15, నవంబర్ 2011, మంగళవారం

పంద్రా ఆగస్టు - జెండా పండగ

ఇగో పంద్రా ఆగస్టు వస్తోంది.
ఈ క్లాసు మొత్తం చమ్కీలతో చమ్కాయించాలి.
మస్తుగా ఎంజాయ్ చేయాలి అని లియాకత్ అలీ చెప్పడంతో.
ఏడు, ఎనమిది, తొమ్మిది తరగతోల్లమంత తల ఐదు రుపాయలేసుకుంటే చౌరస్తా బుక్ స్టాల్ లో రంగు రంగు కయీతాలు మేరుపు చమ్కీల కవర్లు మస్తు వస్తాయి అని మా క్లాస్ రవి గాడు చెప్పడంతో అందరం ఊ కొట్టాం. మా స్కూల్ లో మా క్లాసు లో కొంచెం నాకు మంచి పేరే ఉంది. డెకరేషన్ పనులు ఇంకా ఆ రోజు ప్రోగ్రాములు గట్రా నాకు అప్పచేప్పటోల్లు. ఇక మా రవిగాడికి పెద్ద సైకిల్ ఉండేది.
స్కూల్ మొత్తం లో మా పిలగాడ్లంత ఆడి బుజలకాడికి ఉండేటోల్లం అందుకే పొడుగు రవిగాడు అని పిలిచేటోల్లం. అప్పటికి నాకు సైకిల్ తొక్కటం రాదూ అది వాడికొచ్చు అందుకే నాకు తోడుగా డెకరేషన్ సామాను తేవడానికి మా ప్రిన్సిపాల్ మాడం పంపించేది.
ఇగ మా క్లాసు లో కూడేసుకున్న పైసల్తో మేము చౌరస్తాలో రవి బుక్ స్టాల్ అనే షాపులో అన్ని పట్టుకోచ్చేటోల్లం.
మా స్కూల్ టీచర్ లు చెప్తూ ఉంటె  మా క్లాస్సులల్ల ఉండే ఆడోల్లంత పింకు రంగు కయీతలని చిన్న చిన్న గ కత్తిరించుకోని మల్లె పూల దండలాగ కాయితాల దండల్ని అల్లే వాళ్ళు అదంతా రెండు రోజులు కూచుంటే గాని అన్ని క్లాసు రూముల్లోకి సరి పడ దండలు తయారయేవి.
ఇక మేము పిలగండ్లమంత పెళ్ళిలకు అతికించే రంగు రంగు కాగితాలను కత్తిరించి క్లాస్లో అతికించే పనుల్లో ఉండేవోల్లం. ఇగ పోటిలుపడి ఎవలి క్లాస్సు వాళ్ళే అందంగా తీర్చి దిద్దే వాళ్ళం.

సంత్సరానికి రెండు సార్ల పనికొచ్చే కర్ర బొంగు వెనక క్లాసు పై రేకుల మీద ఉండేది. దాన్ని రవి గాడు అమ్జాద్ తీసేవోల్లు. నేను ఆరిఫ్ మూడు రంగుల కయీతలని బొంగు చుట్టూ అతికించడానికి కత్తర్లతో అందంగా కత్తి రించటోల్లం.  మా ఆయ గిన్నెలో వేడి వేడి లయ్యి పిండి పట్టుకొచ్చేది. చిన్న బకిట్లో నీళ్ళు తీసుకొచ్చి కర్ర బొంగుని శుబ్రంగా కడిగి లయ్యి పిండిని పూస్తుంటే వెంటనే కత్తిరించుకోని పెట్టుకొన్న కాషాయం, తెలుపు పచ్చ, రంగు కయీతలని, అందంగా అతికించేవోల్లం.
వారం ముందునుండే అబ్బో ఎంత హడావిడి చిన్న తరగతులలో ఉండే ఇంగ్లీష్ మీడియం పిల్లలంతా దేశ భక్తి పాటలు, డాన్సులు ప్రకటిస్ చేసేవోల్లు.

హిందీ టీచర్ నాతోని పట్టుబట్టి హిందీలో ఉపన్యాసం ప్రాక్టిసు చేపించేది. బహుషా క్లాసు లో ఫస్టనో లేక హిందీ బాగా మాట్లాడడం అనో తెలియదు కాని మాట్లాడాలని పట్టుబట్టేది.
ఏందో రెంద్రోజులసంది మస్తు ప్రాక్టీసు చేసుకునేవొన్ని ఇగ రేపనంగా ప్రిన్సిపాల్ గారు పిలిచి రేపు నీ ఉపన్యాసం తెలుగులో ఇమ్మనేది. హిందీ టీచర్ కి అదే విషయం చెప్పటంతో సరే అని తెలుగులో ప్రాక్టిస్ చేయమనేది.

ఎవలవలివో పెద్ద పెద్ద పేర్లు త్యాగాలు, స్వాతంత్ర్యం, బ్రిటిషు, భారతదేశం, యుద్ధం, డేట్ లు, అర్ధరాత్రి స్వాతంత్ర్యం, నేటి బాలలే రేపటి పౌరులు, ఇంకేందేందో ఉండేది ఆ ఉపన్యాసం లో. తెల్లారితే జెండా పండగ.

రాత్రంతా చదువుకొనే వొన్ని.
అవే ఆలోచనలు ఉపన్యాసం లో ఉన్న కథలో ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా తమ వంతుగా తాము దేశ స్వాతంత్ర్యం కోసం పాటు పడడం.
ఎవరెలా కష్టపడిన చివరికి దేశ స్వాతంత్రమే ప్రధాన సూత్రంగ పాటుపడడం నాకు చాల ఆశ్చర్యానికి గురిచేసింది.

ఒకరు మౌనంగా సత్యాగ్రహం చేస్తే,
ఇంకొకరు ఎదురు తిరిగి నినాదం చేసారు,
మరొకరు సైన్యాన్ని కూడగట్టుకొని సమ ఉజ్జిలుగా ఎదురుతిరగడం,
ఏవిధంగా మనల్ని కొల్లగోడుతున్నారో అదేవిధంగా మనం వాళ్ళని కొల్లగోడుధమని ఇంకొకరు.
ఎవరు ఏ రకంగ పోరాడిన చివరికి దేశం కోసమే కదా అని నన్ను నేను సర్దిపుచ్చుకునే వొన్ని.
ఇదంతా గతం నాకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి పంద్రా ఆగస్టులో విన్న మాటలే విన్న చరిత్రలే కావచ్చు కాని ఇప్పుడెం చేయాలి.

ఒక్క రోజు నిల్చున్న జెండా కర్ర మళ్ళి ఐదునెల్ల దాక రేకుల మీదే నడుం వాల్చుతుంది.
సూర్యకిరణలకు  చమక్కుమని మెరిసే రంగులతో రెప రెప లాడిన త్రివర్ణ పతాకం ఇస్త్రి చేసుకొని మడత పెట్టుకొని బీరువా అర లో సేద తీరుతుంది.
అప్పుడప్పుడు  టీవీ లో క్రికెట్ ఆటలో ఇండియా గెలిచినప్పుడు, మా గల్లి పెద్ద పెద్దోళ్ళంత పట్టుకొని తిరగే టప్పుడు కనిపించేది ఆ జెండా.
నా చిన్ననాడు చాల కాలం వరకు స్వతంత్రం అనే పేరుకు అర్ధం మూడు రంగుల జెండా అని మాత్రమే నాకు తెలుసు.
ఆ జెండా ఎగరడానికి "స్వతంత్రం, గణతంత్రం" అనే రెండు పండుగాలోచ్చాయ్ అని మాత్రమే తెలుసు.

పరి పరి విధాలతో బుర్ర వేడిక్కి ఎన్నో ప్రశ్నలకు సమాధాన పరుచోకోలేక దుప్పటి కప్పుకొని పడుకోంటుంటే అమ్మ నా స్కూల్ డ్రెస్సు నీలం తెలుపు చిన్న చిన్న అడ్డం నిలువు గీతలు గల బుషోటు, నీలం రంగు పైంటు,  పైన కింద నీలం మధ్యలో తెలుపు తో అడ్డగీతలున్న నడుం బెల్టు, బ్లాకు సాక్సులతో బూట్లు, అన్ని ఓ పక్కన సర్ది పెట్టేది.

పొద్దున్న ఆరు గంటల ప్రాంతాన, నను నిద్ర లేపేది అమ్మ.
పల్లుతోముకొని వొచ్చి ఉపన్యాసం పేపర్ను ముందేసుకొని అక్షరం పోల్లుబోగుండా తెగ బట్టి పట్టేవొన్ని.
ఏమో నేను యధ్రుచికంగా నా మనసుకి అర్ధంకాని చాల విషయాలు బట్టి పట్టక తప్పకపోయేది.
చుట్టూ కరతాళ ధ్వనులు మోగిన ఉపన్యాసం ఇవ్వడంలో ఆనందం ఏ రోజు నాకు కలగలేదు. ఎందుకో మరి నా మనసుకు నా ఆలోచనలను బయటపెట్టే స్వాతంత్ర్యం అప్పటికి నాకు రాకపోవడం వాళ్ళ ఏమో. ఈ సారైనా సాధ్యమవుతుందో అనుకుంటే ఈ సారి కూడా బట్టి పట్టక తప్పలేదు.

కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగినాయి లే స్నానం చేయిపో. అని అమ్మ చెప్పడం తో  కాగుతున్న నా ఆలోచనను ఆర్పేసి, ఉపన్యాసం కాగితాన్ని నా ప్రశ్నలని సంచిలో చరిత్ర పుస్తకంలోకి నెట్టి, ఇంటెనక బాయి కాడ బకిట్లో వేడి వేడి నీళ్ళ గిన్నలో వేపాకులు బకిట్లో పడనీకుండా పోసి గోరువెచ్చగా మారే వారకు కొన్ని చల్లనిల్లను జత చేసి, పెద్ద లైఫ్బాయ్ సబ్బు సిద్ధం చేసేది. పెద్ద చెంబుతో గబా గబా పోసుకుంటూ ఒళ్ళంతా వేప వాసన, ఈ ఆకులూ ఎందుకేస్తావ్ అని అడిగితే ఒంటికి మంచిది అని అమ్మ చెప్తుండేది. చేదువసనకు విరుధంగా సబ్బు వాసనా మత్తుగా తోచేది. స్నానం పూర్తవగానే సూర్యునికి దన్నం పెట్టుకొని, వేప చెట్టుకి దన్నం పెట్టుకొని ఒళ్ళు తుడుచుకొని.
బనీను నిక్కరు వేసుకొని ఆరున్నర ప్రాంతాన,  పైంటును అంగిని ఒక చేతిలో పట్టుకొని అమ్మ ఇచ్చిన రెండు రూపాయలని నిక్కరు జేబులో పెట్టుకొని రెండ్రుపాయలు బయటికి రాకుండా జేబులో చెయ్యి పెట్టుకొని కుండి కాడినుండి వీరేశం దుకాణం దాటుకుంటూ  గుండం వాడ రాజన్న దుకాణం పక్క గల్లిలో చాకలోల్లింటికి ఇస్త్రి చేపించుకోనేందుకు పోయేటోన్ని. అందరకి గీయల్నే గుర్తొస్తది, కాసేపుండు సేసిస్త అని కసురుకుంటోడు. జెల్దిజెయ్ స్కూల్ కు పోవాలి అని అదిరించే వొన్ని. అందరకి జేల్దే, చేస్తున్న గదా జరా సైసు అనేవాడు. కాస్త బయటికొచ్చి అన్ని గల్లిలని చూసేవాన్ని ఇక ఈ రోజు తప్ప ఇంకో రోజు ఇవి కనపడోద్దు అని కరెంటు స్థంబాలను, ఇండ్లను ఆసరాగా తీసుకొంటూ మొత్తం  జెండాలను అతికించిన తోరణాలు దట్టంగా నింపేవాళ్ళు.

మెల్లిగా ఇస్త్రి బట్టలను తీసుకొని ఇంటికేల్తుంటే జెండా తోరణాలు నాకు ఆహ్వానం పలుకుతున్నట్టు అనిపించేవి. కుండి కాడ ఆశమ్మ వాళ్ళ ఇంటిదగ్గర మూడు బాటలకాడ జెండా ఎత్తేవోల్లు, ఆడికి పెద్ద పెద్ద వొళ్ళు వచ్చేవోల్లు కొద్ది రోజుల తర్వాత ఓ పార్టీ కి సంబంధించిన జెండా మన జెండా ఎగిరేసే తుప్పు పట్టిన ఇనుప బొంగు  పక్కనే దానికన్నా  మూడు మూరల మరింత పొడుగుతో అమర్చిన కొత్త బొంగులో వారి జండాని అమర్చి చాల కాలం వరకు ఎగేరేసారు. అది చూసిన ప్రతి సారి. నా త్రివర్ణ పథకానికి రెండు రోజులే స్వతంత్రం మరి ఈ జెండా కి ప్రతి రోజు స్వతంత్రమా అనే నా ప్రశ్నకు నవ్వును సమాధానంగా ఇచ్చారు. ఆ ఏర్పాట్లను చూస్తూ ఇంటికేల్లెవాన్ని. త్వరగా బట్టలు వేసుకొని అంగిని పైంటు లోకి తోస్తూ బెల్టు పెట్టుకొని అమ్మ ధగ్గరకేల్లగానే, పారాచూట్ కొబ్బరినునే తలకు రాసి ఎడం పక్కన పాపిడ తీసి నున్నగా దువ్వి కొంచెం పౌడర్ ని మెత్తని బూరు పువ్వుతో మోకానికి అద్ది, చిన్న కుంకుమ బొట్టుని పెడుతూ ఈ రోజు జెండా పండగ, బొట్టు తుడుచుకోకు, బట్టలు మాపుకోకు, జెండా వందనం ఐపోగానే ఓ పక్కనుండి జాగ్రత్తగ రా సరేనా! ఊ.. అని అంటూ సాక్సులు తొడుక్కొని బూట్లని పాలిష్ కి బదులు కొంచెం కొబ్బరి నునేను మసిగుడ్డ కు అద్ది మొత్తం రాసేవాన్ని నల్లగా నిగనిగలాడుతున్న బూట్లను చూస్తూ ఆనందపడుతూ దారాలను కట్టుకుంటోన్ని. తెల్ల కడ్చిపుని చేతిలోకి తీసుకొంటూ స్వాతంత్ర్యం వచ్చిన నా బుజాలను నిటారుగా చేసుకొని నా పుస్తకాల సంచి వంక వెర్రిగా చూస్తుంటే ఆ సంచి నా వంక కోపంగా చూచేది.  స్వేచ్చగా గుండెలనిండా గాలులను పీల్చుకుంటూ స్కూల్ వైపుకు నా అడుగులు వేసేవి. కుండి కాడ మూలమలుపు తిర్గుతుంటే గుండు పిన్ను సహాయంతో చిన్న కగేతపు జెండాని నా అంగి జేబుకి పెట్టె వారు, అన్న అన్న అబ్బ ఇంకో జెండా ఇవ్వవా. ఎందుకు చిన్న? నా బుక్కులో పెట్టుకుంట ప్లీజ్ ప్లీజ్ అనగానే నవ్వుతూ రెండు జెండాలను చేతిలో పెట్టేవోడు, జాగ్రతగా అంగి జేబులో పెట్టుకోనేవాన్ని. గుండెను అదుముకున్న నా స్వాతంత్రపు జెండాని పదే పదే చూస్తూ మురుసిపోతు స్కూల్ కి చేరుకుంటోన్ని.

పెద్ద పెద్ద పాటకలున్న గేటుకు కుడి బాగాన ఒక్కరు పట్టే విధంగా చిన్న గేటు ఉండేది. లోపలి అడుగు పెట్టగానే నిజమైన ఆనందపు వాకిలి చేరుకున్నాన అని తలపించేది అందంగా ముస్తాబైన మా స్కుల్ని చూస్తుంటే.

అందరం పిల్లలం ఒకరి వెనక ఒకరం కొన్ని వరుసలుగా నిల్చోనేవాళ్ళం నేను రవి గాడు ఇంకా ఆరిఫ్ గాడు ముగ్గురం ప్రిన్సిపాల్ మాడంకు చేరువలో నిల్చోనేవాళ్ళం మాకు ఏమైనా పనులు పురమయిస్తారో అని. అన్నట్టుగానే మాకు పనులు తగిలేవి గాంధీ, నెహ్రు, భగత్ సింగ్, సుబాష్ చంద్ర బోస్ పటాలను శుబ్రం చేసి జెండా కర్ర కింద ఎత్తు తక్కువగా ఉండే వెడల్పు బల్లపై జాగ్రత్త గ అమర్చేవాళ్ళం. టేచర్లు మాకు సహాయం చేద్దాం అని వచ్చేవారు కాని మేము వారిని రాకని చెప్పి పూర్తి చేసేవాళ్ళం. మా ప్రిన్సిపాల్ గారు, పటాల్లో ఉన్న వారికి కుంకుమ దిద్ది కళ్ళు మూసుకొని దండం పెడుతుండగా పిల్లలమంతా అలాగే చేసేవాళ్ళము. రెండు కొబ్బరికాయలను కొట్టి పక్కన పెట్టి మెల్లిగా తాడు సహాయంతో కొన్ని పూలు రంగు రంగు కాగితాలను మూటగా కట్టి ఉంచిన జెండాను కర్ర చివరివరకు చేర్చి, మరో తాడుతో ముడి విప్పడం తో ఒక్కసారిగా రంగు రంగు కాగితాలు జెండా నుండి స్వేచ్చగా బయటకు రాగానే పిల్లలమంతా చేతులలో ఉన్న చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నరంగు రంగు కాగితాలను బలంగా జెండా వైపుకు విసిరేవాళ్ళు, అమ్జాద్ వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చిన ఐదారు పావురాలను కూడా జెండా వైపుకి వోదిలేవారు, ఆగని కరతాళ ధ్వనులతో జరుతున్న సన్నివేశమంతా కన్నులపండగల తోచేది. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించేది. తలలన్ని తలెత్తుకొని జెండా వైపుకు చూస్తూ సెల్యూట్ చేస్తూ జనగణమన గీతాన్ని అలపించేవాళ్ళం.

ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారి ప్రసంగంతో మొదలయి టీచర్ల వరకు రాగానే కొద్ది కొద్ది గ వణుకు మొదలయ్యేది నాకు, ఇది ఇప్పటిది కాదు ప్రతి సారి జరిగేదే, గుండె వేగం పెరిగేది. ఆ సమయంలో పిలిచేవారు రఘు అని. గుండెలనిండా శ్వాస తీసుకుంటూ ఎదురుగా ఉన్న పిల్లల వైపు చూస్తూ జెండా కర్రకి కొంచెం పక్కగా ప్రిన్సిపాల్, టీచర్ల ముందు నిల్చొని నా ప్రసంగాన్ని మొదలు పెట్టి పూర్తి చేసే సమయానికి నా కళ్ళు మూతలు పడి ఎవరో నన్ను బలంగా కిందికి అనగాతోక్కుతున్నట్టు భయంతో వణుకుతూ తల కిందికి జారుకునేది. నాకు తెలియకుండానే ప్రసంగం పూర్తయిందని తెలిసేది చప్పట్లు మోగుతుంటే. హమ్మయ్య పెద్ద గండం గడిచింది. అనుకుంటూ తల పైకెత్తి నవ్వుతూ మళ్ళి నా స్థానం లోకి వచ్చేవాన్ని. అందరి ప్రసంగాలు పూర్తయ్యాక, అప్పుడు పట్టుకోచ్చేది ఆయ, ప్యాకింగ్ చేసిన పొట్లాలు. ఇక అందరు కళ్ళు ఆ పోట్లలపైనే.

మేడం ఒక్కొక్కరిగా ఇస్తుంటే ముందు చిన్నతరగతి పిల్లలంతా రెండు చేతులతో తీసుకొని నెమ్మది లోపలి వెళ్ళేవాళ్ళు. అల అందరం పొట్లల్ని తీసుకొని మా క్లాస్లోకి వెళ్ళేవాళ్ళం నా కడ్చిపులో ఆ పొట్లాన్ని దాచుకొని జేబులో పెట్టుకొని. ఇక అందరం వెనక క్లాస్ ముందు వెడల్పుగా ఉన్న అరుగు మీద పిల్లలంతా వేషాలు వేసుకొని నాటకాలు, పాటలు, డాన్సు లు వేస్తుంటే. నా ఆలోచనలు మాత్రం రెపరెపలాడే జెండా వెనక దాగిన మరో ప్రపంచం వైపుకు పరుగులు తీసేవి. సమాధాన పరుచుకోలేని ఎన్నో ప్రశ్నలను మదిని తొలుస్తూ, స్వతంత్రం అంటే ఏమిటో అర్ధం కోసం వెతుకుతూ, నేను పుట్టిన గడ్డ పై మమకారం పెంచుకోవడమేనా దేశ భక్తి, ఆటలో గెలిస్తే జెండా పట్టుకొని వీధిల  మీద తిరగాడమేనా దేశభక్తి.

భానిస నుండి విముక్తి, ఇప్పుడు ఏవరికీ భానిసలుగా ఉన్నాము.
గాంధీ మహాత్ములు, ఎందరో మహానుభావులు నాకు తెచ్చిపెట్టిన స్వతంత్రం ఇదేనా,
దేశాన్ని వొదిలి పారిపోయి దేశం కోసం ఏదైనా సాధిస్తున్నమా అంటూ ఇక్కడి తెలివినంత పొరుగు దేశాల్లో ధారపోస్తున్నరన్న ఆవేదనని గొత్తు చించుకొని అరుస్తున్న పెద్దవాళ్ళకి, ఇక్కడే ఉన్న వాళ్ళు దాసోహం అంటూ ఎంత మంది పొరుగు దేశపు కంపెనీల్లో పనిచేస్తున్నారో కనిపించడం లేదేమో.

ఇప్పటికి నేను భానిసనే, నా ఆలోచనలన్నిటిని పణంగా పెట్టి ఓ మల్టీ నేషనల్ కంపెనీ (పొరుగు దేశపు) లో పని చేస్తున్నాను కేవలం నాకోసం.
నా కోసం మాత్రమే పనిచేసుకుంటున్నాను.
మరోసారి మనం బావుపడితే దేశం బావుపడుతుందంటున్నారు.
ఏమో దేశం కోసం పాటుపడని "నా" అభివృద్ధి తో దేశం ఏరకంగా వెలిగిపోయిందో నాకు తెలియదు కాని.
ఒక రకంగా వెలిగిపోతుంది  అక్రమ సంపాదనతో, బిధరికంతో, ఎన్నో రకాల లేమితో ఎప్పుడు కుంటుతున్న నా భారతం వెలిగిపోతుంది.

గాంధీ సత్యాగ్రహం పాపం స్కూల్ పుస్తకాలకి అంకితమైనది.
యువత ఆలోచనలు పొంతన లేని సొంత అబివృద్దికి, విందుల వినోదాలకి, ఉరుకుల పరుగుల జీవితానికి, గమ్యం లేని లక్ష్యాలకి, ఎటు తోచని ఆలోచనలకి, ఒత్తిడికి, స్వాతంత్రం పేరుతో పబ్బుల్లో విచ్చలవిడితనానికి అంకితమైనది.
బాగా చదువుకున్నోల్లు  రెండు పదులు దాటగానే పొరుగు కంపెనీల పుణ్యమా అని ఎక్కడిలేని సంపాదనతో స్వాతంత్రం అనే ఆయుధంతో ఉల్లాసంగా విలాసవంతమైన జీవితం గడుపుతుంటే,
నెహ్రు విసిరినా పావురాయి రెక్కని ఈ జాగా నాది ఆ జాగా వాళ్ళది అని తెగ నరుకుతుంటే రక్తం మడుగులో కొట్టుకుంటోంది.
సుబాషు తాయారు చేసిన సైన్యం తాను ఎన్నడు ఊహించలేదేమో తన దేశపు రేపటి పౌరులని ఎదిరించాడానికే మిగిలిందని.
మీసం మేలేసిన భగత్ సింగ్ రౌశ్యం నా వీధి బాలుని ఆకలి తీర్చలేకపోయిందానే నిజం తనకు ఎవరు చెప్తారు.

ఎవరేక్కడికి పోతే నాకేంటి అనుకోని ఎవరికి నచ్చినట్టు వారు జీవించడమే స్వాతంత్ర్యం అనుకుంటున్నాన నేను. నిజమే కావచ్చు
అందుకేనేమో పాపం కరుణకి అర్ధం చెప్పిన మథర్ తెరిసా ఎంత వేదనకి గురైతే తప్ప కరుణలేని మనసుల లోకంలోకి మళ్ళి నను పుట్టించకు ప్రభువా అని తన డైరీలో ఎందుకు రాసుకుంటుంది.

ప్రక్టికాల్ గ ఉంటూ, ఎం జరిగిన పట్టనట్టు చూసి కూడా మనకెందుకులే అనుకోని అన్ని చంపుకొని చేతులు కట్టేసుకొని,
నా నా నా నా అనే సొంత అభివృద్ధికోసం బానిసనై  నా మనసు చేసే అగచాట్లలో,
నా దేశం కోసమే నేను అనే భావన ఎప్పుడు నాకు గుర్తోస్తుందో.
ఎప్పుడు నిజమైన స్వాతంత్ర్యం నా బానిస మనసుకి  వస్తుందో.
ఎప్పుడూ ఎగరుతుందో కిందకి దిగని జెండా  నా మనసులో  ఏమో...

నిజాలు తెలియని, తెలుకున్న, తెలుసుకోనట్టు, నన్ను నేను మబ్యాపెట్టుకుంటూ కల్లోలపు మధనం, నా మనసులో అప్పటి నుండి ఇప్పటికి కొనసాగుతూనే ఉంది

ఒరేయ్ ఎం చేస్తున్నావ్ రా ఐపోయింది. ఇగ పోదాం పద అనడంతో  ఒక్కసారిగా పెద్ద ఆలోచనల సంద్రానికి అడ్డుకట్ట వేసి అతి చిన్న నా అనే భావనలోకి వొచ్చి. ఆ అయిపోయిందా అనుకుంటూ మెల్లిగా లేచి ఒకరివేనకల ఒకరం నెమ్మదిగా బయటికొస్తూ ఒక్క సారి వెనక్కి చూసుకున్న రెపరెపలాడే నా జెండాని, ఎందుకంటే మరో ఐదునెల్ల దాక మళ్ళి కనపడదుగా ఆ దృశ్యం.

ఇంటికి రాగానే ప్లేటులో పొట్లం విప్పి లడ్డు బూంది, నాలుగు బిస్కట్లు, రెండు చాక్లెట్లు, దారిలో వస్తుంటే కుండికాడ పంచి పెట్టిన రెండు అరటి పళ్ళ ముక్కలు, అర్వన్నం, కొబ్బరి ముక్కలు కూడా అదే పళ్ళెం లో పెట్టి ఇంట్లో అందరికి ఇచ్చేవాన్ని నా లాగే మా అక్కయ అన్నయ కూడా..

మెల్లిగా అంగి విప్పుతుంటే జాగ్రత్త గ గుండు పిన్ను తీసి జేబుకు పెట్టిన, జేబులో ఉన్న జెండాలని రాజన్న దుకాణంలో మొన్ననే  కొన్న కొత్త రూల్ నోట్ బుక్కుని బయటికి తీసి మధ్యలో కాగితపు జెండాలని బద్రపరచి ముక్కుకి దగ్గరగా పెట్టి కొత్త బూక్కు సువాసనని గట్టిగ పీల్చి. వచ్చే గణతంత్ర దినోత్సపు ఆలోచనలను బూక్కుతో జత చేసి సంచిలో పెట్టుకునే వాణ్ని.

Tuesday, August 16, 2011 at 3:50am

కామెంట్‌లు లేవు: