15, నవంబర్ 2011, మంగళవారం

తెల్ల బూట్లు

సాఫీగా సాగుతున్న నా స్కూల్ ప్రయాణంలో ఆ గంబీరమైన రోజు రానే వచ్చింది.
"పిల్లలు ప్రతి శుక్రవారం వైట్ డ్రెస్, వైట్ షూస్ వేసుకొని రావాలి. మీ పేరెంట్స్ కి చెప్పి వెంటనే కుట్టించుకోండి. సరేనా.. "
"సరే.. టీచర్" అని నేను కూడా వంత పాడాను అందరు పిలగాండ్లతో...

ఇదే విషయం అమ్మకు చెప్పాను. "తెల్ల బట్టలా.." అని వెలితిగా చూసింది.
ఆ.. అవును తెల్ల బట్టలే.. వేసుకెల్లకపోతే పనిశుమెంటట..
చెప్పిన ఐదారు వారాలకు గాని కుట్టించలేదు. నాకు మా అక్కకి.
అప్పటి దాక శుక్రవారం వొస్తుందంటేనే ఎదోల అనిపించేది.
తెల్ల బట్టలైతే వేసుకొన్నాను. కాని తెల్ల బూట్లు మాత్రం రాలేదు.

ఒక సారి మాములుగా నిల్చోబెడితే మరో సారి గోడ కుర్చీ వేయించేవొళ్ళు. అప్పటి వరకు ఎప్పుడు పనిష్మెంటు అంటే ఎరుగని నాకు నా పరిధిలో లేని బూట్ల విషయం కోసం వేయల్సోచ్చింది.

అమ్మ కి అంతకు ముందే చెప్పాను, తెల్ల బూట్లు కావాలని. ఒక సారి చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్పడమెందుకని చెప్పలేదు.
గోడ కుర్చీ విషయం అమ్మ కి తెలిస్తే తను తట్టుకోలేదు అందుకే ఇది కూడా చెప్పలేదు.
తెల్ల బూట్ల కోసం అందరు చూస్తుండగా దుఖ్ఖం దిగమింగుకొని తప్పు చేసినోడిలా తల కిందికేసుకొని గోడ కుర్చీ వేసేవోన్ని.
అప్పట్లో నాకు అర్ధం కాని విషయం నా పక్కన కూసునే వోల్లందరికీ వచ్చినట్టు నాకెందుకు రాలేదా ఈ తెల్ల బూట్లు అని.

సాధారణంగా శుక్రవారమంటే నాకు ఇష్టం. మా పాత స్కూల్ (ఏడో తరగతిలో స్కూల్ని మచిలిబజార్ నుండి ఉజిలిబెస్ కి మార్చినారు. ఇది ఐదో తరగతి నాటి మాట) ఎదురుగా కూలిపోయిన గోడలు ముళ్ళ చెట్లు దాని వెనకాల కాలి స్థలం అది మాబోటి పిలగాండ్లకి ఆటస్థలం. మట్టి గోడల పక్కనే మసీదు ఉండేది. ప్రతి శుక్రవారం మధ్యానం పూట నమాజు కోసమనే గల్లిలల్ల ఉన్న ముస్లీములంత లాల్చి పైజాములు వేసుకొని వొచ్చేటోల్లు. మొదటి అంతస్తులో మా క్లాసు. ప్రతి శుక్రవారం నమాజు, మైకు గొట్టం నుండి పెద్దగ వినపడేది. కిటికీ లోనుండి తొంగి చూస్తూ నమాజుకోచ్చిన జనాలని, దూరంగా ఉన్న గుట్టలని, కొంచెం వంగి చూస్తే రెండు చెట్ల గుట్ట (పెద్దవిగ ఉండడంతో ఆ పేరొచ్చింది. ఆ చెట్ల గురించి చాల కథలు కథలుగా చెప్పుకునే వారు), దానికి అనుకోని ఉన్న ఓ పెద్ద రాయి, వినాయకుడిని పెట్టె చోటు, అన్ని చూస్తూ ప్రశాంతంగ  వీస్తున్న గాలి సవ్వళ్ళను ఆస్వాదిస్తున్న నాకు.  రఘు వైట్ షూస్ వేసుకురాలేద అనడంతో చటుక్కున మెలకువ వచ్చి మల్లి దడ మొదలయింది. ఈ బూట్ల గొడవ తగిలిన కాడి నుంచి మనసు మనసులోనే లేదు. అనుకుంటూ, లేదు టీచర్ వేసుకురాలేదు. అని చెప్పాను, ఇంకేవరెవరు వేసుకు రాలేదు. అందరు వచ్చి గుంజీలు తీయండి. అని చెప్పడం తో నాకు తోడుగా మూడు డబ్బాల కాడి హరి, శంకర్ వచ్చాడు.
తల ఇరవై గుంజీలు తీసి, నాలో నేను కుంచించుకు పోతు గబుక్కున వచ్చి నా జాగా లో కూర్చున్న.

బెల్లు మోగడంతో పరుగుపరుగున అందరితో బాటు పుస్తకాల మూటని బుజాలకేసుకొని నిక్కరు సరి చేసుకుంటూ గబా గబా మెట్లు దిగి కింది కొచ్చి అక్కయ కోసం చూస్తూ నిల్చున్న..
కళ్ళలో నీళ్ళు తెచ్చుకుందేమో ఎదోల ఉంది. ఏమి మాట్లాడలేదు. ఇద్దరం కలిసి ఇంటి ముఖం పట్టాం. ఇంట్లో అడుగు పెట్టాకా గాని నోరుతేరవలేదు అక్కయ.  ఉన్నపలానా ఏడుపందుకుంది. వైట్ షూస్ వేసుకురలేదని టీచర్ కొట్టిందని.

ఈ ఆదివారం చౌరస్తాకి బోయి కొందాం ఊరుకో అని చెప్పడం తో ఊరుకుంది. అక్కయతో పాటు నాక్కూడా కొనిస్తుంధిగా మళ్లీ నేనేడవడం ఎందుకు అనుకున్నాను.

తెల్లారితే శనివారం. ఆదివారం గురించి, చౌరస్తా గురించి, ఆలోచిస్తూ ఒక్క పూట గడిచిపోయింది. ఎందుకో నాకు ఊహ తెలిసినప్పటి నుండి హన్మకొండ  చౌరస్తా అంటే ఎక్కడలేని అభిమానం నాకు, కొత్త బట్టలకి, కొత్త పుస్తకాలకు, మా చిన్నమ్మని బస్సు ఎక్కించేందుకు, స్టౌ బర్నాల్ రిపేరుకు, పళ్ళు కొనుక్కోవడానికి, గాజులు, వంట గిన్నెలు, ఇలా రకా రకాల కోసం చౌరస్తాకి మా అమ్మ నన్ను తోలుకుబోయేది.

ఎప్పుడైనా చౌరస్తాకు బోతున్నాం అని చెప్తే చాలు, మొఖం కడుక్కోచ్చుకొని చిన్నగా గుండ్రటి డబ్బాలో ఉన్న పౌడర్ని దూది పువ్వుతో మొఖానికి  రాసుకొని తయారయ్యేటోన్ని.

అనుకున్నట్టుగానే ఆదివారం వచ్చింది. మొన్న మొదలయిన నా సంబరం, ఈ రోజుకి పెరుగుతూ పెరుగుతూ నాలుగింతలు ఎక్కువైంది. ఈ రోజు కొనే బూట్లని వేసుకెల్లడానికి  శుక్రవారం ఎప్పుడేప్పుడువొస్తుంద అనేకాడికి చేరుకుంది నా సంబరం.

ఎప్పటి లాగే రోడ్డుకిరువైపు జరుగుతున్న, కనిపిస్తున్న దృశ్యాలను చూస్తూ, ఏవేవో ఆలోచిస్తూ, అమ్మ వేలుని గట్టిగ పట్టుకొని నిక్కరు సర్దుకుంటూ మూతి ముక్కు తుడుచుకుంటూ, నడుచుకుంటూ, ఇరవై నిమిషాలకు గాని చేరుకోలేదు చౌరస్తాకి.

ఎప్పుడు వెళ్ళే గడ్డం మూసలయన ఉండే చెప్పుల షాపుకి వెళ్ళాం. నా ముప్పై రూపాయల పారగన్ చెప్పులు, నా నల్ల బూట్లు వాటికి కట్టుకొనే దారాలు సాక్సులు  గీడనే కొనుక్కున్నాం.

ముందు అక్కయ్య కోసమని చుపెడుతున్నాడు. చూస్తున్న కొద్ది ఎప్పుడెప్పుడు నాకు చూపిస్తాడ అని, నా చెప్పులు పక్కన విప్పి కాలి కాళ్ళతో నిల్చుని చూస్తున్న. అన్ని చూసిన  కాసేపటికి ఒకటి సెలెక్టు చేసుకుంది అక్కయ.

ఇక నావంతుగ వెళ్లి పొట్టి బల్లపై కూర్చున్న అన్ని చూపిస్తున్నాడు. ఒకటి వేసుకున్నాను. ఆ మంచిగున్నాయ్ చాలు. అని చెప్పి, డబ్బల బెట్టి కవర్లో పెట్టి ఇవ్వు అని చెప్పి లేచాను.

ఎత్తు పట్టీల చెప్పుల వైపు చూస్తూ అక్క, నా సంబరం లో నేను,  బెరమాడడంలో అమ్మ.

నాకు ఏమి వినిపించలేదు ఆ బేరాలు, కాని చివరకి ఒకటి మాత్రం చక్కగా వినపడింది. "ఆ చిన్న బూట్లు తీసేయ్ ఇప్పుడు డబ్బులు లెవ్వు" అని అమ్మ అనడం.

అప్పటి వరకు ఉన్న సంతోషమంత చప్పున ఆగిపోయింది. ఎం జరిగిందో తెలియదు. ఎలా జరిగిందో తెలియదు. కాని నన్ను మురిపిస్తూ ఊరించిన తెల్ల బూట్లు నాకు సొంతం కాలేదని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఒక్క సారిగా అన్ని గుర్తొస్తున్నాయి. వెక్కిరిస్తూ గుంజీలు తీయమంటున్న టీచర్, ఒరిగి కూర్చున్న గోడ కుర్చీ, అదే బయంతో దడ పుట్టించే శుక్రవారం. ఎప్పుడొస్తుంద అనే ఎదురుచూపులు, క్షణంలోనే అయ్యో మళ్లీ వస్తుందా అనేస్తాయికి నేట్టుకున్నాయి నా ఆలోచనలు.

వేలాడదీసిన  తెల్ల బూట్లు నన్ను చూసి వెకిలిగా నవ్వుతున్నాయి.
ఏంటో చిన్నప్పటినుండి "సరోజనమ్మ పిల్లలు చూడు తల్లి చెప్పినట్టుఇంటరు" అని వాడ వాడ మొత్తం కలిసి ఇచ్చిన బిరుదుని మోసుకుంటూ ఉన్న నాకు అది గుర్తుకురావడంతో ఎక్కడ ఆ బిరుదుని పొడగోట్టుకుంటానో  అని, అమ్మ మా టీచర్ కొడుతది నాక్కూడా కావలి తెల్ల బూట్లు అని నోరు తెరిచి అడగలేక పోయా..
ఆయినా తనకి తెలియదా నాక్కూడా కొనాలని, డబ్బులు సరిపోలేదు అని నాకు నేను  సర్దిపుచ్చుకుంటున్న కూడా,
లోలోపల దుఖ్ఖం తన్నుకుంటూ వస్తుంది.
వస్తున్న దుఖ్ఖంని దిగ మింగుకుంటూ బారంగా పడుతున్నాయి నా అడుగులు.
అమ్మ బుధరకిస్తూ ఏమోమో చెప్తుంది కాని ఒక్కటి కూడా వినపడట్లేదు.

అన్ని గల్లిలూ మూల మలుపులు తిరుగుతూ లక్కాకుల పద్మారావు దుకాణంకు ఆనుకొని ఉన్న ముసలవ్వ డబ్బా కిరాణంలో బెల్లంతో చేసిన ప్యాలాల ముద్దలు ఓ ఆరు కొని ఒకటి నాచేతి కిచ్చి మిగతావి దస్తి (కచ్చిఫు) లో మూట కట్టి, నడుచుకుంటూ వెళ్తుంటే, అరచేతిలో నిండిన ప్యాలాల ముద్ద కొరికాను, ఎందుకో రుచించలేదు, క్షణనికొకసారైన వోద్దన్న బయటికోస్తున్నాయి కన్నీళ్ళు.గబా గబా తుడుచుకుంటూ వెళ్ళాను. దుప్పటి ముసుగులో కన్నీళ్ళతో యుద్ధం చేస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్ననో తెలియలేదు.

మళ్ళీ శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజు అర చేతిని తిప్పి మట్టెల మీద రూలు కర్రతో రెండు దెబ్బలు వేసింది టీచర్. ఉన్నపలానా బయటపడ్డాయి దిగామింగుకున్న కన్నీల్లన్ని. ఎవరికి ఎలా చెప్పాలో తెలియని పరిస్థితికి సమాధానంగ కన్నేల్లె మిగిలాయి. ఇదే అవకాశంగ బావించి ఉన్న దుక్కన్నంత బయటికి కక్కాను. కక్కిన తర్వాత కాని మనసు కుదుట పడలేదు. ఈ సంగటన తర్వాత దుక్కన్ని దిగామింగుకోవాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురవుతుందేమోనని  ఇప్పటి వరకు దేని పైన ఆశ పెట్టుకోలేదు.
అదే రోజు సాయంత్రం మా పిలగాండ్లంధరిని ఆటలాడించడానికి కాలి అట స్థలానికి తీసుకెళ్ళారు, తెల్ల బూట్లు లేని మమ్మల్ని వొదిలేసి.
సాధారణంగానే నేను ఆటలకి దూరం, ఆరోజుతో నాకు ఆటలంటేనే విరక్తి కలిగింది.

ఇంటికొచ్చాను దేని గురించి కూడా అమ్మకు చెప్పలేదు. అనాసక్తిగానే అన్ని పూర్తి చేసుకున్నాను. అక్కయ అన్నయతో పాటే బైరిశెట్టి సమ్మయ్య వాళ్ళింటికి టీవీ లో వచ్చే చిత్రలహరి చూడడానికి వెళ్ళాను. అది కూడా నచ్చక పోవడంతో ఇంటికొచ్చాను. త్వరగా ఇంటికి తాగొచ్చిన బాపుతో భయంతో గడపలేక గ్లాసుడు మంచినీళ్ళు తాగి మళ్లీ టీవీ కాడికెళ్ళ. చిత్రలహరి అయిపోయినాక ఇంటికెళ్ళేసరికి బాపు పడుకున్నాడు.
పుస్తకాల సంచిని ముందేసుకొని చూచి రాతలు పూర్తి చేసుకుంటుండగా గుర్తొచ్చింది. వారం క్రితం స్కూల్లో అడిగిన ప్రశ్న "పిల్లలు ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. మీరు మీ మీ లక్ష్యలేంటి" అని అడిగిన ప్రశ్నకు ఎవరికి తోచ్చినట్టు వారు డాక్టర్, లాయర్, పోలీసు అని చెప్తుంటే నేను మాత్రం ఇంకా ఏమి అనుకోలేదని చెప్పా. అది గుర్తొచ్చి అప్పుడు నిర్ణయించుకున్నాను "నా జీవిత లక్ష్యం తెల్ల బూట్లు కొనుక్కోవడమని". ఎక్కడ మరిచిపోతనోనని చూచి రాత నోట్ బుక్ లో రాసుకొని భద్రపరుచుకున్న ఆ లక్ష్యాన్ని ఆ బుక్కుని.

మా అమ్మ స్కూలుకొచ్చి ఫీసు కట్టినప్పుడు ప్రిన్సుపాల్ మాడంతో  ఎం మాట్లదిందో ఏమో అప్పటినుండి ఏ టీచర్ కూడా తెల్ల బూట్ల గురించి అడగలేదు. స్కూల్ చదువు పూర్తయేంతవరకు కూడా తెల్ల బూట్లు కొనుక్కున్న దాకలాలు లేవు.

**

మొన్నీ మధ్య ఆ  చిన్న నాటి చూచి రాత బుక్ తీసి చూసా.
బుక్ చివర్లో "తెల్ల బూట్లు కొనుక్కోవడమే నా జీవిత లక్ష్యం" అని రాసుకున్న మాటలు, ఇప్పుడు నవ్వు తెప్పించాయి.

ఆ తెల్ల బూట్లతో జీవితంలో చాల నేర్చుకున్నాను.
-దేని పై ఆశలు పెంచుకోకపోవడం,
-ఒకరిస్తారు అని ఎదురుచూడకుండా కష్టపడి సంపాదించుకోవడం.
-ఏదైనా ఉచితంగా దొరికితే, అంతే విలువైనదేదో నా నుండి దూరమైంధనో లేక  దూరం కబోతున్నధానో అని నిర్ణయించుకోవడం.
-కోరుకున్న ప్రతీది తప్పక తీరుతుందనే ధైర్యం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే నేర్చుకున్న..

సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత గడిచిన ఇన్నేళ్ళలో ఎన్నో తెల్ల బూట్లను నా కాళ్ళతో కసితో తోక్కేసిన, మొదటి సారి తొడిగినా ఆ తెల్ల బూట్లు కాసేపు మదిలో వేలాడి వెక్కిరించాయి..

Thursday, September 15, 2011 at 6:54pm

కామెంట్‌లు లేవు: