కాళ్ళ ముందు మెదిలారు.

జీవితం అనే రైలు ప్రయాణం లో ఎన్నెన్నో మలుపులు కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు, కొత్త మధురనుబుతులు కొందరు దగ్గర ఉన్న పట్టించుకోము. దూరంగా ఉంటె తట్టుకోలేము. కానీ అరుణ్ శ్రావ్య వీరు మాత్రం ఎక్కడున్నా నా మనసులో ఎప్పుడు మెదులుతూనే ఉంటారు.

2004 కాజిపేట లో కృష్ణ  ఎక్స్ ప్రెస్ ఎక్కినా రెండు నిమిషాలకి కదిలింది. లక్కీగ కిటికీ పక్క సీటు కాలిగా ఉండడంతో వెళ్లి కూర్చున్న మెల్లిగా బాగ్ లో నుండి బుచ్చిబాబు చివరికి మిగిలేది బుక్ తీసి చదవడం మొదలు పెట్టాను. ఒక పేజి చదివిన తర్వాత ఎదురుగా ఉన్న వ్యక్తి చదువుతున్నా పుస్తకం పై కన్ను పడింది "కలలో జారిన కన్నీరు" అది కూడా బుచ్చి బాబు గారిదే.

నా పేరు రఘు అంటూ పరిచయం చేసుకున్నాను. తను అరుణ్ అంటూ చేయి చాచాడు. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని. మాటల్లో దిగాము. మూడు గంటల ప్రయాణం తర్వాత సికింద్రాబాద్ చేరుకున్నాం. మూడు గంటల ప్రయాణం లో చాల అర్ధమైపోయాము. ఎంతగా అంటే ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టుగ.

చాల కలం తర్వాత నాలుగు రోజుల కాలి సమయం దొరికింది కదా అని హైదరాబాద్ లో ఉన్న పెన్ ఫ్రెండ్ పీటర్ ని కలిసి ఒక నాలుగు రోజులు గడుపుదామని బయలుదేరాను. మధ్యలో ఇలా అరుణ్ పరిచయం.

అప్పుడు మొదలైన మా పరిచయం ఎన్నో మార్పులు చేర్పులు ఇరువురి జీవితాల్లో జరుగుతూ ఉన్న మా స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంది.

అరుణ్ కి పాలిటిక్స్ అంటే మమకారం CM  కావాలని కలలుకంటుండె వాడు. వాడు, వాడి ఆలోచనలు ఎప్పుడు బడుగు బలహీన వర్గాల చేయుతకై పాటు పడే సంఘాలతో పల్లెల్లో రసాయనాల వాడకాన్ని నిర్ములించి వేపతో తాయారు చేసిన పురుగుల మందు పై అవగాహనా కలిగించేందుకు వ్యవసాయ శాక అధికారులతో గ్రామాల్ని పర్యటించేవాడు. సమస్యని ఎత్తి చూపడం తగ్గించి, దానిని ఎలా అధిగమించాలి అని ఆలోచిస్తూ తన వంతు సాయం చేయడానికి ఎప్పుడు సిద్దంగ ఉండే వాడు.

వాడికి ఉన్న రాజకీయ అనుభవం అవగాహనా వాడు రాస్తున్న ఆర్టికల్స్ లో ప్రస్పుటంగ కనిపించేవి. నువ్వు కనుక CM  అయితే ముందు ఎం చేస్తావురా అని అడిగితే. మద్యం, సిగరెట్టు, గుట్క లు అమ్మే షాపుల్ని ఒక్కసారిగా పెకిలించేసి రాష్ట్రంలో ఎక్కడ కూడా మద్యం, సారాయి, లాంటి మత్తు పదార్ధాల్ని, లేకుండా చేస్తాను. అని చెప్తూ ఉంటె పక్కనున్న మేమంతా గొల్లున నవ్వేవాళ్ళం. దానికి వాడు ఏ మాత్రం చిన్న బుచ్చుకోకుండా, ఈ మాత్రం కూడా చేయలేని వాడు CM  అయ్యే బదులు అడుక్కుతినడం మేలు. అనే వాక్యంతో మా నోర్లు మూసే వాడు.  వాడి ఆలోచనలు కేవలం ఆలోచనలతో పరిమితమయ్యేవి కావు. ప్రతిది కూడా చాల పకడ్బందిగా సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో ఎవరిని కలిస్తే త్వరగా పని పూర్తవుతుందో వారిని కలిసే వాడు.

తండ్రి లేడు తల్లి మాత్రం ఉంది వీడొక్కడే కొడుకు. ఊర్లో పొలం, పాలేర్ల (పని వాళ్ళు) తో సాగు చేపిస్తుండేది తల్లి. వీడి దూకుడు చూసి వీడి మామయ్య తన కూతుర్ని ఇవ్వనన్నాడు. అరుణ్ ఇంకా వాడి ఫ్రెండ్స్ తో కలిసి గ్రామాల్లో నిరక్షరస్యతో నిర్మూలన పేరుతో నాటకాలు వేయిస్తూ. కలెక్టర్, గ్రామా పెద్దల సహకారంతో మారుమూల పల్లెల్లో మరుగుదొడ్లు కట్టించడం, ఏదైనా ఒక గ్రామాన్ని తీసుకొని వ్యవసాయ శాక అధికారి సహాయంతో  రోడ్డు కిరువైపులా వేప మరియు పళ్ళ మొక్కలని విద్యార్థులతో నాటించడం. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.  ఆ కార్యక్రమాలకి నన్ను కూడా లాక్కొని పోయేవాడు.

తనని చూసినప్పుడల్లా నేనెందుకు నా ఆలోచనలని చేతల్లో పెట్టలేకపోతున్న అని ఆలోచించేవాన్ని.
ఒక వ్యక్తి ఆలోచనకు ఎంత బలం ఉంటుందో. తనని చూస్తే తెలుస్తుంది.

వాడితో గడిపింతసేపు రాజకీయాలు, సేవ కార్యక్రమాలే కాదు, మా వయసుకు తగ్గట్టు సినిమాలు, బైక్ షికార్లు, సంగీతం, కొత్త అనువాద పుస్తకాలు, గుళ్ళు, జగన్నాధ రథ యాత్రలు, గణపతి ఉత్సవాలు, సికింద్రాబాద్ మహంకాళీ, ఓరుగల్లు సమక్క సారలమ్మ జాతరలు, హొలి సందళ్ళు, పండగలలో ప్రతి పల్లెల్లో రక రకాల విందు బోజనాల పిండి వంటల రుచులు, పల్లె సువాసనలు పీలుస్తూ ఎడ్ల బండ్లపై ప్రయాణాలు, పొలం గట్లపై నడకలు, మోకాళ్ళ పైకి పాయింటుని మలుచుకొని బురదలో పరుగులు, మా ఇంటి వెనకాల గుట్ట పై రాళ్ల తో ఆటలు, ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్లపై బెల్ పూరి, పావ్ బాజీ, కంకులు, పిచు మిటాయి, టపాసులు, కేకు తో న్యూ ఇయర్ సంబరాలు, ఒకటేంటి ఎన్నో ఎన్నెన్నో...

ఎయిడ్స్ అవగాహనా సదస్సు కై ఓ స్వచ్చంద సంస్థ నిర్వహించిన కార్యక్రమం లో బాగంగా కొందరు నృత్యకారులు తమ నృత్య ప్రదర్శన ఇచ్చారు. దానికి అరుణ్ తో కలిసి నేను వెళ్ళడం జరిగింది. ప్రదర్శన తర్వాత డాన్సు కంపోస్ చేసిన డాన్సు మాస్టర్ నాలుగు పదులు నిండిన ఓ మాతృ మూర్తి లలిత దేవి గారిని కలిసి అభినందించాము. ఆ పరిచయం తర్వాత వివిధ కార్యక్రమాల్లో తరచు కలవడం తన దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటున్న శ్రావ్య తో పరిచయం చాల త్వరగా జరిగింది.

పరిచయమైనా కొద్ది రోజులకి అరుణ్ శ్రావ్య చాల దగ్గరయ్యారు. అన్నయ అన్నయ అంటూ ఆప్యాయంగా పలకరించేది ఎప్పుడైనా లలిత దేవి గారింటికెళ్తే  తప్పక కనిపిస్తుండేది. ఒక రోజు అరుణ్ నాతో శ్రావ్యని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. విషయం చెప్పడానికి ధైర్యం చాలట్లేదని చెప్పాడు. నేను వీడు చెప్పిందే ఆలస్యంగా వెంటనే శ్రావ్య తో విషయం చెప్పను తను చాల కూల్ గ ఇది జరగని పని అన్నయ అని చెప్పింది. ఎంతైనా టైం పడుతుంది కదా అని అనుకోని పర్లేదు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పాను.

అరుణ్ కి వ్యవసాయ శాకలో చిన్న ఉద్యోగం దొరికింది. అదే రోజు ధైర్యం తెచ్చుకొని తన ప్రేమ విషయాన్నీ చెప్పాడు శ్రావ్యతో.
తను అవుననలేదు కాదనలేదు గంట సేపు మౌనం తర్వాత తల కొంచెం ఎత్తి శ్రావ్య తన జీవితంలో ప్రతి నిర్ణయం లలిత దేవి గారికి తెలియకుండా తీసుకోలేను. నువ్వోక్కసారి తనకి ఈ విషయం చెప్పు అని చెప్పి గుడి గంటలు మోగుతుండగా సికింద్రాబాద్ గణపతి టెంపుల్ లో నుండి ఓని సరి చేసుకుంటూ వెళ్లి పోయింది.
రణ గోణా ధ్వనులతో ఎవరికీ ఎవరు కానట్టుగ పరుగు లాంటి నడకలతో మమ్మల్ని డీకొంటున్న జనాలను చీల్చుకుంటూ నడుస్తూ విషయం నాతో చెప్పాడు.  నాకు అప్పుడు అర్ధం కాలేదు ఒక గురువికి, శిష్యురాలికి, ఈవిడకి, ఆవిడకి గల సంబంధం ఏంటో..  మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు. లలిత దేవి గారే తన బాగోగులు చూసుకుంటుందని తల్లి తండ్రి లేని శ్రావ్యకి అండగా ఉంది. ఆ క్షణం ఒక్కసారిగా నా కంటికి లలిత దేవి గారు నిజమైన మాత్రుముర్తి లాగ కనిపించారు.

మంచి సమయం చూసుకొని నేను అరుణ్ లలిత దేవి గారిని కలిసాము. కొంతసేపటి తర్వాత అరుణ్ చెప్పడం మొదలు పెట్టాడు. నేను శ్రావ్య పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను అని దానికి సమాధానం గా రఘు నేను అరుణ్ తో పర్సనల్ గ మాట్లాడాలి అని చెప్పడం తో ఆరు బయట లాన్ లో మొలిచిన పచ్చ గడ్డిని చూస్తూ పైన వేలాడదీసిన పంజరం లో ని రెండు పిచ్చుకలని చూస్తూ ఆ పక్కనే ఉన్న డాన్సు క్లాసు రూము లో సాగరసంగమం సినిమాలోని బాలకనకమయ చేల సుధాకర అని వినిపిస్తున్న పాటని ప్రాక్టీసు చేస్తున్న చిన్నారులను చూస్తూ నిల్చుండి పోయాను..

ఒక గంట తర్వాత బయటికి వడి వడి గ వస్తున్న అరుణ్ చూసి కంగారు పడ్డాను.
ఏమైందిరా అని అడిగాను.
ఏమి చెప్పలేదు. కాసేపు మౌనంగా క్లాసు రూము బయట అరుగుపై కూర్చొని కాలి వేళ్ళతో గడ్డిని తెంపుతూ ఆలోచనలో బడ్డాడు. మెల్లిగా మాట్లాడడం మొదలు పెడుతూ. నేను ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్ననురా ఎవరు ఏమైనా అనుకోని తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న... అని అన్నాడు దానికి నేను లలిత దేవి గారు ఏమన్నారు. అని అడిగాను.
చాల సేపు మౌనంగ ఉండి తనకు కూడా ఇష్టమే అని చెప్పాడు.
నేను సంతోషించి మరి ఇంకేం శ్రావ్యతో ఈ విషయం చెప్పు అని అన్నాను.

క్లాసు రూము లో ఉన్న శ్రావ్య ని బయటికి రమ్మంటూ సైగ చేసి.
నేను లలిత దేవి గారి తో మాట్లాడను. అంటూ శ్రావ్య చేతిని తన చేతి లోకి తీసుకొని మెల్లిగా లలిత దేవి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు వారి వెంటే నేను.

ఒక్క సారిగా మమ్మల్ని ఆశిర్వదించండి అంటూ లలిత దేవి గారి కాళ్ళపై  ఇద్దరు మోకరిల్లారు.
ఛ ఛ ఇదేంటయ్య లేవండర అంటూ వారిద్దరిని అక్కున చేర్చుకుంది. ఆ రోజు లలిత దేవి గారి కళ్ళల్లో ఆనందం తో కూడిన అశ్రువులను నేను చూడకుండా తన కళ్ళజోడు ఆపలేకపోయింది.

నేను ఒప్పుకుంటే సరిపోదు మీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి ముందు ఆ పనిలో ఉండండి అని చెప్పింది. అంతే కాకా పెళ్లి శ్రావ్య నర్సింగ్ కోర్సు పూర్తవగానే చేద్దాం అంది.
ఇక వీరి ఆనందాలకి అవధుల్లేవు.

ఒక విధంగా అరుణ్ నాకన్నా పెద్దవాడైన ఎప్పుడు మేము మామ మామ అంటూ పిలుచుకునే వాళ్ళం.
ఆ రోజు తర్వాత మళ్లీ నాకు చాల రోజులకు కలిసాడు.
ఉద్యోగం బానే ఉంది అన్నాడు. మెల్లిగా తన స్థావరాన్ని హైదరాబాద్ కు మార్చుకున్నాడు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను ఇక అరుణ్ శ్రావ్య తరుచు కలుసుకోవడాలు.
ఫ్రెండ్స్ అందరం కలిసి పిక్నిక్ లు ప్లాన్ చేయడం. పోలియో చుక్కల కార్యక్రమాలకి శ్రావ్యతో పాటు అందరం వెళ్ళడం. హాస్పిటల్స్ కి, రక్త దాన శిబిరాలకి, ప్రతిదానికి అందరం కట్ట గట్టుకొని వెళ్ళేవాళ్ళం.

డాన్సు ప్రోగ్రాం ఇస్తున్నది తెలిస్తే చాలు అందరం కలిసి మరి వెళ్ళేవాళ్ళం.

కొన్ని రోజులు కలిసాక అరుణ్ తన తల్లి ని ఒప్పించి అరుణ్ ఫ్రండ్స్ శ్రావ్య ఫ్రెండ్స్ లలిత దేవి గారు వారి భర్త నారాయణ మూర్తి మరియు మరికొంత మంది సమక్షం లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు లేని వాళ్ళలాగా ఇలా పెళ్ళిచేసుకోవడం తనకు ఇబ్బంది కలిగించినదేమో తన కొడుకు బాధపడుతాడని పక్కకొచ్చి కొంగుతో కళ్ళు తుడుచుకుంది అరుణ్ తల్లి.

నేను ఊహించలేదు తన పెళ్లి ఇంత త్వరగా జరుగుతుందని. ఆ మరుసటి రోజు నేను లలిత దేవి గారు, నారాయణ మూర్తి గారు, ఇంకా కొంత మంది మిత్రులతో తిరుపతికి ప్రయాణమై అక్కడ దండలు మార్చుకొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

అందరికి చాల సంతోషమేసింది చూడ చక్కని జంట అంటూ లలిత దేవిగారు మెచ్చుకున్నారు.
పెళ్ళైన కొద్ది రోజులకి శ్రావ్య కి ఓ ప్రబుత్వ ఆసుపత్రి లో హెడ్ నర్స్ గ జాబు వచ్చిందని అది కర్ణాటక లో హున్సూర్ కి దగ్గర ఓక గ్రామం లో అక్కడే తెలిసిన వారి అనాధ ఆశ్రమం ఉండడం తను జాబు చేస్తాననడం తో అరుణ్ శ్రావ్య ఇద్దరు అక్కడికి వెళ్ళడం జరిగింది.

వెళ్ళిన కొద్ధిరోజులకి అరుణ్ శుభా వార్త చెప్పాడు తను తండ్రి కబోతున్నట్టు. శ్రావ్య కూడా మాట్లాడి అన్నయ నువ్వు మామయ్య అవుతున్నావ్ అంటూ ఎంతో సంతోషం తో తన మాటల్లోనే తన ఆనందం చూడగలిగాను.

మరో పది రోజులు గడిచాక అరుణ్ కాల్ చేసి నేను హైదరాబాద్ కి వస్తున్నాను నిన్ను కలవాలి అని.
అన్నట్టుగానే వచ్చాడు.
తన గురించి వెయిట్ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నేను.
కాసేపటి తర్వాత చేరుకున్న అరుణ్ చూసి సంతోషంతో వెళ్లి
ఏరా మామ ఎంత కాలానికి అంటూ బుజం తడుతూ బయటికి నడిచాం.

అల నడుస్తూ బయటికొచ్చినా మేము ఎప్పుడు నడిచే ట్యాంక్ బండ్ వైపుకి వెళ్ళాం.
అంత బావుంది. కానీ వాడిలో మునిపటి చలాకి తనం కనపడలేదు.

మెల్లిగా నడుస్తున్నాం.
ఏమైంది రా అని అడిగాను.
ఒక బల్ల కుర్చీ పై కూర్చొని ఎదురుగా ఉన్న బుద్ధ విగ్రహాన్ని చూస్తూ.
చాల సేపటి మౌనం తర్వాత "మాకు ఎయిడ్స్ రా" అని పిడుగులాంటి వార్త చెప్పాడు.

ఒక్క క్షణం నాకు పిచ్చెక్కి పోయింది. కళ్ళముందు సుడులు తిరిగిన గతమంతా, ఆనందమంత ఎవరో లాక్కొని పోయి నల్లని చీకట్లు కమ్ముకున్నట్టుగ ఎదురుగా ఉన్న బుద్దుడీ లాగే మౌనమైంది నా మనసు.

ఈ విషయం శ్రావ్యకి తెలుసా అని అడిగాను. చెప్పాను అని బదులిచ్చాడు. లలిత దేవి గారికి తెలియదు తనని కలవడానికే వచ్చాను అని చెప్పాడు. ఏం జరిగిందో ఎలా జరిగిందో అని అర తీయడానికి అది సమయం కాదని తెలిసి ఏమి అడగలేదు. ఇద్దరం కలిసి లలిత దేవి గారింటికి వెళ్ళాం. విషయం చెప్పడం తో ఒక్కసారిగా దుఖం కట్టలుతేచ్చుకొని బోరున విలపంచిడం మొదలు పెట్టడంతో అరుణ్ కూడా ఆపుకోలేక పోయాడు.  ఎలా ఓదార్చాలో నాకు తెలియలేదు.

మరుసటి రోజు ప్రయాణమయ్యాడు. తనతో పాటే లలిత దేవి గారు కూడా.

లలిత దేవి గారు తిరిగొచ్చిన తర్వాత ఒకో రోజు వీలు చూసుకొని వెళ్ళాను. కళ్ళద్దాలు సరిచేసుకుంటూ కుర్చోమంటూ చైర్ చూపించింది.  ఏం జరిగిందండి అని అడిగాను.
తను బాధతో చెప్పడం మొదలు పెట్టింది.

వ్యబిచారాన్ని వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్న ఓ మహిళ కూతురే ఈ శ్రావ్య. తన తో పాటే వేశ్యా వృత్తి లో కొనగించెందుకు ప్రయత్నించింది. తనని ఒక చోటుకి పంపిస్తుండగా పోలీసు లు పట్టుకొని నా మిత్రురాలు నడిపిస్తున్న స్వచ్చంద అనాధ ఆశ్రమానికి తీసుకొచ్చారు. అక్కడి నుండి తనని నేను తీసుకొచ్చి నేనే పెంచుకుంటున్న.
అరుణ్ వచ్చి అడిగినప్పుడు ఇదంతా తనకి చెప్పాను. అన్ని తెలుసుకొని కూడా తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు.

నిజమే అన్ని తెలిసి కూడా పెళ్లి కి సిద్ధమైన మిత్రుడు నాకు మిత్రుడైనందుకు నాకు గర్వంగా ఉంది. 
నాకు నోట మాట రాలేదు, అరుణ్ కి కాల్ చేశాను పుట్టబోయే పాపకి ఎలాంటి హాని జరక్కుండా చూసుకోమంటూ సలహా ఇచ్చాను.
డాక్టర్స్ మరియు కొంత మంది పెద్దవారు చెప్పిన సూచనలు పాటిస్తూ కొద్ది కొద్దిగా మానసికంగ బలాన్ని పుంజుకుంటున్న ఆ జంటను పది కాలాల పాటు చల్లగా చూడామణి భగవంతున్ని కోరుతున్నాను. ఎంత అవగాహనా సదస్సులు పెట్టి ఎయిడ్స్ పై అవగాహనా ఇచ్చిన వీరికే ఎయిడ్స్ ఉందన్న నిజం బాధ పెట్టకుంట ఉంటుందా..

నిజమే నా దోస్తు CM  కాలేదు కానీ నాకు మాత్రం అంత కన్నా ఎక్కువే.
ఏ కష్టం లేకుండా హాయిగా గడుపుతూ ఐదు నెల్ల క్రితం చక్కని చుక్క కి జన్మనిచ్చింది శ్రావ్య.. పాపా పేరు హారిక అని పెట్టుకున్నారు.

లలిత దేవి గారిని కలవడానికి ఆగష్టు లో వస్తున్నారని చెప్పారు.
ప్రపంచాన్ని మరిచి తాము నిర్మించుకున్న సౌధంలో అనుక్షణం ఆనందంగా గడుపుతూ అరుణ్ శ్రావ్య .
నా పెళ్లి కి రాలేక పోయిన ఈ సారి అందరం కలవబోతున్నాం అనే సంతోషం లో నేను..



(మిత్రులారా క్షమించండి లలిత దేవి, శ్రావ్య గార్ల అసలు పేర్లని మార్చాను)

Wednesday, June 22, 2011 at 5:25pm

పిల్లికి రాజబోగం

ఫోటోషూట్  కోసం మిత్రుడు  ఒకరింటికి  తీసుకెళ్ళాడు.
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంది ఆ ఇల్లు నేను చూసిన సంపన్నుల్లో తను ఒకరు. కళా హృదయులు చెట్లు మొక్కలను అభిమానించే ప్రకృతి ప్రేమికుడు ఆ  ప్రేమ తోనే అనగా అదే తన వ్యాపారం వ్యాపకం అని తెలిసింది ప్రపంచం లో ఉన్న వింత వింత మొక్కలని వ్రుక్షలని పెంచి పోషించి వాటిని అమ్మడం. ఒక్కో మొక్క సుమారుగా పాతిక వేలనుండి రెండు లక్షల వరకు కరిదు. నమ్మలేక పోయిన అక్షరాల నిజం ఇలాంటి మొక్కలని పెంచి పోషించడానికి పనివాళ్ళతో సేల్స్ సిబ్బంది తో కూడిన ఒక పెద్ద ఫ్యాక్టరీ నే నడుపుతుండడం ఆశ్చర్యమేసింది.

నాలుగు పదులు దాటని ఆ వ్యక్తి తో ఎక్కువ సేపు మాట్లాడలేక పోయిన వారి ఇంటి ఆవరణలో ఉన్న రక రకాల మొక్కలని నా కెమెరా లో బంధించడం లో నిమగ్నమయ్య నాతో పాటు నా ఫ్రెండ్ మరియు పాతిక లోపు వయసు గల ఓ కేరళ అమ్మాయి ఆ  కంపెనీ మార్కెటింగ్ ad director ముగ్గురం కలసి వారి ఇంటి ఆవరణలో మరియు బాల్కనీ లో అందంగా పేర్చిన వింత వింత మొక్కలని కబుర్లు చెప్తూ తీసాను.

అదే ఇంట్లో ఓ పిల్లి ని చూసాను చూడడానికి అందంగా నిద్ర మబ్బు కళ్ళతో సుతి మెత్తని బూరు తో ముద్దుగ ఉంది. పక్కనే ఉన్న కేరళ అమ్మాయి ఇంగ్లాండ్ నుండి తెచ్చిన  ఆ  పిల్లి కరిదు చెప్పగానే ఒక్క సరిగా నా బుర్ర తిరిగిపోయింది అక్షరాల లక్ష రూపాయలు. ఇష్టం అనేది ఉండాలి కానీ మరి ఇంతలనా  అనుకున్న. దానికి సుతి మెత్తని పరుపు మెడికల్ చెకప్ తనని చూసుకోవడాని ఒక వ్యక్తి అబ్బో పెద్ద రాజ బోగమే అనుబవిస్తున్నది ఆ  పిల్లి.

అతి  మెత్తని  తన  పరుపు  చూడగానే   మతి  పోయింది.

నా చిన్నప్పుడు మా బాపు (నాన్న గారు) బియ్యం నిలువ చేసే కాలి గోనే సంచులని పట్టుకొచ్చేవాడు వాటిలో కొద్దిగా నున్నగా ఉన్న సంచిని నాకోసం అని  పక్కనపెట్టుకునే  వాడిని మా పెంకుటింట్లో రెండు గదులు ముందు గది లో బండలు నా  ఐదో  తరగతి లో వేసినట్టు గుర్తు రెండో గదిలో ఉన్న నేలని మాత్రం అమ్మ పేడ ఎర్రమన్ను తో కలిపి  అలుకు పెట్టి మూలల్లో (బోర్డర్) గోడ అంచులలో ముగ్గులు పెట్టి నున్నగా చేసి ఎప్పుడు శుబ్రంగా ఉంచేది. బయట కాలి ప్రదేశం ఉండేది చాల కలం వరకు నాతో పాటే పెరిగిన బావి పక్కన వేపచెట్టు దానిని అల్లుకున్న పెద్ద చిక్కుడు కాయ చెట్టు కింద ఆ గోనే సంచి ని నేలపై పరిచి నా పుస్తకాల సంచి బుక్స్ డ్రాయింగు తో గడిపేవాణ్ణి వర్షం వచినప్పుడు మాత్రం గోనే సంచిని రెండో గది లో పరుచుకొని పని కానిచ్చేవాడిని. ఒక రోజు ఏదో బ్యాంకు ఆఫీసు కాలి చేస్తున్నారట అందులో ఉన్న చిరిగినా గోధుమ రంగు పెద్ద కిటికీ కర్టేను ఒకటి బాపు తీసుకొచ్చాడు.  అది శుబ్రంగా పిండి చిరిగినా చోటున కుట్టింది  అమ్మ  ఆ కర్టేను చాల  మెత్తగా ఉండడం తో అమ్మ పడుకునే అప్పుడు పెద్ద నార చాపలు రెండు పక్కపక్కన వేసి బొంత చేద్దరు దానిపై ఈ మెత్తని కర్టేను తో మాకోసం పాన్పును సిద్ధం చేసిది అదే అతి గొప్ప పాన్పు నాకు.

ఇంట్లో కరెంటు లేదు రాత్రిపూట కిరోసిన్ దీపం వెలుగుతు ఉంటె దాన్ని చూస్తూ కాసేపు దీపం వెలుతురుని నోటితో ఊదుతూ వయ్యారంగా కదిలే ఆ చిన్ని దీపం మంటను  చూస్తూ నిధ్రపోయేవాన్ని. ఎండకాలమైతే అమ్మ పల్చని తన చీర కొంగుని మొహం పైన వేసి ఇంటివెనకాల గది బయటి తలుపు కొంచెం తెరిచి నా చాతి పై తన చేయి పెట్టి నెమ్మదిగ జో కొడుతూ నిధ్రపుచ్చేది ఎప్పుడో ఒకసారి వీచే గాలి కి మొహం పై ఉన్న అమ్మ కొంగు కదులుతూ చెక్కిలిగింతలు పెడుతుండేది ఎంతో ఆహ్లాదాన్ని మైకం కమ్ముతున్నట్టుగా తోచేది ఆ  హాయితో మెల్లిగా నిద్రలోకి జారుకునే వాణ్ణి.
మరి ఈ పిల్లికి సిద్ధం చేసిన పరుపుతో తెలిసిపోతుంది మనం ఎంత వెర్రిగా డబ్బు వృధా చేస్తున్నామో అని..

మొన్నీమధ్య  ఫేసు బుక్  మిత్రుడు నేను కలిసి వారి బాబు ని  స్కూల్ లో వదిలి కార్ లో తీరిగోస్తున్నప్పుడు స్కూల్ admission, bus fare  ఇతరత్రా లెక్కలు చెప్తూ ఎనబై వేలు కర్చైందని.  నవ్వొస్తుంది  ఇంత ఇంత డబ్బులు గుంజుతున్న కార్పోరేట్ స్కూల్స్ ని  చూసి.
ఎందుకంత అని అడుగితే తప్పదు మరి అందరితో పాటే మనం అని. నిజమే  ఓ మిత్రురాలు (ప్రవీణ గారు) చెప్పినట్టు.

ప్రవాహానికి ఎదురీద లేక,
ఎదురీత తెలిసినా,
ఎదురీదే సాహసం లేక,
ఎదురీదితే వెనుక పడిపోతామేమోనన్న భయంతో,
ప్రవాహంలో కొట్టుకుపోవడానికి పరుగులు..

నా విషయానికొస్తే  1989 లో స్కూల్ లో జాయిన్ చేసారు అంతకు ముందే మా అన్నయ అక్కయ కూడా అదే స్కూల్ కి వెళ్తున్నారు వారితో పాటే పంపించారు. అప్పుడు స్కూల్ ఫీజు 25 రూపాయలు నెలకి ఆ తర్వాత కాలాల్లో 25 కాస్త  50, 75 నా పదో తరగతి పుర్తేయ్యే అంటే 2000 ల సంవత్సరానికి నా school ఫీజు 150 రూపాయలు ఎన్ని  కర్చులు లెక్క కట్టిన స్కూల్ ఫీజు, బట్టలు బుక్స్ అన్ని కలిపి పదేండ్లల్లో16 నుండి 18 వేల తో గడిచిపోయింది నా స్కూల్ విద్య.

కానీ ఆ టైం లో స్కూల్ ఫీసులు కట్టాలంటే చాల కష్టాలు పడేది మా అమ్మ ఎందుకంటే మా బాపు కి మా కన్నా ఎక్కువ మద్యం బాటిల్ పై ప్రేమ ఎక్కువ పొద్దున తొమ్మిది గంటలకి వెళ్లి ఎప్పుడో రాత్రి పన్నెండు గంటలకి వచ్చేవాడు.  అప్పుడు మొదలై  ఏ ఒంటి రెండు గంటలకు పుర్తయేది తను గొడవ పెట్టుకోవడం. చాల రాత్రులు నా జీవితంలో రాత్రి అనేది ఎందుకోస్తుందా, ఎందుకు ఉందో అని భయపడేవాన్ని అల అని నన్ను ఏమైనా అంటాడ అని కాదు తను తన జీవితాన్ని చాల చక్కగా తీర్చిదిదుకున్నాడు బీదరికం అనే పేరుతో.  తను నిర్మించుకున్న బీదరికం వలలో అమ్మ అన్నయ అక్కయ నేను.  ఒక్కో సరైతే ఇంట్లో ఉన్న వస్తువులనుండి ఇంటి మీదున్న పెంకుల వరకు అన్ని పగల గొట్టే వాడు ఇంటి తలపులని బావిలోకి విసిరి పడేసేవాడు మా బాపమ్మ (నాయనమ్మ) తను మాత్రం ఏం చేయగలుగుతుంది కండ్ల ముందే కొడుకు ఎలా పతనమవుతున్నడో చూస్తూ బాధపడడం తప్ప. బహుశ  మా నన్నే నాకు ఆదర్శం కావచ్చు అందుకే తనకు విరుద్ధంగా జీవితంలో సిగరెట్టూ మద్యం నా దరికి చేరనివ్వకుడధానుకున్న. చేసే లేబర్ పనికి వచ్చిన కొద్ది మొత్తం డబ్బులో తాగుడు కు పోను మిగిలిన డబ్బుతో ఎవరిపై ఆధారపడకుండా గుట్టుగా ఇల్లును గడుపుతూ వచెది మా అమ్మ.

ఆ టైం లో స్కూల్  లో  అందరి చేతుల్లో 50 పైసల నుండి మొదలు 2 రూపాయలు 5 రూపాయల వరకు రోజు కనిపించేవి దాన్నే పాకెట్ మనీ అంటారని తర్వాత తెలిసింది.  నా దగ్గర మాత్రం పదో తరగతి వరకు కూడా డబ్బు అనే అవసరం సొంత కర్చులు అనేవి తెలీనే తెలియవు. మా ఇంటివేనకల ఉండే రాజమౌళి  మామయ్య ఇచ్చే పోస్ట్ కార్డులతో, రంగు రంగుల స్కెచ్ పెన్నులు మిగిలిన పేపర్లతో బైండింగు చేసిన తెల్ల కాగితాల నోటుబూక్ లో బొమ్మలు గీయడం, లైబ్రరీ నుండి వారం వారం తీసుకొచ్చే పుస్తకాలతో గడిచిపోయిన కాలం లో పాకెట్ లో ఏ రోజు డబ్బు కోసం చేయి పెట్టింది లేదు. నిజమే ఇప్పుడు ఆలోచిస్తుంటే 20 వేలు పెద్ద కష్టం కాదు అని అనిపించొచ్చు అల అని  ఇప్పుడు ఉన్నత స్థితులో ఉన్నామని కాదు పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. కానీ వాడ వాడ మొత్తం వినిపించేలా లొల్లి పెట్టె తన గొంతుకు తనే కళ్ళెం వేసుకున్నాడు. తన తాగుడు తో గొంతు కాన్సెర్ తెచ్చుకున్నాడు. అప్పుడు తన ఆపరేషన్ కి నేను అన్నయ కలిపి 50 వేలు ఖర్చు పెట్టాము ఎంత తాగుబోతైన కన్నా తండ్రి కదా.
కనీసం తనను చూసైన తనల తయరవకుడదని అమ్మ ఎప్పుడు చెప్తుండేది. ఇప్పటికి తన వ్యవహారం లో మార్పు లేక పోయిన మా ఎదుగుదలను చూస్తూ గర్వపడుతూ తన పని తాను చేసుకుంటున్నాడు.


అన్నయకు  అక్కయకు  నాకు అందరికి పెళ్లిల్లు అయిపోయాయి. పండగలకి అందరం కలుసుకోవడాలు. ఇప్పుడు బాపు కి మా అన్నయ కొడుకు హేమంత్ తో ఆడుకోవడం అమ్మ నెలలు నిండుతున్న అక్కయను చూసుకోవడం తో చాల బిజీ అయిపోయారు.

ఇప్పటికి తన లేబర్ పనిని మానుకోలేదు బాపు, మా సంతోషాన్ని కోరుతూ కనిపించని భగవంతుడికి వేల వేల దండాలు పెడుతూ అమ్మ.  మొన్న ఈ మధ్య కట్టించిన రేకుల ఇంట్లో కాలం గడుపుతున్నారు. వారికీ ఈ హైదరాబాద్ వాతావరణం పడదు. ఎందుకో మా నాన్న తను పుట్టి పెరిగిన ఊరిని వ్యక్తుల్ని వదిలి రాలేనంటాడు తనతో పాటే అమ్మ నిజంగా వారె అన్యోన్న దంపతులు అని నాకనిపిస్తుంటుంది. మా బాపు చేసిన రాక్షసత్వాన్ని ఎవరు భరించలేరేమో అందుకే కాబోలు ఆడవారికి సహనం ఓర్పు ఎక్కువని అది మా అమ్మను చూసినపుడు మరి అనిపిస్తుంటుంది. వెళ్తే ఇక నేను కూడా తిరిగి హనంకొండ కే వెళ్తాను కావచ్చు. నా అనుకునే వారందరు కూడా కోరేది ఇదే నేనుంటే మా ఇంట్లో ఆ సందడే వేరు.


ఆత్మీయ  అనురాగాలు ఆప్యాయతలను మరిచి ఏదో చేసెయ్యాలి అని అందరికి దూరంగా గడిపే నా లాంటి మిత్రులందరికీ తెలుసు వాటి అర్ధం ఏంటో..

ఎంత బిధరకాన్ని అనుబవించిన కాలంతో పాటు జీవన పరిస్థితులు మారుతాయి. మన సమాజం లో డబ్బు అనేది సమస్య కాదు నేను చుసినటువంటి సంపన్నులు మన హైదరాబాద్ లో కోకొల్లలు. ఆలోచిస్తే ఎవరికీ ఏ లోటు లేదు లోటు కేవలం మన మనస్సులో ఆలోచన విధానం లో ఉంది.

నేను మారితే అన్ని మారినట్టే..

లక్షలు పోసి పెంచుకుంటున్న పిల్లి కున్న సుఖం అనాధ ఆశ్రమం లో గడుపుతున్న ఓ అనాధ చెల్లి కి లేకుండా పోయింది అని బాధ పడడం తప్ప చేసేది  ఏమి లేదనుకుంటూ దాని తలపై నిమిరి దాన్ని నా కెమరా లో బంధించి వెనుదిరిగాను.

Tuesday, June 21, 2011 at 3:24pm

పోస్ట్ మాన్

ఈ మధ్య కాలం లో చాల రోజుల తర్వాత ఫేసుబుక్ మిత్రుని (మహేష్ కుమార్ కత్తి) పుణ్యమా అని రెండు అందమైన లఘు చిత్రాలు చూడగలిగాను. ఒకటి అద్వైతం(తెలుగు) రెండు పోస్ట్ మాన్ (తమిళం). ఈ రెండు నన్ను చాల అమితంగా ఆకట్టుకున్నాయి.

పోస్ట్ మాన్ చిత్రం విషయానికొస్తే ఓ అందమైన గ్రామం లో ఆత్మీయ సందేశాలను చేరే వేసే ఓ ఇంటివ్యక్తిగా పరిగణించే పోస్ట్ మాన్ కథ. ఇంటింటికి వెళ్లి వారి ఉత్తరాలను చేర  వేస్తూ. వారి వారి జీవితాల్లో సుఖ దుఖాలను  పంచుకుంటూ కాలం వేల్లదిస్తున్న తరుణంలో సమాచార సాంకేతిక విప్లవం తన గ్రామాన్ని సాశించింది ఫోన్ రూపం లో. ఇప్పుడు గ్రామా పెద్ద కాడి నుండి. కిరణం కొట్టు వరకు అందరు ఫోనే. దుబాయి లో ఉన్న భర్తతో క్షణం లో వయ్యారపు చిలిపి కబుర్లను పక్క పక్కనే కుర్చుని సాగిస్తున్న అనుభవాన్ని తీసుకొచ్చిన ఫోను ప్రభావం తో ఇక  ఉత్తరం  అనే కాగితం ముక్క చిత్తు కాగితాలతో నేస్తం కట్టింది.. గ్రామస్తులే తన జీవితం అనుకున్న పోస్ట్ మెన్ ఇక ఎవరికీ అక్కరలేకుండా పోయాడు.

ఈ చిత్రం చూస్తున్న కొద్ది. నన్ను నా చిన్ననాటి జ్ఞాపకాల సంద్రం లోకి నెట్టింది.

నేను పుట్టి పెరిగిన కాపువాడ(హనుమకొండ) లో అట్లేస్ సైకిల్ (పెద్ద సైకిల్ అని పిలిచేవాళ్ళము) మీద బెల్లు మోగిస్తూ కాకి బట్టలతో హేండిల్ పై ఉన్న కరెల్ కు నలబై పై చిలుకు ఉత్తరాలని  బిగించుకొని "పోస్ట్" అంటూ శబ్దం చేస్తూ వెళ్తుండేవాడు చిన్న నాటి నా జ్ఞాపకాల్లో ఈ మా పోస్ట్ మెన్ మమయ్యది చాల గొప్ప పాత్రా వహించాడు.

మా ఇంటికి ఆనుకొని ఇద్దరు వ్యక్తులు పట్టే చిన్న సందు ఉండేది. ఆ సందు చివరి ఇంట్లో చింతకింది రాజమ్మ వాళ్ళు కొత్తగా కట్టుకున్న బంగాలలో కాలిగా ఉన్న గదిలో మా అమ్మ చెల్లెలు శ్రీకల  చిన్నమ్మ - భర్త రాజన్న బాబాయి వాళ్ళ దోస్తు "రాజమౌళి LLB " హనమకొండ లో ఉండి చదువుకోవాలనే ఉద్దేశం ప్రకారం ఆ గది ని కిరాయికి తీసుకున్నారు. మా అమ్మ పెద్ద చదువులు చదువుతున్నా వాళ్ళతో కలిసి చదువుకుంటే అన్ని సంగతులు తెలుస్తుయి అని చెప్పి స్కూల్ నుంచి రాగానే నన్ను మా అన్నయ (వేణు) ఇద్దరని ఆ గదికి తోలేది.

నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే అప్పటి వరకు నన్ను ఎవరితో అడుకోనివ్వకుండా బయటికి అడుగుపెట్టనివ్వకుండా ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటనో అని బయపడుతుండేది అలాంటిది తను ఇలా పంపివ్వడం. నేను అనుకునే వాడిని అందరికి తగలని దెబ్బలు నాకు మాత్రమే తగులుతాయ అని. ఒకసారి అమ్మ చెప్పింది నేను పుట్టాక నాలుగు సంవత్సరాలవరకు ఏడుస్తున్నప్పుడు ఊపిరి పట్టేవాడినని స్పృహ కోల్పోయి పది నిమిషాలవరకు ఉలుకు పలుకు లేకుండా ఉండేవాడినని. అల నాకు చాల సార్లు జరగడం తో నన్ను క్షణం కూడా తన ఓడిలోనుండి వేరుచేయకుండా ఏడుపు అనే క్షణాన్ని నా ధరి చేరనివ్వకుండా చాల జాగ్రతలు తీసుకునేదని. డాక్టర్ లు కూడా బయపడేవారట నాకు ఇంజక్షన్ ఇవ్వాలంటే. ఈ విషయం తెలుసుకున్నప్పటి నుండి నాకై నేను తన మనసుని ఇబ్బంది పెట్టె పనులు చేయకూడదని తను చెప్పినట్టే నడుచుకునే వాణ్ణి. మా ఇంటి ముందు పొడుగ్గా, పెద్ద వారైతే నలుగురు చిన్నవారైతే ఆరుగురు కుచునేందుకు వీలుగా గద్దె (అరుగు) ఉండేది. పక్కింటి శీను, మహేశు, శారద, ఆ ఇంటిపక్క సంబరాజు, ఎదురింట్లో బేబీ మా ఇంటి కుడి సందు మీనయ్య మనవళ్ళు కిరణ్, కిషోర్, రాజు. అందరు మా ఇంటి ముందు రోడ్డు మీదే రక రకాల ఆటలడుతుంటే ఆ గద్దె మీద కూర్చొని చూస్తుండే వాణ్ణి. ఆ గద్దె మిధ కూర్చోవడానికి పర్మిషన్ కూడా నా  రెండో తరగతి లో వచ్చింది. అప్పటి వరకు ఏమి తెలియని నాకు అమ్మ ఆర్డర్ శిరసావహించి గదికి వేల్లనరంభించాను.

రాజమౌళి మామయ్య గదిలో ఇంకా తన ఫ్రండ్స్ పేర్లు తెలియదు కానీ ఇద్దరుండే వారు.  ఆ గది లో ఉన్న వారి సహచర్యం నాకో కొత్త విషయాలను నేర్పించే ఓ మంచి పుస్తకం ల తోచింది. ఆ గది కేల్లడం Home  Work పూర్తి చేసుకోవడం. ఆ పక్కనే వారు గీసిన బొమ్మల్ని చూడడం. పెద్ద పెద్ద పుస్తకాలని తిరగేయడం. ఇది నా పని. గది లో ఉన్న వారికి ఒక్కొక్కరి చొప్పున వారానికి నాలుగైదేసి ఉత్తరాలని పోస్ట్ మాన్ మామయ్య తీసుకొచ్చేవాడు.

నా కోసమని చందమామ కథల పేరుతో ఉన్న పుస్తకాన్ని చదువుకోమని ఇచ్చేవాడు. అందులో ఉన్న కలం స్నేహం శిర్షిక కంటే పడే వరకు కూడా నాకీ ఉత్తరాల గొడవ తెలిసింది కాదు. రాజమౌళి మామయ్య ప్రోత్సాహంతో, వీక్లీ, మంత్లి, బుక్స్ లో నా వయసు ఉన్న వారందరికీ కలం స్నేహం పేరుతో రాసేవాన్ని. చారణ పోస్టు కార్డులు నాకోసం ఇచ్చేవాడు. బహుశ ప్రపంచం తో ఎలా సంబాశించాలో నేర్పించింది తనే అనుకుంట. అల మొదలయ్యింది పోస్ట్ మెన్ మామయ్యతో నా అనుబంధం.

ఎక్కడో తెలియని వ్యక్తులతో కొత్తగా స్నేహం కుదిరింది. మధురానుభూతుల అనుభవాలు మంచి కబుర్లు మరెన్నో విషయాలను క్యారేల్కు బిగించుకొని నాకోసం రెండ్రోజులకోకసరైన స్కూల్ కి గాని ఇంటికి గాని నాయన రఘు అంటూ అందించేవాడు. ఒక్కోసారైతే ఏ పెద్ద సైకిల్ బెల్లు మోగిన పోస్ట్ మెన్ మామయ్య కావచ్చు అని పరుగెత్తుకొచ్చి బయటకి తొంగి చూసేవాన్ని..

ఈ మా పోస్ట్ మెన్ మామయ్య రాజమండ్రి శీను, పార్వతీపురం రమేషు, అనంతగిరిలోని రాము, రాజశేకర్, వంశీ, సుభాషు, కరీంనగర్ మధు, శ్యామల, ఖమ్మం సుశీల, హైదరాబాదు కిరణ్, రాంబాబు, సురేష్, పీటర్ (ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు అవ్వుద్ది ) వారందరి సాన్నిహిత్యం కోసం నన్ను తనపై ఆధారపడేలాగా  చేసుకున్నాడు..

చాల సంవత్సరాలు గడిచాక తీపిగుర్తుల మధురజ్ఞాపకాల సంపదని పాత పుస్తకాల సంచిలో బద్రంగా మా ఇంట్లో ముందు గది సేల్ఫుల్లో చివరి దాంట్లో దక్కున్నాయి..
ఉత్తరాలు రాయడం తగ్గించి బొమ్మలు గీయడం లో మనసు లగ్నం చేశాను. ఇంకా ఇంట్లో కరెంటు లేదు అందుకే చాల సమయం రాజమౌళి మామయ్య గదిలో గడిపేవాణ్ణి.
ఆ టైం లోనే పబ్లిక్ ఫోన్ మా స్కూల్ పక్కన వెలిసింది. అల వచ్చిందో లేదో ఉజిలిబేసు, జెండా కాడ, గుండం వాడలో, కట్ట దగ్గర, ఎక్కడ చూడు టెలిఫోన్ బూత్ లు వెలిసాయి. నలబై యాబై ఉత్తరాలతో నిండి ఉండే పోస్ట్ మెన్ మామయ్య సైకిల్ క్యారెల్ కాస్త పది పర్కతో కనిపించడం మొదలు పెట్టింది. రోజు నవ్వుతు చలాకి గ కనిపించే పోస్ట్ మెన్ మామయ్య ఎప్పుడో వారానికోసారి కనపడ్డం మొదలు పెట్టాడు.

యధ్రుచికం గానే నాదగ్గర కూడా ఫోన్ నెంబర్ ల చిన్న బుక్ ఒక్కటి నాతో పాటే ఉండసాగింది, రోజులు గడుస్తున్న కొద్ది వద్దనుకున్న ఇది నాకు అవసరం లేదు అని అనిపించినా వచ్చి వాలాయి సెల్లు ఫోను, మెయిల్ అక్కౌంట్లు, స్క్రాఫ్ బుక్స్ లు, ఫెసుబూక్ గ్రూప్ లు, ఫ్లిక్కర్ చిత్రాలు..

నా చిన్నప్పుడు కలం స్నేహం మిత్రులు ఒక యాభై ఉన్నారంటే ఎంతో గొప్ప ధైర్యం మరియు మంచి అనుభూతి కలిగించేది. మరి ఇప్పుడో అక్కౌంట్లో ఫ్రెండ్స్ లిస్టు లో ఎంత ఎక్కువ ఫ్రండ్స్ ఉంటె అంత పబ్లిసిటీ, హోదా అందరితో పెద్దగా సంబశించేది లేకపోయినా పేరుకు మాత్రం ఫ్రెండ్స్ లిస్టు లో ఫ్రెండ్స్ పెరుకుపోతునే ఉంటారు.
అబ్బ... నాలుగు వేల ఐదు వందలేన ఫ్రెండ్స్ లిస్టు కెపాసిటీ అని విసుక్కుంటూ మరో అక్కౌంట్లు ఓపెన్ చేసుకుంటున్న సహా మిత్రులూ.. చాలానే ఉన్నారు..

మనిషి మార్పుని కోరుతూ అడుగులేస్తున్న తరుణం లో పాతా విషయాన్నీ మరవడం సహజమైపోతుంది.
ఎంత సహజం అంటే ఈ మీడియా నెట్వర్క్ గ్రూప్ ల ధాటికి పోస్ట్ మేనా అంటే ఎవరు?

ఓ! లేట్ మి చెక్ ఇన్ వికీపీడియా అనే రోజులు వచ్చిన ఆశ్చర్యం లేదేమో..

***
Short movie link : http://youtu.be/VU3iiKQY_9M

on Friday, June 17, 2011 at 4:48pm

ఎంత బావుంటుందో కదా జీవితం లో కూడా రివైండ్ బటన్ ఉంటె...!

చివరి శివరాత్రి కి ఇంటికి(హన్మకొండ) కి వెళ్ళినప్పుడు చాల రోజులవుతుందని మెడలో కెమెరా తగిలించుకొని వేయిస్థంబాల దేవాలయానికి వెళ్ళాను.

చిన్నప్పుడు అంటే పదో తరగతి టైం లో ఒక రోల్ కెమరా ఉండేది ఇప్పటి లాగే ఎప్పుడు నా చేతిలో..

ఒకసారి మెదడులో చిన్న ఆలోచన పుట్టింది అంతే మరో నిమిషంలో దాన్ని విప్పి పక్కన పెట్టాను.
కానీ తర్వత  తెలియలేదు మళ్లీ ఎలా సరి చేయాలో.. ఆ తర్వత అన్నయ్య తో గొడవ తర్వత కెమెరా రిపైర్  అవడం చక చక జరిగిపోయాయి. అప్పటి జ్ఞాపకమే మళ్లీ మన వేయి స్థంభాలా దేవాలయం లో కళ్యాణ మండపానికి బదులు ఇసుకను చూస్తే గుర్తోచింది..
అప్పుడనిపించింది అమాయకమైన చిలిపి పనులు పిల్లలే కాదు పెద్దలు  కూడా చేస్తారని.

ఎంతో అద్వితీయమైన శీలా నైపుణ్యం కళ్ళ ముందే నెల మట్టం చేయడం లో శస్త్రవెత్తలు సఫిలిక్రుతులయ్యారు..
కానీ ఎం లాభం ? ఎంతో చరిత్ర కలిగిన చారిత్రాత్మకమైన కట్టడం ఇక స్కూల్ పుస్తకాలలో చరిత్రలాగా మిగిలింది..

చిన్నపుడు అప్పుడు నేను ఐదో తరగతి. వారం లో నాలుగు సాయంకాలాలు ఈ గుళ్ళోనే. ఎందుకంటే మా ఇంటికి, గుడికి మధ్య దారిలో స్కూల్ ఉండేది. గుడి వెనకాల వీధి కాపువాడ లో బాధ్రకాలి చెరువు కి దగ్గరలో ఉండేది. శనివారాలు స్కూల్ ఒక పూటే, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతాన బెల్లు మోగేది.

త్వరగా ఇంటికొచ్చి అమ్మ కారం, అల్లం రసం, ఉప్పు, నునే తో అన్నం ముద్దలుగా కలిపి సాయంత్రం పప్పు చారు చేసుకుందాం అంటూ ఇంటి వెనకాల బావికి దగ్గరక అనుకోని ఉన్న వేపచెట్టు కింద ఊరిస్తూ తినిపించేది. నా కోసం ముధపప్పు తీసి పెట్టని ఆర్డర్లుఇచ్చేవాన్ని. అప్పట్లో చాల రోజులవరకు నాకు తెలిసి నేను మెచ్చిన భోజనం అదే. ఇది  1995  నాటి మాట. భయటి వారు మాత్రం మేమొక కడు భిధరికాన్ని అనుబవిస్తున్న కుటుంబం అని లెక్క కట్టేసారు. అప్పటికి ఇంట్లో కరెంటు లేదు కానీ విధి లో ప్రతి ఇంట్లో బ్లాకు & వైట్ టీవీ ల సందడి మొదలవుతున్న రోజులు.

నాకు మాత్రం ఏ లోటు లేదు నేను ధనవంతున్నే అనే ఫీలింగ్ మా అమ్మ నాపై చూపించే  గరబాన్నిచూస్తున్నపుడు అనిపించేది. తను చదువుకోలేదు కానీ మానవత్వ విలువలని ప్రేమ అనురాగాలని మంచి బుద్ధులని అన్నిటికి మించిన తెలివిని స్కూల్ కి వెళ్ళకుండానే ఎలా నేర్చుకుందో అని ఆశ్చర్యం వేసేది.

ఇంట్లో రెండు పెద్ద సెల్లులతో పని చేసే  రేడియో ఉండేది అది మరియు నా పుస్తకాల సంచిని బుజాన వేసుకొని సాబిర్ కొడుకు ఆరిఫ్ (ఇప్పటికి మేము ప్రాణ మిత్రులం), నేను పాత అంగి(షర్టు) మోకాళ్ళు కనిపించే నిక్కర్లతో ముప్పై రూపాయల పారగాన్ స్లిప్పర్లు వేసుకొని 2 గంటల ప్రాంతం లో గుడికి చేరుకునే వాళ్ళం. చెప్పులు కోనేటికి దగ్గర ఇసుకలో వదిలేసి లోపలి వెళ్ళేవాళ్ళం.

కళ్యాణ మండపం మధ్యలో బయట ఎంత ఎండగా ఉన్న లోపల మాత్రం చాల చల్లగ ఉండేది. సంగీతం నేర్పించే ఓ పెద్దాయన అతని శిష్యుడుతో ఎత్తు బండపై నీడ ఉన్న చోటు చూసుకొని సంగీతం నేర్పించేవాడు. చూడడానికి చాల గంబిరంగా ఉండే అతని రూపాన్ని చూసి తానెవరో తెలుసుకోవాలని ఎప్పుడు ప్రయత్నించలేదు. స్కూల్ home work పూర్తి చేసుకుందామని కళ్యాణ మండపం లో ఓ మూలా కూర్చొని అతి తక్కువ సౌండ్ లో రేడియో  లో ఆకాశవాణి బలవినోధిని కార్యక్రం వింటూ అప్పుడప్పుడు వీచే చల్లని గాలిని ఆస్వాదిస్తూ పూర్తి చేసేవాళ్ళం.

నాకు చాల బాగా గుర్తు అతిపెద్ద స్థంభం కింద కాగితం ఒక వైపునుండి ఇంకో వైపుకు తీసే వీలుగా ఉండే అతి సన్నని సందును ఆ సంధుని వదులుతూ చెక్కిన పూలగుత్తులని చూస్తూ, చూసిన ప్రతిసారి వింతగా తోచేది  మా నాయనమ్మ పాతకాలంలో రాత్రిపూట రాళ్ళూ మెత్తగా అవుతాయి అప్పుడు వాటిని చెక్కుతారు తెల్లరిన తర్వాత అవి గట్టిపడుతాయి అని ఇంటి ఎదురుగ సిమెంట్ తో కడుతున్న హబీబు వాళ్ళ ఇల్లు చూపిస్తూ చెప్పేది. అది నేను నమ్మేవాడిని.

ఎవరైనా గుడి గురించి అడిగితే మాత్రం నేను, అరీఫ్ ఒకరి మొహాలు ఒకరం చూసుకొనే వాళ్ళం. నాకు అనిపించేది గుడికి మనశ్శాంతి కోసం కానీ చరిత్ర గురించే ఎందుకొస్తార అని..

నిజంగా గుడిలో ఏముందో తెలియదుకాని తెలియని ఒక గమ్మత్తు మాత్రం కలిగేది. అక్కడ కంకులు అమ్మే అవ్వ చెట్టు మీదుండే పిచుకలకు మెరిగలు (వరి గింజలు) పెద్ద బండపై కూర్చొని విసిరేది దాదాపు పాతిక పిచుకలు గుమిగూడి పోటి పడి ఎతుబండపై వేసిన మేరిగల్ని గబా గబా తినేవి. కోయిల కూయడం మొదలు పెట్టగానే ఎతుస్తంబం అనుకోని రెండు సింహం గుర్తు శిల్పాలపై ఎక్కి వింటూ కోయిలను చూసేందుకు ప్రయత్నిచేవాళ్ళం.  సూర్యాస్తమయం లో స్థంభాలా వెనుకన దోభూచులాడే సూర్యున్ని అ సమయంలో తన చుట్టూ ఏర్పడి క్షణ క్షణానికి మారే రంగుల్ని చూస్తూ గడిపేవాళ్ళం అ క్షణాలు అధ్బుతం. చల్ల గల్లులు చెంపలని తగులుతుండగా చుట్టూ చీకట్లు ముసురుకొనే సమయానికి ఇంటి ముఖం పట్టేవాళ్ళం.
ఆ చిన్న నాటి జ్ఞాపకాలు ఓ చరిత్ర లాగా చరిత్ర తోటే చరిత్రలో కలిసిపోయాయి..
ఎంత బావుంటుందో కదా జీవితం లో కూడా రివైండ్ బటన్ ఉంటె...!

Thursday, June 16, 2011 at 11:06am


**
ఆ రోజు తీసిన ఫొటోస్ లింక్ : http://www.facebook.com/media/set/?set=a.192895697400453.47388.167218626634827